
సురీ: పశ్చిమ బెంగాల్‌లోని బీర్భమ్ జిల్లాలో గురువారం దాదాపు 150 మంది బీజేపీ కార్యకర్తలు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ)లో చేరారు. వీరంతా గతంలో టీఎంసీలో ఉన్నవారే. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడంతో మళ్లీ సొంతింట్లో అడుగుపెట్టారు. అయితే, టీఎంసీ నేతలు వారిపై శానిటైజర్ చల్లిన తర్వాతే తమ పార్టీలో చేర్చుకోవడం సంచలనాత్మకంగా మారింది. ఈ కార్యక్రమం కోసం ఇలామ్‌బజార్ ప్రాంతంలో ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేశారు.
బీజేపీ నుంచి వస్తున్న కార్యకర్తలపై టీఎంసీ స్థానిక నాయకులు శానిటైజర్ చల్లారు. తర్వాత టీఎంసీ జెండాలను వారి చేతుల్లో పెట్టారు. ఇన్నాళ్లూ వారు బీజేపీ కోసం పని చేశారని, వైరస్‌తో ప్రభావితమయ్యారని, తమ పార్టీలో చేర్చుకునేముందు వారిపై వైరస్ పూర్తిగా అంతమయ్యేలా శానిటైజర్‌తో శుద్ధి చేశామని టీఎంసీ నేత దులాల్‌రాయ్ చెప్పారు. అయితే, తమ పార్టీ కార్యకర్తలను బలవంతంగా టీఎంసీలో చేర్చుకున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధ్రువా సాహా ఆరోపించారు.
చదవండి: పారదర్శకంగా రాష్ట్రాలకు టీకా పంపిణీ