
అవసరం మనది అయినప్పుడు అవతలివాళ్లు పెట్టే షరతులు చాలా కఠినంగా ఉంటాయి. పగటిపూట పిలిచిమరీ ఎక్కించుకుని రూ.ఇరవైకి డ్రాప్ చేసే షేర్ ఆటోవాడు అవసరం మనది అయినప్పుడు.. సమయం కాని సమయం అయినప్పుడు నూట యాభై అడుగుతాడు. లేదా నడిచి వెళ్ళండి అంటారు.
అర్థరాత్రి నడిచి వెళ్ళాలంటే కుక్కల భయం.. పోనీ వాడిని తోడు రమ్మంటే వాడి రేటు చూస్తేనే ప్రాణం పోయేలా ఉంది. మన అవసరానికి అప్పు అడిగితే నూటికి నెలకు పది రూపాయల వడ్డీ అడుగుతాడు. పోనీ డబ్బులు వద్దంటే ఇటు అవసరం తీరదు. ఇదీ ఒక్కోసారి మనకు ఎదురయ్యే పరిస్థితి.
ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి కూడా ఇదే. చూస్తూ చూస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సింగిల్‌గా ఎదుర్కోలేడు. అలాగని బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తుంటే వాళ్లు పెడుతున్న కండీషన్లు భయంకరంగా ఉన్నాయి. చంద్రబాబు బలహీనతను వాళ్లు ఎంత అలుసుగా తీసుకున్నారో చూస్తుంటే బాబుకు కోపం కట్టలు తెంచుకుంటోంది. అలాగని బీజేపీ వాళ్లను ఏమీ అనలేదు. ఏమన్నా అందాం అంటే.. ఒంటరిగా పోటీచేసుకో.. ఎవరొద్దన్నారు అంటూ అటునుంచి గదమాయింపులు. దీంతో బాబుకు దెయ్యంతో చుట్టరికం చేస్తున్నట్లు ఉంది.
ఇవీ షరతులు..
పొత్తుల కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ఓవైపు గౌరవించుతున్నట్లుగానే నటిస్తున్న బీజేపీ మాత్రం పెద్ద షరతులే విధించింది. ఇందులో భాగంగా చంద్రబాబు.. పవన్ ఇద్దరూ ఎమ్మెల్యేలుగా కాకుండా కేవలం ఎంపీలుగా చేయాలని చెప్పింది. అంటే వాళ్ళిద్దరూ లోక్‌సభకు వెళ్లాలని.. అసెంబ్లీ బాధ్యత బీజేపీ చూసుకుంటుందని చెప్పేశారు.
అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పెద్దరికం సంగతి తాము చూసుకుంటామని, ఒకవేళ కూటమికి మెజారిటీ వస్తే బీజేపీ ఎమ్మెల్యే మాత్రమే ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతారని, అటు పవన్, చంద్రబాబు ఇద్దరూ ఎంపీలుగా పోటీ చేయాలని, గెలిస్తే వాళ్లను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటాం అని చెప్పింది. ఈ కండీషన్లు చూస్తుంటే చంద్రబాబు రక్తం మరిగిపోతోంది. కానీ, బీజేపీ సపోర్ట్ లేకుండా ఎన్నికలకు వెళ్లే దమ్ము లేదు. అందుకే తోడు కోసం బీజేపీని రమ్మని పిలిస్తే వాళ్ళేమో మొత్తం పార్టీని మింగేస్తున్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయినా చంద్రబాబు ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా వెళ్ళడమా.. ప్రధానులను తయారు చేసిన తాను తనకన్నా జూనియర్ అయిన మోడీ దగ్గర మంత్రిగా చేయడమా?. ఈ ఊహలే చాలా అవమానకరంగా ఉన్నాయి. కానీ కాదంటే అసలు ఎన్నికలకు పోయే పరిస్థితి లేదు. ఏమి చేయాలో తెలియని పరిస్థితి.
- సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment