తిరుపతి, సాక్షి: మున్సిపల్ కార్పొరేషన్‌కు తన రాజీనామా విషయంలో తప్పుడు కథనాలు ప్రచురితం కావడంపై వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జి భూమన అభినయ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అందులో ఎలాంటి గోప్యతా లేదని.. తాను రాజీనామా ఎప్పుడు చేశానో, దానికి ఎప్పుడు ఆమోదం లభించిందో.. తదితర విషయాల్ని ఆయన మీడియాకు వివరించారు.
‘‘తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, అలాగే నేను ప్రాతినిథ్యం వహించిన నాల్గో డివిజన్ కార్పొరేషన్ పదవికి నేను ఎప్పుడో రాజీనామా చేశాను. తిరుపతి వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నా పేరు ఖరారైన వెంటనే, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చే నాయకుడిగా ఆ పదవుల్ని వద్దనుకున్నా. నా రాజీనామాను మేయర్ డాక్టర్ శిరీష గారితో పాటు మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఆమోదం తెలిపారు.
.. నేను పదవులకు రాజీనామా చేసిన విషయం ఎన్నికలకు ముందు అన్ని పత్రికల్లో వచ్చింది. తాజాగా ఒక పత్రికలో నా రాజీనామాల విషయాన్ని గోప్యంగా వుంచానని రాయడం ఆశ్చర్యం అనిపించింది.
.. నా రాజీనామా లేఖను బయట పెట్టొద్దని ఒత్తిడి చేసానని రాయడం వారి ఆలోచనల సంకుచితాన్ని బయట పెడుతున్నదే తప్ప, అందులో నిజం లేదని అందరికీ తెలుసు. పచ్చకామెర్లోళ్లకి లోకమంతా అట్లే కనిపిస్తుందని పెద్దలన్నట్టుగా, రాజీనామాపై గోప్యత పాటించడం వెనుక అనుమానాలున్నాయని రాయడాన్ని ఆ కోణంలోనే చూడాల్సి వుంటుంది.
.. ప్రజాతీర్పు నాకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ హుందాగా స్వీకరించాను. ప్రజాతీర్పును గౌరవించి కొత్తగా ఎన్నికైన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారికి నేను శుభాకాంక్షలు కూడా తెలియజేశాను.
.. డిప్యూటీ మేయర్ పదవి కోసం కక్కుర్తి పడే స్వభావం నాది కాదని మరోసారి చెబుతున్నాను. తిరుపతిలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో పుట్టడం, ఈ నగరానికి డిప్యూటీ మేయర్‌గా రెండేళ్ల పాటు సేవ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అంతే తప్ప, దాన్ని అలంకారంగా నేనెప్పుడూ వాడుకోలేదు. రాబోయే రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా తిరుపతి ప్రజాసమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా రాజీనామాపై నిజానిజాలు చెప్పడానికే ఈ వివరణ’’ అని భూమన అభినయ్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. ఆంధ్రజ్యోతి పత్రికలో తాజాగా డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పదవులకు అభినయ్ రాజీనామా అంటూ తాజాగా కథనం వచ్చింది. పోలింగ్‌కు 40 రోజుల ముందే రాజీనామా లేఖ సమర్పించారని తెలిసింది. అయితే మున్సిపల్ యంత్రాంగం ఈ విషయం చాలా గోప్యంగా ఉంచిందని అందులో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment