బాబు ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోతున్న మహిళలు
సాక్షి, నంద్యాల: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రా కదలిరా సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సుమారు లక్ష మందితో సభ నిర్వహిస్తామని టీడీపీ నాయకులు గొప్పగా చెబుతూ వచ్చారు. కానీ, పదివేల మంది కూడా సభకు రాలేదు. నంద్యాల జిల్లా నుంచే కాకుండా కర్నూలు, కడప, అనంతపురం నుంచి కూడా జనాలను తరలించినప్పటికీ అనుకున్న లక్ష్యం దరిదాపుల్లోకి చేరలేదు. నియోజకవర్గాల నుంచి భారీగా జనాలను తరలించాలని ముందుగానే చెప్పినప్పటికీ జనాలను తరలించలేక నాయకులు చేతులెత్తేశారు.
రూ.2 కోట్లు వృథా..
సభ కోసం సుమారు రూ.రెండు కోట్లు ఖర్చుచేసినట్లు సమాచారం. అయినా తెలుగుదేశం పార్టీ సభకు జనం రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆ పార్టీ నాయకులుండిపోయారు. సభపై జనాలకు ఆసక్తిలేకపోతే తాము మాత్రం ఏం చేయగలమని తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడుకున్నారు.
వైఎస్ జగన్ కుటుంబం టార్గెట్‌గా విమర్శలు..
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకుని చంద్రబాబు మాట్లాడడం విమర్శలకు తావిచ్చింది. తాను అధికారంలో ఉండి ఉంటే రాయలసీమను సస్యశ్యామలం చేసేవాడినని చెప్పడంతో స్థానికులు విస్మయానికి గురయ్యారు. బిర్యానీ, మందు ఇచ్చి జనాలను తరలించినా చంద్రబాబు ఉపన్యాసం బోరు కొట్టడంతో చాలామంది సభ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు.
కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ సభలో ఆయన అభిమానులు ఫ్లెక్సీలు పట్టుకున్నారు. ఇక ఆళ్లగడ్డ టికెట్ విషయంలోనూ భూమా అఖిలప్రియకు ఎలాంటి హామీ లభించకపోవడంతో కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. మరోవైపు.. టీడీపీ–జనసేన కూటమి ఏర్పడిన తర్వాత నంద్యాల జిల్లాలో ఏర్పాటుచేసిన మొదటి సభకు జనసేన నుంచి ఏ ఒక్క నేతా హాజరుకాలేదు.
అసహనానికి గురైన చంద్రబాబు
సభకు జనాలు లేకపోవడంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభలకు కూడా జనాలను తరలించలేకపోతే ఇక మీరెందుకంటూ నాయకులపై మండిపడినట్లు తెలిసింది. సభ ఆద్యంతం ఆయన ముఖంలో అసహనం కనిపించింది. మరోవైపు.. చంద్రబాబు ప్రసంగిస్తుండగానే వచ్చిన అరకొర జనం కూడా వెనుదిరగడంతో ఏం చేయాలో తెలియక టీడీపీ నాయకులు తలలు పట్టుకున్నారు. సభకు వచ్చేందుకు స్థానిక కార్యకర్తలు ఆసక్తి కనబరచలేదు. ఆళ్లగడ్డ నుంచి కేవలం రెండు, మూడు వేల మందే వచ్చినట్లు ఆ పార్టీ నాయకులే మాట్లాడుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment