సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాల దూకుడును తట్టుకోలేక బెంబేలెత్తిపోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఐఎం పార్టీతో కలిసి కుట్రలకు పాల్పడుతున్నారని బీజేపీ నాయకులు విజయశాంతి విమర్శించారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులను చివరిక్షణంలో పోటీ నుంచి తప్పించేందుకు కుయుక్తులు పన్నుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయని ఆరోపించారు. ఎంఐఎం నేతలు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే దానిని కట్టడి చెయ్యకపోగా వారి దౌర్జన్యాన్ని నిలదీసిన పార్టీలను నియంత్రించే విధంగా పోలీసు బలగాలను ప్రయోగించడానికి సీఎం దొరగారు మాస్టర్ ప్లాన్ వేశారని అన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. (గ్రేటర్ పోరు: మాటల యుద్ధం.. వివాదాస్పదం)
‘ఇంతకాలం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను హైజాక్ చెయ్యడం లేదా ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలిచిన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను ప్రలోభపెట్టి ఫిరాయింపులను ప్రోత్సహించడం కేసీఆర్‌కు అలవాటుగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలాంటి రాజకీయాలు ఫలించవని నిర్ణయానికి రావడంతో ఏకంగా బలమైన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను శాంతి భద్రతల పేరుతో బరిలో నుంచి తప్పించడానికి గులాబీ బాస్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కుట్రలకు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తే తెలంగాణ సమాజం సహించదు.. క్షమించదు’ అని అన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాములమ్మ ఇటీవల ఢిల్లీ బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయతీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment