రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ముగ్గురు ఎంపీ అభ్యర్థుల ఖరారుకు చాన్స్
తమ కుటుంబ సభ్యులకు ఖమ్మం సీటు కోసం డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల ఒత్తిడి
రేసులో మాజీ మంత్రి మండవ, మరికొందరు ఉన్నట్లు ప్రచారం
అధిష్టానం పెద్దలను కలవనున్న సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న మూడు ఎంపీ టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం శనివారం ఓ నిర్ణయానికి రానుంది. ఢిల్లీలో జరగనున్న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో అభ్యర్థులను ఖరారు చేయనుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ ఈ భేటీ కోసం ఢిల్లీకి వెళ్లారు. పార్టీ అగ్రనేతలను కలిసి.. ఆయా నియోజకవర్గాల పరిస్థితులు, అభ్యర్థుల ఎంపికపై చేసిన కసరత్తును వివరించనున్నారు. సీఈసీ సమావేశానికి ముందే ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్‌లతో రేవంత్ భేటీ కానున్నట్టు తెలిసింది. భువనగిరిలో పార్టీ నిర్వ హించే బహిరంగ సభకు రావాలని అగ్రనేతలను రేవంత్ ఆహ్వానించనున్నట్టు సమాచారం.
మూడు స్థానాలపై ఉత్కంఠ
రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకుగాను 14 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి ఎవరికి దక్కుతాయన్నది హాట్‌టాపిక్‌గా మారింది. ఖమ్మం టికెట్ ఇవ్వాలంటూ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సతీమణి కోసం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన సోదరుడి కోసం, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తన కుమారుడి కోసం ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.
వీరితోపాటు అదే జిల్లాకు చెందిన ఓ వ్యాపారవేత్త కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుతోపాటు మరో ఇద్దరు బీసీ నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రాజేందర్‌రావు, తీన్మార్ మల్లన్న పోటీపడుతున్నారు. ఇక హైదరాబాద్ ఎంపీ స్థానంలో అలీ మస్కతీ పోటీ చేస్తారనుకున్నా.. ఆయన వెనక్కి తగ్గినట్టు తెలిసింది. దీంతో హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సమీర్ వలీఉల్లా పేరు వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment