లక్ష నాగళ్లతో కేసీఆర్‌ ఫాంహౌస్‌ను దున్నుతాం | BJP Chief Bandi Sanjay Slams To CM KCR | Sakshi
Sakshi News home page

లక్ష నాగళ్లతో కేసీఆర్‌ ఫాంహౌస్‌ను దున్నుతాం

Published Sat, Jul 31 2021 2:24 AM | Last Updated on Sat, Jul 31 2021 2:24 AM

BJP Chief Bandi Sanjay Slams To CM KCR - Sakshi

శుక్రవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో బడుగుల ఆత్మగౌరవ పోరు సభలో డప్పు కొడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

సాక్షి, హైదరాబాద్‌/కవాడిగూడ: రాష్ట్రంలో 2023లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఆ వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫౌమ్‌ హౌస్‌ను లక్ష నాగళ్లతో దున్నుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. అలాగే ప్రగతి భవన్‌ గేట్లు బద్దలు కొట్టి అక్కడే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహ నిర్మాణానికి మొదటి సంతకం చేస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద బీజేపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మోర్చాల ఆ«ధ్వర్యంలో నిర్వహించిన ‘బడుగుల ఆత్మ గౌరవ పోరు’ సభలో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేస్తూ సాగిస్తున్న దుర్మార్గాలపై ప్రజలను చైతన్యపరచడానికి ‘బడుగుల ఆత్మ గౌరవ పోరు’చేస్తున్నట్టు ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఫాంహౌస్‌ భూములను పేదలకు పంచడం ఖాయమన్నారు. కేసీఆర్‌ చేతిలో బందీ అయిన తెలంగాణను విముక్తం చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. బడుగుల సమస్యలతోపాటు అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్ల కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామన్నారు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో గెలిచేందుకే కేసీఆర్‌ ‘దళిత బంధు’ తీసుకొచ్చారని, ఈ ఎన్నికల్లో ఓటుకు ఎన్ని లక్షలు ఇచ్చినా, మరెన్ని జిమ్మిక్కులు చేసినా గెలిచేది బీజేపీయేనని అన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ఎంపీ సోయం బాపూరావు, ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపడతామన్నారు.

 

ప్రజాస్వామిక తెలంగాణకు కలసి రావాలి..
ప్రజాస్వామిక తెలంగాణ సాధనకు అందరూ కలసి రావాలని, గడీల పాలనను బద్దలు కొట్టడానికి బండి సంజయ్‌ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. బీసీల నేత మోదీని ప్రధానిగా, దళితుడు రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదేనన్నారు. దళితులను మోసం చేసిన కేసీఆర్‌ను అడుగడుగునా అడ్డుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పిలుపునిచ్చారు. దళిత బంధును రాష్ట్రమంతా అమలు చే యాలని డిమాండ్‌ చేశారు. ఏపీ సీఎం వై.ఎస్‌. జగన్‌ను చూసి కేసీఆర్‌ నేర్చుకోవాలని, పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు డిమాండ్‌ చేశారు. దళితులకు ఇచ్చిన భూములపై సీఎం కేసీఆర్‌ శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌రావు, పార్టీనేతలు కె.స్వామిగౌడ్, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఏపీ జితేందర్‌రెడ్డి, జి. విజయరామారావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement