
బీజేపీ చప్పుడు చెయ్యట్లేదేం ?
బాబు మళ్ళా నిజరూపం చూపించారా
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి టీడీపీ, బీజేపీ జనసేనతో కూడిన కూటమిని కూర్చిన తరువాత ఎందుకనో ఆ సందడి లేదు. పెళ్లి సమయంలో ఉన్నప్పటి కళ కాపురానికి వెళ్లేసరికి లేనట్లుగా మారింది. దీంతో ఇది కొంపదీసి వన్ సైడ్ లవ్వు గట్రా కాదు కదా అనే సందేహాలు వస్తున్నాయి. దానికితోడు కొంపదీసి చంద్రబాబు ఎప్పట్లానే తన నిజరూపాన్ని బయటకు గానీ తీసారా? దాని దెబ్బకే బీజేపీ వాళ్లకు అందులోని ప్రధాన పార్ట్‌నర్‌కు బుర్ర తిరిగిపోయి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయిందా అనే డౌట్స్ తన్నుకొస్తున్నాయి.
ఒంటె సాయిబు కథ మాదిరి.. చంద్రబాబు మళ్లీ తన స్మార్ట్ బుర్రను వాడి బీజేపీని తొంగోబెట్టే ఎత్తులు వేసారా? వేస్తున్నారా? అనే అనుమానాలు బీజేపీ పెద్దల్లో ఉన్నాయి అంటున్నారు. అందుకే కూటమిలో ఇటు టీడీపీ.. జనసేన పార్టీలు ఎవరికివారు సీట్లు.. స్థానాలు ఖరారు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా బీజేపీ మాత్రం ఎక్కడా చప్పుడు చేయడం లేదు.. అసలు కూటమిలో ఉందా లేదా అన్నట్లుగా గుంభనగా ఉంది.
వాస్తవానికి పొత్తుల కోసం ఢిల్లీ చుట్టూ తిరిగిన చంద్రబాబు మొత్తానికి నానా రికమెండేషన్ల తరువాత ఢిల్లీ బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ సంపాదించి వారిని ఎలాగోలా పొత్తుకు ఒప్పించారు. అయితే, ఆయన ఆ చర్చల సందర్భంగా అక్కడ ఇచ్చిన సీట్ల హామీ వేరని, ఢిల్లీ నుంచి వచ్చాక ఇక్కడ ఆయన చేస్తున్న రాజకీయం వేరని అంటున్నారు. ఢిల్లీ పెద్దలతో చర్చల సందర్భంగా బీజేపీకి కనీసం పది లోక్‌సభ.. అదే సంఖ్యలో అసెంబ్లీ సీట్లు ఇచ్చేనందుకు బాబు ఒప్పుకున్నారని అంటున్నారు. ఇక, ఆంధ్రాకు వచ్చాక మాట మార్చేసి ఆరు లోక్‌సభ, ఓ పది.. అంతకన్నా తక్కువ శాసనసభ సీట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని చెబుతూ తన లెక్కలనే ఎల్లోమీడియాలో కథనాలు రాయించారని బీజేపీ గుర్తించింది.
అందుకే ఎకాఎకిన కేంద్ర జలవనరుల శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను ఢిల్లీ పెద్దలు తమ ప్రతినిధిగా ఆంధ్రకు పంపించారు. ఇక్కడ కూడా బాబు తన అతి తెలివి చూపించి ఆయన్ను బురిడీ కొట్టించాలని చూశారని తెలుస్తోంది. ఢిల్లీలో చెప్పిన మాటకు ఇక్కడి మాటకు తేడా రావడంతో ఒక రోజంతా ఇక్కడే ఉండి లెక్కలు తెలుద్దామని భావించిన షెకావత్ మొత్తానికి ఏమీ ఫైనల్ చేయలేక బాబు అతి తెలివికి సమాధానం చెప్పలేక బుర్ర ఖరాబై ఢిల్లీ వెళ్లారు. గంటలకొద్దీ చర్చ జరిగినా ఒక్క ముక్కా అర్థం కానీ షెకావత్‌కు మాత్రం ఒకటి అవగతమైంది. ‘చంద్రబాబు మళ్ళీ బీజేపీని ముంచేయడం ఖాయం.. ఎన్నాళ్లయినా ఎన్నేళ్లయినా బాబులోని మోసపూరిత బుద్ధి మారదు’. ఈ పాయింట్ అర్థం చేసుకున్న షెకావత్ ఢిల్లీ వెళ్లి బాబు ఇలా మాట మారుస్తున్న విషయాన్నీ పార్టీ పెద్దలకు నివేదించారని తెలుస్తోంది
ఇక, అప్పట్నుంచి బీజేపీ సైలెంట్ అయిందని అంటున్నారు. ఇటు లెక్క ప్రకారం టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేయనుండగా ఇప్పటికే 128 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో 16 సీట్లను ప్రకటించగా ఇంకో ఐదు స్థానాలకు సరైన అభ్యర్థులు కోసం చూస్తున్నారు. వీళ్ళు ఇలా జోరుమీద ముందుకు పోతున్నా బీజేపీ మాత్రం ఎక్కడా ఒక్క సీట్ కూడా వెల్లడించలేదు. ఎందుకంటే ఇదే కారణం అని చెబుతున్నారు.
చంద్రబాబు ఇప్పటికే సీట్లను అనౌన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకులతో చర్చించడం అనేదే లేదు. అంతా సింగిల్ హ్యాండెడ్‌గా ఆయన నిర్ణయాలు తీసుకుని అభ్యర్థులు.. స్థానాలను ఖరారు చేస్తూ పొతే ఇక మేమెందుకు అనే భావనలో బీజేపీ నాయకులు ఉన్నారని అంటున్నారు. మరోవైపు టీడీపీతో పొత్తు ఆంధ్రలోని ఒరిజినల్ బీజేపీ నాయకులకు ఇష్టం లేదని.. దాంతోబాటు బీజేపీ అభ్యర్థులను సైతం చంద్రబాబే ఖరారు చేస్తూ రావడం గతంలో చూశామని.. అలాంటప్పుడు తమకు విలువ ఏముందని రాష్ట్రంలోని ఒరిజినల్ బీజేపీ నాయకులూ కినుక వహించారని అంటున్నారు. అందుకే ఇవన్నీ రిపోర్టులు.. లెక్కలు బేరీజు వేస్తే తప్ప బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపించడం లేదు.
- సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment