
సాక్షి, హైదరాబాద్: ప్రొటోకాల్, ఇతర ఉల్లంఘనలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు క్షమాపణ చెప్పి ప్రస్తుత వివాదానికి ముగింపు పలకాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ డిమాండ్‌చేశారు. ఆ విధంగా కేసీఆర్ చేయని పక్షంలో రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసిన సీఎంగా తెలంగాణ చరిత్రలో మిగిలిపోతారని హెచ్చరించారు.
శుక్రవారం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ గవర్నరే స్వయంగా తనకు జరుగుతున్న అవమానాలపై ప్రస్తావించిన నేపథ్యంలో వాటిపై సీఎం స్పందించాలి తప్ప మంత్రిగా ఉన్న కేటీఆర్ ఎలా సమాధానమిస్తారని ప్రశ్నించారు. సీఎం వివరణ ఇవ్వకుండా మంత్రులతో మాట్లాడించడం చూస్తుంటే దీన్ని రాజకీయం చేస్తున్నారనేది స్పష్టమవుతోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ పరిరక్షకురాలైన గవర్నర్‌ను, రాజ్యాంగ వ్యవస్థను కించపరుస్తోందని ఆరోపించారు. ఇటీవల యాదాద్రి సందర్శనకు, అంతకు ముందు మేడారం జాతరకు వెళ్లినపుడు గవర్నర్‌ను ఏ విధంగా అవమానించారో ప్రజలు చూశారన్నారు. రాష్ట్రం మత్తు పదార్థాలకు కేంద్రంగా మారడం, మద్యం ఏరులై పారడం వల్ల జరిగిన దుర్ఘటనలు, అత్యాచారాలు చోటుచేసుకోవడంపై ప్రభుత్వం సీఎస్ సోమేశ్‌కుమార్‌కు స్థానభ్రంశం కలిగించాలని, ఎక్సైజ్ కమిషనర్‌ను విధుల్లోంచి తొలగించాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు.