మచిలీపట్నం వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం నాడు చేసిన ప్రసంగం పూర్తిగా డొల్లతనంతో వైరుద్ధ్యాల పుట్టగా సాగిపోయింది. 10 ఏళ్ల పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానం వెగటు కలిగించే ఓ ప్రహసనం. ఈ పదేళ్లలో తను చేసిన పొరపాట్లు ఏమిటో, తన వైఫల్యాలకు కారణాలేమిటో కనీసమాత్రంగా కూడా చెప్పకపోగా ఓట్లు వేయనందుకు ప్రజల్ని తప్పు పట్టిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.
2014లో ‘జనసేన’ను స్థాపించి బేషరతుగా బీజేపీ, తెలుగుదేశంతో కలిసి ప్రచారం చేసి, ఆ పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దోహదపడ్డారు పవన్. 2018 మార్చి 14న ఆ రెండు పార్టీలకు ‘రాం రాం’ పలికి వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు కుదుర్చుకొని ఎన్ని కలకు వెళ్లారు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ వైఫల్యా లనూ, నారా లోకేష్ పాల్పడిన అవినీతినీ ప్రతి సభలో ఎండ గట్టారు.
అయితే, ప్రజలు పవన్ కల్యాణ్‌ను సీరియస్‌గా తీసుకోలేదు. అందుకే పోటీ చేసిన రెండుచోట్లా అవమానకరమైన రీతిలో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలలో అనేక వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. ఆ వర్గాలు వైఎస్సార్‌సీపీకి చేరువై, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పట్టం గట్టారు. ఈ నాలుగేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజ కీయంగా బలపడ్డాయి. దీంతో, వెనుకబడిన వర్గాలు, కాపులు తిరిగి తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యే పరిస్థితులు లేక పోవడంతో, కాపులను వైఎస్సార్‌సీపీ నుంచి వేరు చేసి వారిని తెలుగుదేశం పార్టీ వైపు నడిపించడం అనే వ్యూహంతో గత కొంత కాలంగా పవన్ కల్యాణ్ పావులు కదుపుతున్నారు.
ఆ క్రమంలోనే, కులాలను కలుపుతానంటూ పవన్ ఓ చిత్రమైన పల్లవిని వినిపిస్తున్నారు. కులాలను కలపడం ఏమిటి? కొన్ని కొన్ని ప్రాంతాలతో రాజకీయ పరంగానో, సామాజిక పరంగానో కొన్ని కులాల మధ్య అపోహలు ఏర్పడటం సహజం. కానీ, అవి తాత్కాలికంగానే ఉంటాయి తప్ప కులపరంగా ప్రజలు విడిపోయి ఘర్షణలు పడే పరిస్థితి ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి పరిస్థితి ఇప్పుడే కాదు గత 2 దశాబ్దాలు పైబడి ఎన్నడూ లేదు. పాలకులు అన్ని కులాల్నీ సమానంగా ఆదరించినపుడు కులాల మధ్య అంతరాలు ఏర్పడవు. జగన్ పాలనలో ‘కులాల కుంపట్లు’ లేనే లేవు. ఇది ఒక వర్గం మీడియా కావాలని చేస్తున్న దుష్ప్రచారం. కాపులు, బలిజలు తను ఎంత చెబితే అంత అన్నట్లుగా పవన్ కల్యాణ్ భావించడం విడ్డూరం.
కాపులు, బలిజల ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు పవన్ కల్యాణ్ ఏం చేశారు? చిరంజీవి ప్రజారాజ్యంపై కుల ముద్ర వేసిందెవరు? చిరంజీవి, అల్లు అరవింద్‌లు పార్టీ టిక్కెట్లు అమ్ముకొంటూ వేల కోట్లు సంపాదించారన్న ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజారాజ్యం విజయావకాశాలను దెబ్బతీసిన పార్టీతో, వ్యక్తులతో పవన్ కల్యాణ్ అంటకాగితే కాపులు, బలిజలు హర్షిస్తారా?
కులాల్ని కలపాలంటే ముందుగా ఎవరైతే తమది గొప్ప కులమని, తమ బ్లడ్ ప్రత్యేకమైనదంటూ నోరు జారారో... వారిచేత మిగతా కులాలకు క్షమాపణలు చెప్పించగలగాలి. అందరిలో ప్రవహించేది ఒకటే రక్తం అని వారికి గడ్డి పెట్టాలి. ఎన్టీ రామారావు గానీ, డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డి గానీ తెలుగునాట కుల రాజకీయాలు చేయలేదు. వారికి కులం రంగు పులమాలని అప్పట్లో కొందరు ప్రయత్నించినా, తమ ఉన్నత వ్యక్తిత్వాలతో, అన్ని వర్గాల ప్రజల పట్ల సమాదరణతో వారు కులాలకు అతీతంగా ఉన్నతమైన నాయ కులుగా చరిత్రలో నిలిచిపోయారు.
ఆ కోవలోనే నేడు వైఎస్ జగన్ తన పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు. చట్టసభల గడప ముఖం తెలియని అనేక బడుగు వర్గాలకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఇందువల్ల, భవిష్యత్తులో ఆయన గెలుపు నల్లేరు మీద బండి ప్రయాణంలా సాగిపోతుందని గ్రహించినవారు.. తెలివిగా పవన్‌ను ముందుకు నెట్టి కులాల మధ్య కుంపట్లు రాజేస్తున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే తన గెలుపు కూడా కష్టం అని 2019 ఎన్నికల ఫలితాలు నేర్పిన పాఠంతో పవన్ కల్యాణ్ రాబోయే ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో జత కట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.
ఆ కారణంగానే తమ పార్టీని విస్తరించడం లేదు. సీనియర్ నేతలెవరైనా వచ్చి తమ పార్టీలో చేరతారేమోననే అనుమానంతో తనకు నచ్చిన ఓ నాయకుడికి నంబర్ 2 స్థానం కల్పించి ముందు పెట్టుకున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులకు టిక్కెట్లు ఇవ్వకపోయినా, వారి నుంచి పెద్దగా ప్రతిఘటన రాదు కనుక ఓ 15–20 సీట్ల మేరకు ఎన్నికల పొత్తుల్లో భాగంగా తీసుకొంటే సరి పోతుందనే ఆలోచన చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే, తన వ్యూహాల్ని, ప్రణాళికలను, ఎత్తుగడల్ని ప్రజలు అర్థం చేసుకొని ఎక్కడ తనను నలుగురిలో ఎండగడతారేమోననే అనుమానంతో.. ‘అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓట్లు చీల నివ్వను’ అంటూ ఓ సరికొత్త నేరేటివ్‌ను గత కొంత కాలంగా విన్పిస్తున్నారు. 2019 ఎన్నికలలో ఓటమి చెందిన చంద్రబాబు ఈ నాలుగేళ్ల కాలంలో ఎప్పుడూ తను చేసిన తప్పుల్ని ఒప్పుకోలేదు. కించపరిచిన బీసీలు, ఎస్సీలను క్షమాపణ కోరలేదు. కాపునేత ముద్రగడ పద్మనాభాన్నీ, ఆయన కుటుంబ సభ్యులనూ అవమానించిన తీరుకు బాధనూ వ్యక్తం చేయలేదు. తమ పాలనలో రైతులకూ, వెనుకబడిన వర్గాలకూ అన్యాయం జరిగిందని ఒప్పుకోలేదు.
అయినప్పటికీ.. పవన్‌కు తెలుగుదేశం మీద, చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో ప్రజలు అర్థం చేసుకోవాలి. అయితే, పవన్ కల్యాణ్ మర్మం తెలియని చేగొండి హరిరామ జోగయ్య వంటి కాపు కుల ప్రముఖులు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలనీ, చంద్రబాబు జాతీయ రాజకీయాలకు వెళ్లాలనీ తమ మనసులోని మాటగా చెబుతున్నారు. కానీ, ఇప్పటికే పవన్–చంద్రబాబుల మధ్య ఎంఓయూలు కుదిరిపోయాయన్న నిజాన్ని వారు ఎప్పటికి గ్రహిస్తారు?!
సినిమాలకు, రాజకీయాలకు గల తేడాను గ్రహించకుండా రాజకీయాలలో సైతం సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవడానికి పరిమితం అయ్యారు పవన్. తనకు కులం, మతం, ప్రాంతం లేదంటారు. మరోవైపు కులాల ప్రస్తావన తీసుకువస్తారు. పైగా, ఆయనకు డబ్బు మీద మోజు లేదట. డబ్బు అవసరం లేదట. రోజుకు 2 కోట్లు సంపాదిస్తానని చెప్తారు. ఇంకోవైపు నెలనెలా ఈఎంఐలు కడుతున్నట్లు చెప్పారు. ఈ వైరుద్ధ్యాలు ఏమిటో ఎవరికీ అర్థం కాదు. పవన్ కల్యాణ్‌కు పెద్దగా చదువు లేదు. కానీ పుస్తకాలు బాగా చదివాననీ, ఎంతో విజ్ఞానవంతుణ్ణనీ చెప్పుకుంటారు.
రాజకీయాల్లో రాణించడానికి చదువే ప్రామాణికం కాదు. కామన్‌సెన్స్ ముఖ్యం. కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించమని పవన్ చేసే హితబోధలో హేతుబద్ధత కనిపిస్తుందా? ఏ ఒక్క కులం కూడా సమూహంగా ఆలోచించదు. సమూహంగా వ్యవహరించదు. అందుకు కాపు కులస్థులు మినహాయింపేమీ కాదు. ప్రజలు తమ తమ స్థానిక స్థితిగతులను అనుసరించి, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సమయంలో నిర్ణయాలు తీసుకొంటారు.
ఎవరైతే మంచి పరిపాలన అందిస్తారో వారిలో ప్రజలు కులాన్ని చూడరు. ఇది చరిత్ర చెప్పే సత్యం. పవన్ కల్యాణ్‌కు ఈ వాస్తవాలు ఎవరు చెబుతారు? ప్రజలు స్థిరమైన వ్యక్తిత్వం లేనివారిని, ఎప్పటికప్పుడు మాటలు మార్చేవారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. అందువల్ల పవన్ కల్యాణ్ గంపగుత్తగా కాపుల్నీ, బలిజల్నీ తన రాజకీయ స్వప్రయోజనాల కోసం వేరొక పార్టీకి బదలాయించాలని చేసే ప్రయత్నాలు విఫలం కాకతప్పదు. పవన్ కల్యాణ్ చేసే దివాళాకోరు కుల రాజకీయాల్ని ఏ వర్గమూ హర్షించదు, సహించదు.
సి. రామచంద్రయ్య,
వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment