ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గ్రామాలలో నిరుపేదలు ఉండరాదా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం అమరావతి గ్రామాలలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్ల రాజధాని స్వరూపం మారిపోతుందా? అక్కడ డబ్బులు ఉన్న మా రాజుల సోకులకు ఇబ్బంది వస్తుందా? గత ప్రభుత్వ హయాంలో దళితుల అస్సైన్డ్ మెంట్ భూములను ఏదో రకంగా స్వాధీనం చేసుకోవడంలో ఈ లక్ష్యం కూడా ఉందా? రాజధాని అంశం గత తొమ్మిదేళ్లుగా ఏదో రూపంలో నలుగుతూనే ఉంది. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో దొరికిపోవడం ఈ వ్యవహారాలలో ఒక కీలక మలుపు అని చెప్పాలి.
అదే 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గా ఉన్నట్లయితే ఈ పరిస్థితులు వచ్చి ఉండేవి కావేమో! ఆ తర్వాత విజయవాడ పరిసరాలలో రాజధాని అని ప్రకటించి భారీ స్పెక్యులేషన్ కు అవకాశం ఇచ్చారు. తన పార్టీ వారికి ,తన వారికి మంచి అవకాశం వచ్చేలా చేసి ఇన్ సైడ్ ట్రేడింగ్ ద్వారా లబ్ది చేకూర్చారన్న ఆరోపణను చంద్రబాబు ఎదుర్కున్నారు. రైతులకు ఇష్టం ఉన్నా,లేకున్నా ముప్పై మూడు వేల ఎకరాలను సమీకరించారు. భూములు ఇవ్వని రైతుల పంటలను కూడా దగ్దం చేయించారన్న విమర్శలు ఎదుర్కున్నారు.
కొత్త రాజధాని నిర్మాణం పేరిట దేశదేశాలు తిరిగి వందల కోట్లు వ్యయం చేశారు. అసలు ఇన్నివేల ఎకరాలు ఎందుకు? వెయ్యి లేదా రెండువేల ఎకరాలు సేకరించి అవసరమైన భవనాలు నిర్మించుకుంటే సరిపోతుంది కదా అని చెప్పినవారిపై ఆయన హుంకరించేవారు. అసలు ఎపి భవిష్యత్తు అంతా ఆ అమరావతిలోనే ఉందని ప్రచారం చేసేవారు. అందుకోసం ప్రజలు కూడా విరాళాలు ఇవ్వాలని అనేవారు. కేంద్రం లక్షల కోట్ల ఆర్దిక సాయం చేయాలని కోరేవారు. తొలిదశకే లక్షా తొమ్మిది వేల కోట్లు కావాలని కేంద్రానికి ఆయన ఉత్తరం రాశారు.
వందల కోట్ల వ్యయం చేసి తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం నిర్మించారు. అవి కూడా ఎక్కడో మారుమూల గ్రామంలో కట్టారు. ఆయన తన పాలన టైమ్ లో సరైన రోడ్డును కూడా నిర్మించలేకపోయారు. ఒక ప్రధాన రోడ్డు వేయడానికి ప్రయత్నించినా, దానిని పూర్తి చేయలేకపోయారు. అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంటివారు సైతం అమరావతి రాజధాని ఒక వర్గానికి చెందిన రాజధాని అని విమర్శించేవారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల ప్రజలంతా అభివృద్ది అంతా ఒక్క గుంటూరు జిల్లా ప్రాంతంలోనేనా అని వాపోయేవారు.
కృష్ణా, గుంటూరు జిల్లా లోని ప్రజలు కేవలం ఒక సామాజికవర్గ ప్రయోజనానికే రాజధాని నిర్మాణం చేస్తున్నారని, మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చారని భావించేవారు.వీటన్నిటి ఫలితం తెలుగుదేశం ఘోరమైన పరాజయం. ఇంకో సంగతి చెప్పాలి. ఆనాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తే చంద్రబాబు వర్గం వారు కొందరు ఆయన నడిచిన ప్రాంతంలో పసుపు నీళ్లు చల్లి తమ దురహంకారాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం, జగన్ ముఖ్యమంత్రి కావడం జరిగింది.
ఆయన పరిస్థితి అంతటిని అధ్యయనం చేసి, కొందరు ప్రముఖులతో కలిసి కమిటీలను వేశారు. వారిచ్చిన సిఫారసులను దృష్టిలో ఉంచుకుని విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని ప్రతిపాదించారు. కాని దీనిని వ్యతిరేకించిన చంద్రబాబు, టిడిపి నేతలు రకరకాల ఎత్తుగడలతో అది ముందుకువళ్లకుండా చేస్తూ వచ్చారు. ఇప్పుడిప్పుడే ఎపి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలను పొందుతోంది. రాజధానిలో చట్టం ప్రకారం ఐదు శాతం భూములలో పేదలకు ఇళ్ల స్థలాలకు కేటాయించాలి. చట్టంలో అలా ఉన్నా, ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం చర్య తీసుకోలేదు.
పైగా దళితుల అస్సైన్డ్ భూములన్నిటీని మోతుబరులు స్వాధీనం చేసుకునేందుకు సహకరించింది. అంటే అక్కడ పేదలు ఉంటే వారి విలాసవంతమైన భవనాలకు విలువ ఉండదని అనుకుని ఉండాలి. నిజమే.పొలాలు ఇచ్చిన రైతులకు అభివృద్ది చేసిన ప్లాట్లు ఇవ్వాలి. కాని అదే సమయంలో పేదలకు కూడా అక్కడ అవకాశం ఉండాలి కదా! జగన్ ప్రభుత్వం విజయవాడ, గుంటూరు ప్రాంతంలోని పేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయించగానే మళ్లీ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. దానిపై డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేస్తే, ఆ ధర్మాసనం ఆ తీర్పుపై ఆశ్చర్యం వ్యక్తం చేసి నిలుపుదల చేసింది.
