మరింత జోరుగా బీఆర్‌ఎస్‌..! | BRS focus on intensifying government and party activities | Sakshi
Sakshi News home page

మరింత జోరుగా బీఆర్‌ఎస్‌..!

Published Fri, Apr 7 2023 4:22 AM | Last Updated on Fri, Apr 7 2023 8:56 AM

BRS focus on intensifying government and party activities - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రభుత్వ, పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేయడంపై బీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. వరుసగా సభలు, సమావేశాలు నిర్వహించడంతోపాటు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులను  భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. ఈ నెల 14న జరిగే భారీ అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ మొదలుకుని.. జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు వరుసగా సభలు, సమావేశాల నిర్వహణకు షెడ్యూల్‌ సిద్ధం చేసింది. 

అన్ని నియోజకవర్గాల నుంచి పాల్గొనేలా.. 
ఈ నెల 14న హుస్సేన్‌సాగర్‌ తీరంలో జరిగే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా నిర్వహించా లని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అంబేద్కర్‌ మన వడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ను ఆహ్వానించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా నిర్వహించే సభకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున 35,700మంది పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేసింది.

ఈ నెల 30న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయం ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కార్యక్రమంలో సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, గ్రంథాలయ సంస్థల చైర్‌పర్సన్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, మేయర్లు, ఇతరులు కలుపుకొని 2,500 మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 

ఎల్బీ స్టేడియంలో ప్లీనరీ 
గత రెండేళ్లుగా హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్‌ ప్లీనరీని ఈ ఏడాది ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ నెల 27న జరిగే బీఆర్‌ఎస్‌ ప్లీనరీ సందర్భంగా ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు.

టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌గా పేరు మారిన తర్వాత జరుగుతున్న తొలి ప్లీనరీ ఇది. ఈ క్రమంలో జాతీయ పార్టీగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించే అవకాశం ఉంది. సుమారు 8 వేల మంది ప్రతినిధులు ఈనెల 27న జరిగే బీఆర్‌ఎస్‌ ప్లీనరీకి హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని గ్రామాలు, మున్సిపల్‌ వార్డుల్లో స్థానిక నేతలు పార్టీ జెండాలను ఆవిష్కరిస్తారు. 

మరిన్ని రోజులు ఆత్మీయ సమ్మేళనాలు 
ఎన్నికల సన్నద్ధతలో భాగంగా క్షేత్రస్థాయిలో చేపట్టిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాలను  మే నెలలోనూ కొనసాగించాలని పార్టీ అధినేత కేసీఆర్‌ సూచించారు. ఆత్మీయ సమ్మేళనాలకు కేడర్‌ నుంచి వస్తున్న స్పందనను దృష్టిలో పెట్టుకుని విస్తృతంగా నిర్వహించేందుకు మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి నేతృత్వంలో పది మందితో కూడిన పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేశారు. అంటే మరో నెలన్నర పాటు బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగనున్నాయి. ఇక జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సచివాలయం ఎదురుగా నిర్మించిన అమరుల స్మారకాన్ని ప్రారంభించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement