Kommineni Srinivasa Rao Comments On Janasena Chief Pawan Kalyan Tweets Politics - Sakshi
Sakshi News home page

అదే ‘రొడ్డ కొట్టుడు’.. పవన్‌ కల్యాణ్‌కు అర్థమవుతుందా?

Published Sun, Oct 16 2022 4:20 PM | Last Updated on Sun, Oct 16 2022 5:31 PM

Janasena Chief Pawan Kalyan Tweets Politics - Sakshi

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఏమి రాజకీయం చేస్తున్నారో ఆయన పార్టీ వారికే అర్థం కాదు. పార్టీ క్యాడర్‌కు కాకపోతే, ఆయనకైనా అర్థం అవుతుందా అన్న అనుమానం వస్తుంటుంది. కాకపోతే ఒక సినీ నటుడు కనుక, ఆయన ఏమి మాట్లాడినా మీడియా కవరేజి వస్తుంటుంది. అదే ఆయనకు ఉన్న అడ్వాంటేజ్ అని చెప్పాలి. దానికి తోడు టీడీపీ మీడియా ఆయనకు అండగా ఉంటుంది. వారం, పది రోజులకోసారి ఆయన ఏదో ఒక విషయంపై స్పందిస్తుంటారు. దానిపై వైసీపీ మంత్రులు, నేతలు రియాక్ట్ అవుతుంటారు. ఆ రకంగా ఆయన రాజకీయంగా జనంలో ఉన్నట్లు సంతృప్తి చెందవచ్చు. అంతకు మించి ఆయన చేస్తున్న ట్వీట్లకు గాని, అప్పడప్పుడు మంగళగిరి వెళ్లి చేసే ప్రసంగాలకు కాని పెద్ద విలువ ఉండడం లేదు.
చదవండి: ఈ మూడేళ్లలో ఎన్నడైనా ఆ విషయాలను పవన్ చెప్పారా?

ఆయన తన సొంత ఆలోచనలతో ఇవేవి చేయకపోవడం వల్లే ఈ దుస్థితిలో ఉన్నారని అనుకోవచ్చు. తాజాగా పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్లు చూడండి.. విశాఖలో  గర్జన సభను విమర్శిస్తూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ అసలు ఆ విషయంలో విశాఖపట్నాన్ని ఎందుకు రాజధానిగా వద్దనుకుంటున్నది మాత్రం ఆయన వివరించినట్లు కనిపించలేదు. కేవలం ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై ఎప్పటిమాదిరి చేసే రొడ్డకొట్టుడు విమర్శలు తప్ప సృజనాత్మక, నిర్మాణాత్మకత, కొత్తదనం కొరవడ్డాయి.

దేనికి గర్జనలు? మూడు రాజధానులతో అభివృద్ది జరుగుతుందా? ఒక హైకోర్టు, కొన్ని ఆఫీస్‌లు ఆయా చోట్ల పెడితే అభివృద్దా అని ఆయన ప్రశ్నించారు. ఇది ఆయనకు వచ్చిన సందేహమో,లేక ఎవరైనా అడగమంటే అడిగారో తెలియదు. కాని ఇదే పవన్ కల్యాణ్‌ కొన్ని సంవత్సరాల క్రితం అన్ని ఆఫీస్ లు ఒక్క అమరావతిలోనే ఎందుకు పెడతారని ప్రశ్నించారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్ సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యుల బలంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాల్సింది కాస్తా అప్పుల బాట పట్టించినందుకా?. ‘సంపూర్ణ మద్య నిషేధం’ అద్భుతంగా అమలు చేస్తున్నందుకా? ‘మద్య నిషేధం’ ద్వారా ఏటా రూ.22 వేల కోట్లు సంపాదిస్తున్నందుకా? ‘మద్య నిషేధ’ ఆదాయం హామీగా రూ.8 వేల కోట్లు అప్పు తెచ్చినందుకా?. రుషి కొండను విధ్వంసం చేసి భవనం నిర్మిస్తున్నందుకా? మత్సకారులు వలసలు వెళుతున్నందుకా? దసపల్లా భూములను కొల్లగొడుతున్నందుకా.. అంటూ ఏవేవో ట్వీట్లు పెట్టారు. వీటిలో ఎదైనా ఒక్కటైనా కొత్త విషయం ఉందా?

రోజూ తెలుగుదేశం పార్టీవారు చేస్తున్న విమర్శలనే ఆయన ప్రస్తావించారు. తెలుగుదేశం మీడియా ముఖ్యంగా ఈనాడు రోజూ రాసే ఏడుపుగొట్టు వార్తల ఆధారంగానే ఈ ట్వీట్లు చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. మూడు రాజధానులతో రాష్ట్రం ఎందుకు అధోగతి పాలవుతుందో వివరించాలి కదా? అది నిజమే అయితే గతంలో ఆయనే కర్నూలు వెళ్లి, విశాఖ వెళ్లి అవి రాజధానులు కావాలని ఎందుకు అన్నారు?. అసెంబ్లీలో ప్రభుత్వ భూమి ముప్పై వేల ఎకరాలు ఉండాలన్న జగన్ వ్యాఖ్యలను ఎందుకు వక్రీకరిస్తున్నారు? అయినా విశాఖపట్నం రాజధాని అంటే గొప్ప సంగతి అవుతుందా? లేక అమరావతిలోని నాలుగు పల్లెటూళ్లు రాజధాని అంటే గొప్ప విషయం అవుతుందా? అసలు  ఎందుకు విశాఖను వ్యతిరేకిస్తున్నది వారికైనా తెలుసా?

ఎమ్మెల్యేలు, ఎంపీల బలం ఉంటే అది రాజకీయంగా స్థిరత్వాన్ని ఇస్తుంది. రాష్ట్రానికి ఆర్థిక బలం చేకూరడానికి అనేక ఇతర ప్యాక్టర్లు పనిచేస్తాయి. రెండేళ్ల పాటు కరోనా సమస్యను ఎదుర్కున్నా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆపలేదు. స్కూళ్లు బాగు చేయడం ఆగలేదు. ఆస్పత్రులను మెరుగుపర్చడం నిలపలేదు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటును ఆపేయలేదు. సుమారు ముప్పైపైగా  స్కీంలను ఈ ప్రభుత్వం అమలు చేసిన విషయం పవన్ కల్యాణ్కు తెలియకపోతే రాజకీయంగా ఆయన జ్ఞానం అలా ఉందని అనుకోవాలి.

మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కొద్ది రోజుల క్రితం ఉన్నవి, లేనివి కలిపి అప్పులపై ఒక సోది ప్రకటన చేశారు. దానిని ఖండిస్తూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఒక పెద్ద ప్రకటనే విడుదల చేశారు. నిత్యం అసత్యాలతో జనాన్ని ప్రభావితం చేయడానికి తెలుగుదేశం, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా పనిచేస్తున్నాయి. వారికి కొనసాగింపుగానే పవన్ కల్యాణ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు తప్ప ఒక్కటి కూడా అర్ధవంతంగా లేదు. నిజంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అప్పులు చేయవలసిన అవసరం లేదని పవన్ కల్యాణ్‌ భావిస్తే, అందుకు ఆధార సహితంగా ప్రకటన చేసి ఉండవచ్చు. మధ్య నిషేధంపై ఆయన విమర్శ చేయవచ్చు. కాని తాము అధికారంలోకి వస్తే మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పగలరా?

మత్స్యకారులు గుజరాత్ తదితర రాష్ట్రాల తీర ప్రాంతాలకు వలస వెళ్లడం ఇప్పుడే కొత్తగా జరుగుతోందా? ఇంతకాలం ఎందుకు ఫిషింగ్ హార్జర్లు నిర్మించలేదు. జగన్ అధికారంలోకి వచ్చాక కదా, నాలుగు కొత్త ఓడరేవులు, పది ఫిషింగ్ హార్జర్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నది?. రుషికొండపై గతంలో కూడా భవనాలు ఉన్నాయి కదా.. అయినా టీడీపీ మీడియా దుష్ప్రచారం చేస్తోంది కనుక, దానికి భాజాభజాయింపు చేయడానికి పవన్ కల్యాణ్‌ కూడా ట్వీట్లు చేశారు. దసపల్ల భూముల గురించి అంతే. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని అంటారా? వద్దని అంటారా? అన్నిటిలోను వేలు పెట్టి ఏదో ఒకటి కెలకాలన్న ఆలోచన తప్ప, తన పార్టీ అభివృద్దికి ఏమి చేయాలన్న సంకల్పం ఆయనలో కనిపించదు.

పవన్ ఏకరువు పెట్టిన వైఫల్యాలలో వాస్తవాలు ఉన్నాయని అనుకుందాం. మరి వీటిని సరి చేయడానికి ఏమి చేయాలో పవన్ కల్యాణ్‌ చెప్పాలి కదా?. స్కూళ్లనాడు-నేడు నిలిపివేయమంటారా? అమ్మ ఒడి స్కీమ్ ఎత్తివేయమంటారా?. మద్య నిషేధం విషయంలో పవన్‌కు స్పష్టత ఉన్నదా? విశాఖ కార్యనిర్వాహక రాజధాని కావాలని అక్కడి ప్రజల ఆకాంక్ష. అందుకోసం అక్కడ గర్జన కార్యక్రమం జరుగుతుంటే పవన్‌కు వచ్చిన నొప్పి ఏమిటి. తనను విశాఖలో భాగమైన గాజువాక నుంచి ఘోరంగా ఓడించారన్న దుగ్దతో విశాఖను రాజధానిగా వద్దని ఆయన చెబుతున్నారా? ఒకవేళ జగన్ వైజాగ్‌ను విశాఖను రాజధాని చేయగలిగితే, దానిని మార్చివేసి అమరావతి పల్లెటూళ్లకే రాజధానిని తీసుకు వెళతామని పవన్ చెప్పగలరా? పోనీ పవన్ అమరావతిలో లక్షల కోట్లు వ్యయం చేసి, అక్కడివారికి మాత్రమే రియల్ ఎస్టేట్ ప్రయోజనం కల్పించాలని డిమాండ్ చేస్తారా?

రైతుల ముసుగులో పాదయాత్ర చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేదా కోటీశ్వరులకు, టీడీపీ వారికి మాత్రమే ఆర్దిక ప్రయోజనం కలగాలని పవన్ కూడా డిమాండ్ చేస్తారా? లేక తనకు అన్ని విధాల ఉపయోగపడే లింగమనేని రమేష్ వంటివారికి రియల్ ఎస్టేట్ ద్వారా ఆర్దిక ప్రయోజనం కలిగించాలని బహిరంగంగా కోరగలరా?. నిజంగానే రైతులు ఎవరైనా ఈ ప్రక్రియలో ఎక్కడైనా నష్టపోతే వారికి సాయం చేయడం తప్పుకాదు. పాదయాత్రలకే లక్షలు, కోట్లు ఖర్చు చేయగలిగిన స్థితిమంతులకు తెలుగుదేశం, జనసేన వంటి పార్టీలు మద్దతు ఇచ్చాయంటే వాటి స్వభావమే అంత అని సరిపెట్టుకోవచ్చు.

కాని పేదల పక్షపాతిగా చెప్పుకునే సీపీఐ వంటి పక్షాలు కూడా టీడీపీకి తోక పార్టీలుగా మారి ఆ పాదయాత్రకు మద్దతు ఇవ్వడం కాలమహిమ కాక మరేమిటి అవుతుంది. పవన్ వ్యాఖ్యలపై మంత్రులు జోగి రమేష్, రోజా వంటివారు బాగానే స్పందించారు. బహిరంగ చర్చకు రావాలని రమేష్ అంటే, ఉత్తరాంధ్రలో గతంలో వలసలు ఉన్నప్పుడు పవన్ ఏమి చేశారని రోజా అడిగారు. మరో మంత్రి అంబటి రాంబాబు అయితే ప్యాకేజీ కోసం మొరిగే వాళ్లకు గర్జన అర్థం అవుతుందా అని ప్రశ్నించారు. ఈ రకంగా వైసీపీ నుంచి పవన్ స్పందన పొందగలిగారు. బహుశా 2024 వరకు పవన్ వ్యాఖ్యలకు ఎంతో కొంత స్పందించవలసి ఉంటుందేమో!. తదుపరి ఏదో ఒకటి తేలిపోతుంది. స్థూలంగా చెప్పాలంటే ఇన్నేళ్ల రాజకీయం తర్వాత కూడా పవన్ కల్యాణ్‌ స్వయం ప్రకాశితం కాకపోవడమే జనసేన విషాదం అని చెప్పాలి.

-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement