ఉమా భారతి, వసుంధరా రాజే
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీలో అంతర్గత రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు సందర్భోచితంగా బహిర్గతమవుతుంటాయి. పశ్చిమ బెంగాల్‌లో మమతాబెనర్జీ వంటి మహిళానేతను ధీటుగా ఎదుర్కొని దేశవ్యాప్తంగా తమ సత్తా చాటుకోవాలని ఉవ్విళూరుతున్న కమలదళ పెద్దలకు, సొంత పార్టీలోని ఇతర రాష్ట్రాల మహిళానేతల ప్రణాళికలు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత అధిష్టాన నిర్ణయాలతో రాజస్తాన్ రాజకీయాల్లో నిశ్శబ్దంగా ఉన్న వసుంధరా రాజే మరోసారి యాక్టివ్ అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్నారు. రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ గడువు ఉన్నప్పటికీ పార్టీలో మరోసారి తన పట్టును పెంచుకొనేందుకు, తన బలాన్ని హైకమాండ్ ముందు నిరూపించుకొనేందుకు వసుంధరారాజే ఏ అవకాశాన్ని వదులుకొనేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నారు. అందులో భాగంగానే మార్చి 8న తన పుట్టినరోజున రాష్ట్రవ్యాప్తంగా దేవ్ దర్శన్ యాత్రను ప్రారంభించి తమ బలాన్ని నిరూపించుకోవాలని వసుంధరా రాజే సింధియా వర్గం నిర్ణయించింది. దీంతో రాబోయే రోజుల్లో రాజస్తాన్ బీజేపీలో పైచేయి సాధించే గొడవ తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మౌన ముద్రలో వసుంధర..
ఇటీవల రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ వైఫల్యానికి మాజీ సీఎం వసుంధరారాజేపై విధేయత కారణంగా జిల్లాల్లో పార్టీకి సమాంతరంగా పార్టీ యూనిట్లు పనిచేయడమే కారణమని పలువురు బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు జరిగిన 90 మున్సిపల్‌ల్లో బీజేపీ 38 గెలుచుకోగా, అధికార కాంగ్రెస్ పార్టీ 50 గెలుచుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు వసుంధరా రాజేను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆమె వర్గం నాయకులు అధిష్టాన పెద్దలపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. 2019లో కమలదళం అధిష్టానం వసుంధరా రాజే అనుయాయులను పక్కనబెట్టి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సతీష్ పూనియాను నియమించడంతో పాటు, రాష్ట్ర నాయకులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ మేఘవాల్, కైలాష్ చౌదరి వంటి వారికి కేంద్ర ప్రభుత్వంలో మరింత ప్రాధాన్యత కల్పించినప్పటి నుంచి ఆమె మౌనముద్రలో ఉన్నారు.
గతేడాది జూలైలో సీఎం గహ్లోత్‌కు వ్యతిరేకంగా సచిన్ పైలట్ తిరుగుబాటు చేసిన కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభ సమయంలోనూ ఆమె మౌనంగా ఉన్న కారణంగా కమలదళం ఆ సందర్భాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంతో పూర్తిగా విఫలమైంది. కానీ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో రాజే మద్దతుదారులు ఇప్పుడు ఆమె మళ్ళీ అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోవడంలో ముందుండాలని కోరుకుంటున్నారు. గత ఆదివారం వసుంధరా రాజేకు గట్టి పట్టున్న కోటాలో జరిగిన ఒక అంతర్గత సమావేశానికి సింధియా వర్గ బీజేపీ ఎమ్మెల్యేలు హాజరై, 2023 ఎన్నికల్లో ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటించేలా పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు.
అధికార గహ్లోత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పార్టీని పునరుద్ధరించే సామర్థ్యం, ఛరిష్మా ఉన్న లీడర్ కేవలం వసుంధరా రాజే అని ఆమె వర్గ ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు. ఏప్రిల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ర్యాలీని నిర్వహించాలని, ఆ ర్యాలీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజే మౌనంగా ఉన్న కారణంగా పార్టీకి తీరని నష్టం జరిగిందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. మార్చి 8న ప్రారంభమయ్యే గోవర్ధన్ యాత్ర కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే యూనుస్ ఖాన్ సమన్వయం చేస్తారని రాజే వర్గం తెలిపింది.
రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీలో దక్కని ప్రాధాన్యత..
సతీష్ పునియాను రాష్ట్ర అధ్యక్షుడిగా అధిష్టానం నియమించిన తర్వాత పార్టీలో అంతర్గత సమస్యలు బహిర్గతం అవుతున్నాయి. రాజే మనస్తత్వానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు అధికార పగ్గాలు అప్పగించేందుకు అధిష్టానం ఇష్టపడదని, అధిష్టాన పెద్దలతో సఖ్యత లోపించినకారణంగా అంతర్గతంగా పరిస్థితులు సర్దుకోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పార్టీలోని అంతర్గత సమస్యల కారణంగా రాజేను అధిష్టానం పక్కనబెట్టినప్పటికీ, రాష్ట్రంలో గహ్లోత్‌ను ఎదుర్కోగలిగి, ఓడించగలిగే బలమైన నాయకులు ఎవరూలేరనే అంశాన్ని అధిష్టానం అంగీకరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
కమలదళం పెద్దలతో వసుంధరా రాజేకు మధ్య ఏమాత్రం సత్సంబంధాలు లేని కారణంగా ఇటీవల ఏర్పాటైన రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీలో ఆమె వర్గానికి ఏమాత్రం ప్రాధాన్యత దక్కలేదు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి సహా రాజే సన్నిహితులు అనేకమందిని పక్కనబెట్టి కేవలం 14మందికి మాత్రమే అవకాశం కల్పించడాన్ని సింధియా వర్గం జీర్ణించుకోలేకపోతోంది. అయితే 2012, 2018ల్లో జరిగిన పరిణామాల సమయంలో అధిష్టానంపై పైచేయి సాధించిన పరిస్థితులు ప్రస్తుతం లేవన్న విషయాన్ని వసుంధరా రాజే అర్థంచేసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
మద్య నిషేధాన్ని కోరుతూ ప్రచార యాత్ర
మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సొంత పార్టీ ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకొని పార్టీ అధిష్టానాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి రంగంలోకి దిగుతున్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి మద్యపాన నిషేధం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె మార్చి 8న ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో కమలదళ పెద్దలకు మరో తలనొప్పి ఎదురుకానుంది. ఇప్పటికే మద్యపాన నిషేధం విషయంలో నిర్ణయం తీసుకోకపోవటంపై సొంత పార్టీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై ఆమె ఆరోపణలు చేశారు. మరోవైపు గత నెల 21న పార్టీ పాలిత అన్ని రాష్ట్రాల్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమాభారతి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాసిన విషయం తెలిసిందే.
ఉత్తరాఖండ్‌లో జరిగిన విపత్తు నేపథ్యంలో కేంద్రప్రభుత్వ విధానాలపై నేరుగా దాడి చేశారు. మోదీ ప్రభుత్వ మొదటి పదవీకాలంలో జల వనరులు, నదీ అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ మంత్రిగా గంగానది, దాని ప్రధాన ఉపనదులపై విద్యుత్ ప్రాజెక్టులను తాను వ్యతిరేకించారని ఉమాభారతి ఇటీవల వ్యాఖ్యానించారు. అందుకే పార్టీ హైకమాండ్‌కు సవాలు విసురుతూ ఆమె రాష్ట్రవ్యాప్తంగా మద్యపాన నిషేధ అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌తో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, పార్టీ అధిష్టానం తనను పక్కనపెట్టేయడాన్ని ఉమాభారతి జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment