సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు శనివారం ప్రమాణం చేసేందుకు ఉద్దేశించిన ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు హాజరుకావడం లేదన్నారు. శనివారం ఉదయం తమ పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డితో ఎమ్మెల్యేలు సమావేశమై, ఆయా అంశాలపై చర్చిస్తామని తెలిపారు.
బీజేఎల్పీ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శుక్రవారం రాజాసింగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎందరో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్‌గా నియమించినందున తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
రజాకార్ల సైన్యానికి నాయకత్వం వహించిన ఖాసిం రజ్వీ వారసులైన ఎంఐఎం పార్టీ నేతల ఎదుట ప్రమాణం చేయదలుచుకోలేదని రాజాసింగ్ చెప్పారు. ఆ తర్వాత స్పీకర్ ఎదుట ఎప్పుడైనా ప్రమాణం చేస్తామని తెలిపారు. 2018లోనూ ప్రొటెమ్ స్పీకర్‌గా ఉన్నందున ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్ ఎదుట రాజాసింగ్ ప్రమాణం చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment