సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తుపై సస్పెన్స్ కొనసాగుతున్న సమయంలో.. ఆయన రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో జరుపుతున్న భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బీజేపీవైపు ఆయన అడుగులు పడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈటల సోమవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ముఖ్యనేత యోగేంద్ర యాదవ్‌లతో భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే గతంలో టీఆర్‌ఎస్‌లో క్రియాశీలంగా పనిచేసి ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ ఎంపీలు ఏపీ జితేందర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామితో ఈటల రాజేందర్ ఇటీవల భేటీ అయినట్టు సమాచారం.
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన మొదట్లో జితేందర్‌రెడ్డిని కలిసిన ఈటల.. తాజాగా గత ఆదివారం రాత్రి మరోసారి సమావేశమైనట్టు తెలిసింది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత మొయినాబాద్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటున్న జితేందర్‌రెడ్డితో జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలో ఓటమి పాలైతే రాజకీయ భవిష్యత్తు సమాప్తమవుతుందనే అభిప్రాయాన్ని జితేందర్‌రెడ్డి వ్యక్తం చేసిన ట్టు తెలిసింది. వివేక్‌తో జరిగిన భేటీలో ఈటల బీజేపీలో చేరే అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం.
కలవడంలో తప్పేమీ లేదన్న కిషన్‌రెడ్డి
ఈటల రాజేందర్ తనను కలుస్తానంటూ ఫోన్ చేసి, మాట్లాడిన విషయం నిజమేనని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం ధ్రువీకరించారు. తాము 15 ఏళ్ల పాటు ఎమ్మెల్యేలుగా కలిసి పనిచేశామని, కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. బీజేపీలో చేరిక, హుజూరాబాద్ ఉప ఎన్నిక వంటి అంశాలేవీ తమ ఫోన్ సంభాషణలో ప్రస్తావనకు రాలేదన్నారు. కాగా.. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యాక వివిధ పార్టీలు, సంఘాల నేతలను కలుస్తున్న క్రమంలోనే బీజేపీ నేతలతోనూ ఈటల భేటీ అవుతున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
గతంలో టీఆర్‌ఎస్‌లో క్రియాశీలంగా పనిచేసి ప్రస్తుతం బీజేపీలో ఉన్న నేతలను కలిసి రాష్ట్ర రాజకీయాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఈటలపై వరుస ఆరోపణలు, విచారణల నేపథ్యంలో.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. కాగా.. ఎమ్మెల్యే పదవికి ఇప్పట్లో రాజీనామా చేసే యోచనలో ఈటల లేరని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment