
జైపూర్ : తిరుగుబాటు నేత సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడంతో రాజస్తాన్‌లో రాజకీయ సంక్షోభం సమసిపోగా అశోక్ గహ్లోత్ సర్కార్‌కు కాషాయ పార్టీ నుంచి సమస్యలు ఎదురవనున్నాయి. గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని బీజేపీ నేత, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అన్నారు. గహ్లోత్ సర్కార్‌పై రాజస్తాన్ అసెంబ్లీలో బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది. శుక్రవారం ఉదయం శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. జైపూర్‌లో గురువారం పార్టీ సీనియర్ నేత మురళీధర్‌రావు, వసుంధర రాజేలు గురువారం పార్టీ ఎమ్మెల్యేలతో ముచ్చటించారు.
కాంగ్రెస్ సర్కార్‌కు ముగింపు పలుకుతామని, రాజస్తాన్ అసెంబ్లీలో శుక్రవారం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని విపక్ష నేత గులాబ్ చంద్ కటారియా స్పష్టం చేశారు. ఇక రెబెల్ ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి రావడంతో వారిని మన్నించి కలుపుకుపోదామని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మరోసారి కోరారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో తాము ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక వాధ్రాలు తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌తో జరిగిన సంప్రదింపులు ఫలించడంతో రాజస్తాన్‌లో రాజకీయ సంక్షోభం ముగిసిన సంగతి తెలిసిందే. గహ్లోత్ సర్కార్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేసిన పైలట్ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. చదవండి : ‘లక్ష్మణ రేఖను దాటలేదు’