సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికపై మలి దఫా కసరత్తు చేసేందుకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఆదివారం భేటీ కానుంది. ఇప్పటికే ఎంపిక చేసిన స్థానాలతోపాటు మిగతా చోట్ల అభ్యర్థుల ఖరారు ప్రక్రియను పూర్తి చేయనుంది. ఇందుకోసం కమిటీ చైర్మన్ మురళీధరన్ శనివారం ఉదయమే ఢిల్లీకి చేరుకోగా.. మిగతా నేతలు కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఇతర సభ్యులు ఆదివారం ఉదయం ఢిల్లీకి చేరుకుంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
కసరత్తు పూర్తి చేసే దిశగా..
గత నెల 21, 22 తేదీల్లో నిర్వహించిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీల్లో 40 స్థానాల్లో ఒక్కో అభ్యర్థిని, మరో 35 స్థానాల్లో ఇద్దరి పేర్ల చొప్పున ఎంపిక చేశారు. ఈ దఫా భేటీలో రెండేసి పేర్లను ఎంపిక చేసినచోట్ల ఇటీవల నిర్వహించిన ఫ్లాష్ సర్వేల ఆధారంగా ఒకరి పేరును ఖరారు చేయనున్నట్టు తెలిసింది. వీటితోపాటు మిగతా స్థానాల్లోనూ అభ్యర్థులను వడపోయనున్నట్టు సమాచారం.
మొత్తంగా 75–80 స్థానాల్లో ఒక్కో అభ్యర్థి పేరు, మరో 30–35 వరకు స్థానాల్లో ఇద్దరి పేర్లను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఈ నెల 10న జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తీసుకునే నిర్ణయాల మేరకు.. ఈ నెల 14 తర్వాత తొలిజాబితా విడుదల చేసే అవకాశం ఉందని పార్టీవర్గాలు చెప్తున్నాయి. ఇలా అభ్యర్థుల ఎంపిక కసరత్తు చివరిదశకు వచ్చిన నేపథ్యంలో.. ఆశావహులు చాలా మంది ఢిల్లీలో మకాం వేసి.. ఏఐసీసీ పెద్దలు, రాష్ట్ర ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment