![BJP Hits Out Congress Over Khaki Shorts On Fire Tweet - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/12/Congress-RSS.jpg.webp?itok=zKdjJaSW)
ట్విట్టర్‌లో కాంగ్రెస్ షేర్ చేసిన ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్ర ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆర్‌ఎస్‌ఎస్ ధరించే ఖాకీ నిక్కర్ కాలిపోతున్న ఫోటోను షేర్ చేసింది. విద్వేష సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కల్పించి ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ చేస్తున్న నష్టాన్ని నివారించేందుకు దశల వారీగా తమ లక్ష‍్యాన్ని చేరుకుంటామని పేర్కొంది. దీనికి భారత్ జోడో యాత్ర ట్యాగ్‌ను జత చేసింది.
To free the country from shackles of hate and undo the damage done by BJP-RSS.
— Congress (@INCIndia) September 12, 2022
Step by step, we will reach our goal.#BharatJodoYatra 🇮🇳 pic.twitter.com/MuoDZuCHJ2
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటోపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ ఫోటోను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ.. మీరు దేశంలో హింసను కోరుకుంటున్నారా? అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. రాహుల్ చేపట్టింది భారత్ జోడో యాత్ర కాదు భారత్ తోడో, ఆగ్ లగావో యాత్ర అని సెటైర్లు వేశారు.
బెంగళూరు ఎంపీ, బీజేపీ యువనేత తేజస్వీ సూర్య.. ఈ ఫోటో కాంగ్రెస్ రాజకీయాలకు ప్రతీక అని ధ్వజమెత్తారు. 'కాంగ్రెస్ రాజేసిన నిప్పు 1984లో ఢిల్లీని తగలబెట్టింది. 2002లో 59 మంది కరసేవకులను సజీవదహనం చేసింది. మరోసారి ఆ పార్టీ హింసనే ప్రేరెేపిస్తోంది. రాహుల్ గాంధీ భారత్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే... రాజ్యాంగంపై నమ్మకంతో కాంగ్రెస్ రాజకీయపార్టీగా నిలిచిపోయింది. గతంలో కాంగ్రెస్ రాజేసిన అగ్గి దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉనికి కోల్పోయేలా చేసింది. ఇక అధికారం మిగిలున్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కూడా ఆ పార్టీ నామరూపాల్లేకుండా పోతుంది' అని తీవ్ర విమర్శలు చేశారు.
రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్రను తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలుపెట్టారు. 150 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర దేశంలో 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ 3,570కిలోమీటర్లు సాగనుంది. ఐదు రోజులు పూర్తి చేసుకున్న ఈ యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. కశ్మీర్‌లో ముగుస్తుంది.
చదవండి: జ్ఞానవాపి మసీదుపై వారణాసి కోర్టు సంచలన తీర్పు
Comments
Please login to add a commentAdd a comment