దాంతో జగన్ ప్రభుత్వం ఏభై నాలుగువేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, గృహాలు నిర్మించాలని ప్రతిపాదించి చురుకుగా కృషి చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా రైతుల పేరుతో కొందరు సుప్రింకోర్టుకు వెళ్లారు. ఆర్.జోన్ 5 లో పేదలకు స్థలాలు ఇవ్వడానికి అత్యున్నత న్యాయస్థానం కూడా ఒకే చేసింది. కాకపోతే హైకోర్టు ఇచ్చే అంతిమ తీర్పుకు లోబడి ఉండాలని ఒక మాట అంది. స్థూలంగా అది పేదలకు, ప్రభుత్వానికి విజయంగా భావించవచ్చు. జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా, అక్కడ వారికి అవసరమైన సదుపాయలు కూడా కల్పిస్తోంది. అయినా రైతుల పేరుతో కోట్ల రూపాయల వ్యయం చేసి కొందరు కోర్టులకు వెళ్లారు.
రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చకుండా ఉంటే ఈ రైతులు కాని, వారి ముసుగులో ఉన్న టిడిపి నేతలు కాని ఈ స్థలాలను అడ్డుకునే యత్నం చేయగలిగేవారా? చిత్రం ఏమిటంటే పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించాలన్న నినాదంతో ఎన్.టి.రామారావు టిడిపిని స్థాపించారు. కాని ఇప్పుడు పేదవాడికి ఇల్లు నిర్మించడానికి వీలులేదన్నట్లుగా తెలుగుదేశం ఆటంకాలు సృష్టిస్తోంది. చివరికి పేదల పక్షాన నిలవవలసిన వామపక్షాలు సైతం చంద్రబాబుకే బాకా ఊదడం దురదృష్టకరం. విజయవాడ కాల్వల వెంట ఉన్న గుడిసెలను తొలగించి, వేరే చోట భూములు ఇవ్వడానికి గతంలో ప్రభుత్వం ప్రయత్నిస్తే వామపక్షాలు అడ్డుకునే యత్నం చేసేవి. పేదలకు అన్యాయం అని వ్యాఖ్యానించేవి. కాని రాజధాని అమరావతిలో వారికి భూములు ఇస్తుంటే ప్రత్యేకించి సిపిఐ హర్షించకపోగా, భూస్వాములకు, టీడీపీకి మద్దతు ఇస్తోంది.
దేశంలో ఏ రాజధానిలోనూ పేదల ఇళ్లు, చిన్న కాలనీలు లేవా? అన్నదాని గురించి ఆలోచిస్తే, అమరావతిలో మాత్రమే అలా ఉండరాదని చెబుతున్నట్లుగా ఉంది. ఢిల్లీలో అనేక లొకాలిటీలలో పేదల ఇళ్లు ఉన్నాయి. ముంబైలో ధారవి ఒక పెద్ద ఉదాహరణ. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మొత్తం అన్ని ప్రభుత్వ భవనాలు కలిపి 235 ఎకరాలలో ఉన్నాయి. హైదరాబాద్ లో సచివాలయం చెంతనే పేదలు, దిగువ మధ్య తరగతికి చెందినవారి కాలనీలు ఎన్నో ఉన్నాయి.
చదవండి: గేరు మార్చి.. స్పీడ్ పెంచి.. సీఎం జగన్ బలం అదే.. ఇదీ లెక్క..!
హైదరాబాద్‌లో ధనిక ప్రాంతాలుగా గుర్తింపు పొందిన బంజారాహిల్స్, జూబ్లి హిల్స్ వంటి చోట్ల బలహీనవర్గాల కాలనీలు కూడా ఉన్నాయి. ఒకవేళ అలాంటి అవకాశం ఇవ్వకపోతే, పేదలు ఎక్కడ కాస్త జాగా దొరికితే అక్కడ గుడిసెలు వేసుకుంటున్నారు. దానికన్నా ప్రభుత్వం వారికి కాస్త జాగా స్థలం ఇస్తే సంతోషంగా ఇల్లు కట్టుకుంటారు కదా! ప్రస్తుతం ఎపి ముఖ్యమంత్రి జగన్ అదే పని చేస్తున్నారు. కాని టీడీపీ వారేమో అలా పేదల కాలనీలవల్ల తమ భూముల రియల్ ఎస్టేట్ వాల్యూ తగ్గిపోతుందని అంటున్నారు. హైదరాబాద్ లో పేదల కాలనీలవల్ల అలా ధరలు పడిపోయిన దాఖలాలు లేవు.
ఆ సంగతిని విస్మరించి అమరావతి ప్రాంత రైతులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారి మాటలు నమ్మి తమకు తామే నష్టం చేసుకుంటున్నారు. మరో వైపు జగన్ పట్టుదలతో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ముందుకు వెళుతున్నారు. శరవేగంగా సాగుతున్న ఈ కార్యక్రమం ఒక కొలిక్కి రాబోతోంది. అప్పుడు కులాల అసమౌతుల్యత వస్తుందని అనేవారికి ఇది ఒక గుణపాఠం అవుతుంది. మనుషులంతా ఒక్కటే అన్న సూత్రాన్ని జగన్ అమలు చేయబోతున్నారన్నమాట.
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment