ముంబై: ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ ప్రధాని నరేంద్ర మోదీని నవ భారత జాతిపితగా అభివర్ణించడంపట్ల శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమృత ఫడ్నవీస్ వ్యాఖ్యల్ని బీజేపీ అంగీకరిస్తే అది మోదీని తీవ్రంగా అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న నవభారతంలో ఆకలిచావులు, పేదరికం, నిరుద్యోగ్యం, ఉగ్రవాదం వంటి సమస్యలు భారీగా పెరిగిపోయాయని దుయ్యబట్టారు. ఈ మేరకు శివసేన (యూబీటీ) ప్రచార పత్రిక ‘సామ్నా’లోని సంపాదకీయంలో పేర్కొన్నారు.
స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్‌ను జాతి పితగా బీజేపీలో ఏ నాయకుడు కూడా చెప్పరని, రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్‌ఎస్‌ఎస్) ఎల్లప్పుడూ జైలుకెళ్లి శిక్ష అనుభవించిన వీర్‌సావర్కర్‌ను వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఇలాంటివారే భారతదేశాన్ని కొత్త, పాత భారతావనిగా విభజించారని చెప్పుకొచ్చారు. గాయకురాలు, బ్యాంకు అధికారి అయిన అమృత ఫడ్నవీస్ ఒక ఇంటర్వ్యూలో మన దేశానికి ఇద్దరు జాతిపితలు ఉన్నారని, ఒకరు పాత భారతానికి మహాత్మాగాంధీ అయితే కొత్త భారతావనికి ప్రధాని నరేంద్రమోదీ అని చెప్పారు.
చదవండి: మోదీ ప్రజాదరణ, అమిత్ షా వ్యూహాలు.. 2022లోనూ తిరుగులేని బీజేపీ!
అయితే అమృత వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో పాటు మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. స్వాతంత్య్ర సమరయోధుల ఆత్మ బలిదానాల నుంచి లభించిన దేశ స్వాతంత్య్రాన్ని బీజేపీ గుర్తించడంలేదని విమర్శించారు. ఎనిమిదేళ్ల ప్రధాని నరేంద్రమోదీ పరిపాలనలో ప్రస్తుతం దేశంలో ఆకలిచావులు, పేదరికం, నిరుద్యోగం, ఉగ్రవాదం ప్రధానంగా పెరిగిపోయాయని, ఇలాంటి కొత్త భారతావనికి జాతిపిత మోదీ అని చెప్పడం ఆయనకు తీవ్ర అవమానమని ఎద్దేవా చేశారు.
వివిధ రాజకీయ పార్టీలతోపాటుగా శివసేన పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నేత బాలాసాహెబ్ ఠాక్రే కూడా గతంలో ఇటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సంజయ్ రౌత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారతావనికి జాతిపిత ఎవరనేది సమస్య కాదని, అసలు దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో బీజేపీ పాత్ర ఏంటనేదే ఇక్కడ సమస్య అని వివరించారు. బీజేపీ గానీ, దాని అనుబంధ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ గానీ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఎటువంటి పాత్రపోషించలేదని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్‌తో అనుబంధమున్న సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి ఆదర్శనేతలను దొంగిలించి తమవారిగా చెప్పుకుంటూ బీజేపీ చరిత్రను వక్రీకరిస్తుందని సంజయ్ రౌత్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment