సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ముందుగానే ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి పెండింగ్‌లో ఉన్న మిగతా స్థానాల అభ్యర్థుల పేర్లను కూడా ఖరారు చేసింది. మల్కాజిగిరి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో అక్కడ కొత్త అభ్యర్థికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పెండింగ్ అభ్యర్థులతో త్వరలోనే రెండో జాబితాను ప్రకటించే అవకాశముంది.
ఇదిలా ఉంటే విపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు కూడా అభ్యర్థుల ఎంపిక కసరత్తును ప్రారంభించిన నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులపై స్పష్టత వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ గతంలో ప్రకటించిన తొలి జాబితాలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్, బీజేపీల్లోని కీలక అసమ్మతి నేతలను ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్ గూటికి చేర్చే వ్యూహానికి పార్టీ అధినేత కేసీఆర్ పదును పెడుతున్నట్లు సమాచారం.
ముగ్గురికి పచ్చజెండా
బీఆర్‌ఎస్ గత నెల 21న రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకే మరోసారి అవకాశం ఇచ్చింది. అయితే ఆయన కాంగ్రెస్ గూటికి చేరడంతో, ఈ నియోజకవర్గంతో పాటు గతంలో పెండింగులో పెట్టిన జనగామ, నర్సాపూర్, గోషామహల్ బీఆర్‌ఎస్ అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు.
వారు క్షేత్ర స్థాయిలో పని చేసుకునేందుకు పచ్చజెండా ఊపారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ), సునీత లక్ష్మారెడ్డి (నర్సాపూర్), మర్రి రాజశేఖర్‌రెడ్డి (మల్కాజిగిరి), నందకిషోర్ వ్యాస్ బిలాల్ (గోషామహల్) పేర్లను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇక నాంపల్లి నియోజకవర్గం అభ్యర్థి విషయంలో కసరత్తు కూడా ఒకటి రెండు రోజుల్లో కొలిక్కిరానుంది.
గులాబీ గూటి నుంచి బయటకు..
బీఆర్‌ఎస్ నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడిన పలువురు ముఖ్య నేతలకు సర్ది చెప్పేందుకు పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావుతో పాటు పార్టీ అధిష్టానానికి సన్నిహితం ఉండే నేతలు చేస్తున్న ప్రయత్నాలు కొన్నిచోట్ల ఫలించడం లేదు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుండటంతో ఆయా పార్టీల టికెట్ ఆశిస్తూ బీఆర్‌ఎస్‌ను వీడుతున్న నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
వివిధ కారణాలతో ఇప్పటివరకు సుమారు 20 మంది ముఖ్య నేతలు పార్టీని వీడారు. మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), తుమ్మల నాగేశ్వర్ రావు (పాలేరు) లాంటి వారు ఇందులో ఉన్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా ఇటీవల అసంతృప్తి రాగం అందుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కేవలం మూడు నెలల కాలంలోనే మనసు మార్చుకుని తిరిగి కాంగ్రెస్‌లో చేరారు.
పలువురు ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు కూడా..
బీఆర్‌ఎస్ టికెట్ దక్కని ఎమ్మెల్యేలు రేఖా నాయక్ (ఖానాపూర్), రాథోడ్ బాపూరావు (బోథ్)తో పాటు టికెట్ దక్కినప్పటికీ మైనంపల్లి హన్మంతరావు (మల్కాజిగిరి) పార్టీని వీడారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు (చెన్నూరు), ఆరేపల్లి మోహన్ (మానకొండూరు), వేముల వీరేశం (నకిరేకల్), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట) కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు జడ్పీ చైర్మన్లు కోరం కనకయ్య (భద్రాద్రి కొత్తగూడెం), నల్లాల భాగ్యలక్ష్మి (మంచిర్యాల), సరిత (గద్వాల) కూడా వేర్వేరు సందర్భాల్లో కారు దిగేశారు.
పదవులు, బుజ్జగింపులతో కట్టడి యత్నం
ఎన్నికల సమయంలో నేతలు పార్టీలు మారడం అత్యంత సహజమని చెప్తూనే అసంతృప్తులకు కళ్లెం వేసేందుకు బీఆర్‌ఎస్ మరింత ముమ్మర ప్రయత్నాలు సాగిస్తోంది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో పాటు ప్రవీణ్ (బెల్లంపల్లి), నరోత్తమ్ (జహీరాబాద్), గోలి శ్రీనివాస్‌రెడ్డి (కల్వకుర్తి), బక్కి వెంకటయ్య (దుబ్బాక) తదితరులకు ఇటీవల ప్రభుత్వ పదవులను అప్పగించారు.
టికెట్ దక్కని ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (జనగామ), తాటికొండ రాజయ్య (స్టేషన్ ఘనపూర్)కు కూడా కీలక పదవులు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే టికెట్ దక్కని ఎమ్మెల్యే బేతి సుభా‹Ùరెడ్డి (ఉప్పల్)తో పాటు నేతలు గడ్డం అరవింద్ రెడ్డి (మంచిర్యాల), నీలం మధు (పటాన్‌చెరు), మన్నెం రంజిత్ యాదవ్, బుసిరెడ్డి పాండురంగారెడ్డి (నాగార్జునసాగర్) చందర్‌రావు (కోదాడ) తదితరులు అభ్యర్థులను మార్చాలని ఒత్తిడి పెంచుతుండటం గమనార్హం.
కారు చివరి సీట్లు ఖరారు.. పెండింగ్ స్థానాలకూ అభ్యర్థుల ఖరారు
Published Fri, Sep 29 2023 1:44 AM | Last Updated on Fri, Sep 29 2023 10:46 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment