
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌బాబుపై ఏపీ శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 2,3 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని సంచలన కామెంట్స్ చేశారు. అవినీతిపై నారా లోకేష్ మాట్లాడటం సిగ్గుచేటు అంటూ వ్యాఖ్యలు చేశారు.
కాగా, బైరెడ్డి సిద్దార్ధ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఇల్లు కట్టుకుని రాజకీయాలు చేయమని టీడీపీ నేతలే చంద్రబాబుకు చెబుతున్నారు. సీఎం జగన్‌పై లోకేష్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మంగళగిరిలో గెలవలేని వ్యక్తి పార్టీని అధికారంలోకి తీసుకువస్తాడంటా. లోకేష్ ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్. వచ్చే ఎన్నికల్లో టీడీపీ భారీ ఓటమి చవిచూస్తుంది.
ప్రజాన్యాయస్థానంలో గెలిచిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. సీఎం జగన్‌పై కుట్రలు పన్ని కేసులు పెట్టించారు. సీఎం జగన్ నిత్యం ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి. ఉద్దానం సమస్యను పరిష్కారం చూపింది సీఎం జగన్ మాత్రమే. చంద్రబాబులాగా అబద్దపు హామీలు ఇచ్చే అలవాటు మాకు లేదు. ఐదేళ్లలో అన్ని హామీలు నెరవేరుస్తాము. మంత్రి రోజాను మహిళ అని కూడా చూడకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదంటూ హెచ్చరించారు.
2014-19లో సిమెన్స్ కంపెనీని వాడుకుని రూ.250కోట్లు దోచుకున్నది వాస్తవం కాదా?. రూ. 250 కోట్లు ఏవిధంగా మాయమయ్యయో లోకేష్ చెప్పాలి. సిమెన్స్ కంపెనీతో చేసుకున్న ఒప్పందంపై లోతుగా విచారణ చేయాలి. టీడీపీ శ్రేణులు వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నాను. అచ్చెన్నాయుడు కుంభకోణంపై విచారణ జరగకుండా స్టే తెచ్చుకున్నారు. చంద్రబాబు అవినీతిపై వేల పుస్తకాలు వేయొచ్చు.
ఎన్నడూ లేనివిధంగా ఏపీలో స్కూల్స్ అన్ని బాగుపడ్డాయి. ప్రతీ గ్రామానికి వైద్య సేవలు అందుతున్నాయి. విత్తనం నుంచి మద్దతు ధర వరకూ రైతులకు అండగా ఉన్నాము. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రాష్ట్రం వెనుకబడిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం బాగుపడటం టీడీపీకి ఇష్టం లేదు. ఆరోపణలు చేస్తూ ఒక భ్రమలో బతుకుతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.