సాక్షి, న్యూఢిల్లీ: అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేత విచారించాలన్న డిమాండ్‌తో ఆప్, శివసేనతో కలసి బీఆర్‌ఎస్ పార్టీ బుధవారం సైతం తమ నిరసనను కొనసాగించింది. సభా కార్యక్రమాల ప్రారంభానికి ముందు బీఆర్‌ఎస్ సభాపక్ష నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్‌రావులతో కలసి మిగతా ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. హిండెన్‌బర్గ్ నివేదికపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అదానీ షేర్ల పతనంతో ప్రజల పొదుపు సొమ్ము ప్రమాదంలో పడిందన్నారు. ఎల్‌ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకులపై పడే ప్రభావంపై కేంద్రం సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా ఎంపీలు డిమాండ్ చేశారు.
ఉద్దేశ్యపూర్వకంగానే కేంద్రం దీనిపై దాటవేత ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. అనంతరం ఎంపీలు నామా, కేకేలు ఉభయసభల్లో ఇదే అంశంపై వాయిదా తీర్మానాలు ఇచ్చినా వాటిని సభాధ్యక్షుడు తిరస్కరించారు. దీంతో ఉభయ సభల నుంచి ఎంపీలు వాకౌట్ చేశారు. కాగా, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఇచ్చేందుకు ప్రధాని మోదీ సిద్ధమవుతుండగా సభలో ఉన్న ఎంపీ నామా అదానీ అంశాన్ని లేవనెత్తారు. అదానీ అంశంపై జేపీసీ వేయాలని పట్టుబట్టారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా కలి్పంచుకుని ‘మీరు ఇదివరకే వాకౌట్ చేశారు కదా?’అని ప్రశ్నించగా...మోదీ సమక్షంలో మరోమారు తమ డిమాండ్ వినిపించేందుకే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నామని చెబుతూ వాకౌట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment