మహానాడులో చంద్రబాబుకి ‘సన్‌’స్ట్రోక్‌! | Is Chandrababu Blames Nara Lokesh For Digital Mahanadu Failure | Sakshi
Sakshi News home page

మహానాడులో చంద్రబాబుకి ‘సన్‌’స్ట్రోక్‌!

May 28 2026 1:45 PM | Updated on May 28 2026 3:55 PM

Is Chandrababu Blames Nara Lokesh For Digital Mahanadu Failure

తెలుగు దేశం​ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఫీలయ్యే ‘‘మహానాడు’’ గతకొన్నేళ్లుగా రాజకీయ సెటైర్లకు కేంద్రబిందువుగా మారుతోంది. టెక్నాలజీ వినియోగంలో తాము దేశానికి మార్గదర్శకులమని చెప్పుకునే ఆ పార్టీ పెద్దకు.. ఈసారి హైబ్రిడ్‌ మహానాడు చేదు అనుభవమే మిగులుస్తోంది. ఈ వర్చువల్‌ ప్రయోగం ఆయనో షాక్‌లా మారడమే కాదు.. సీనియర్ల నుంచి పెదవి విరుపులకు కారణమైందనే చర్చ టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఒకవైపు టీడీపీ వర్గాలు, వాటి అనుకూల మీడియాలు రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్ల నుంచి 7.20 లక్షల మంది వర్చువల్‌గా పాల్గొన్నారని భారీ లెక్కలు చెబుతుండగా.. మరోవైపు అంతటా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్న వీడియోలు అదే మీడియా చానెళ్ల ద్వారా బయటకు వస్తున్నాయి. కృష్ణాజిల్లాలోని మోపిదేవి సెంటర్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్‌ మహానాడు కార్యక్రమం అయితే ఈ విమర్శలకు ప్రధాన ఉదాహరణగా మారింది. భారీ టెంట్లు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసినప్పటికీ.. కుర్చీలు మాత్రం ఖాళీగా కనిపించాయి. 

చంద్రబాబు ప్రసంగం జరుగుతున్న సమయంలో కూడా కార్యకర్తలు పెద్దగా ఆసక్తి చూపలేదని స్థానికంగా చర్చ నడుస్తోంది. “రండి బాబు రండి” అంటూ నేతలు కార్యకర్తలను బ్రతిమాలుకున్నా స్పందన ఆశించిన స్థాయిలో రాలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

నేతల తంటాలు
మహానాడులో జనం ఉన్నట్లు కవరింగ్‌ చేసుకునేందుకు టీడీపీ నేతలు నానా తంటాలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో జనాలు లేకపోవడంతో పాత రికార్డింగ్‌ వీడియోలు ప్లే చేశారని తెలుస్తోంది. మరికొన్ని చోట్ల రికార్డింగ్‌ డ్యాన్సులు, భోజనాలు ఏర్పాటు చేసి జనాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇక సంక్షేమ పథకాల లబ్ధిదారులు, పొదుపు సంఘాల మహిళలను తప్పనిసరిగా హాజరు కావాలంటూ స్థానిక నేతల ద్వారా ఒత్తిళ్లు తెచ్చారన్న ప్రచారం కూడా వినిపించింది.

అయితే టీడీపీ మాత్రం పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపిస్తోంది. “యాప్‌ రిజిస్ట్రేషన్‌, టైం టు టైం అటెండెన్స్‌, డిసిప్లిన్‌, వర్చువల్‌ కనెక్టివిటీ”తో మహానాడు ఘనవిజయమైందని చెబుతోంది. తెలంగాణ, అండమాన్‌ నుంచి కూడా కార్యకర్తలు పాల్గొన్నారని.. ఒక్కో క్లస్టర్‌లో 300 మందికిపైగా హాజరయ్యారని పార్టీ వర్గాలు ప్రకటిస్తున్నాయి. కానీ గ్రౌండ్‌ రియాలిటీ మాత్రం మరోలా ఉంది.

అంతా లోకేష్‌ వల్లే.. 
ఈ హైబ్రిడ్‌ మోడల్‌ వెనుక నారా లోకేష్‌ సలహా కీలకంగా ఉందన్న ప్రచారం పార్టీలోనే వినిపిస్తోంది. డిజిటల్‌ ఫార్మాట్‌తో భారీ ఇంపాక్ట్‌ వస్తుందని భావించినా.. చివరికి అది రివర్స్‌ అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే.. “లోకేష్‌బాబు మాట వినొద్దు సర్‌” అంటూ కొందరు టీడీపీ సీనియర్లు ముందుగానే చంద్రబాబును హెచ్చరించారట. కార్యకర్తల ఉత్సాహం, ప్రత్యక్ష హాజరు, రాజకీయ వేడి లేకుండా మహానాడు ప్రభావం తగ్గిపోతుందని చెప్పినా.. చివరకు అదే నిజమైందన్న చర్చ ఇప్పుడు పార్టీలోనే నడుస్తోందట. ఈ ప్రయోగం విఫలమైందనే ఫీలింగ్‌లో చంద్రబాబు కూడా ఉన్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఇదిలా ఉంటే.. గతేడాది కడపలో జరిగిన మహానాడులో ఎన్టీఆర్‌ వారసత్వం, పార్టీ భవిష్యత్తు, లోకేష్‌ నాయకత్వంపై భారీ ఎమోషనల్‌ హైప్‌ క్రియేట్‌ చేసిన టీడీపీ.. ఈసారి మాత్రం పూర్తిగా టెక్నాలజీ ఆధారిత ప్రయోగానికి వెళ్లి బొక్కబొర్లా పడింది. అప్పట్లో “ఎన్టీఆర్‌ దిగొచ్చి చంద్రబాబు, లోకేష్‌లను చూసి గర్వపడ్డారు” అన్నట్టుగా ఏఐతో వైరల్‌ చేసిన వీడియోలు, విజువల్స్‌తో నవ్వులపాలయ్యారు. ఇప్పుడు అదే లోకేష్‌ సూచించిన హైబ్రిడ్‌ మోడల్‌తో సొంత నేతల నుంచే విమర్శల పాలవుతోంది.

డిజిటల్ మహానాడుకు ఆదరణ కరువు.. కార్యకర్తలని బతిమాలాడుతున్న లీడర్లు

“డిజిటల్‌ కనెక్టివిటీతో కొత్త రాజకీయ సంస్కృతి” తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈసారి వర్చువల్‌ మహానాడును భారీగా ప్లాన్‌ చేసినప్పటికీ.. గ్రౌండ్‌లో కనిపించిన ఖాళీ కుర్చీలు మాత్రం పార్టీ అంచనాలను తారుమారు చేశాయన్న చర్చ సాగుతోంది. “గతేడాది ఎమోషన్‌తో హైప్‌.. ఈసారి యాప్‌లతో టైప్‌” అంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా లోకేష్‌ టీమ్‌ టెక్నాలజీ ప్రెజెంటేషన్‌, యాప్‌ అటెండెన్స్‌, డిజిటల్‌ మానిటరింగ్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టి.. కార్యకర్తల భావోద్వేగ కనెక్ట్‌ను మిస్‌ అయ్యిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది మహానాడు ముగింపునకు ఒకరోజు ముందే టీడీపీకి గ్రౌండ్‌ రియాలిటీని చూపెట్టింది. వచ్చే ఏడాది ఇలాంటి “వర్చువల్‌ ప్రయోగాలు” వద్దని పార్టీ సీనియర్లు చంద్రబాబుకి స్పష్టంగా చెబుతున్నట్లు సమాచారం. మొత్తానికి టెక్నాలజీతో రాజకీయాలను మార్చేస్తామని చెప్పిన టీడీపీకి.. ఈసారి “డిజిటల్‌ మహానాడు” మాత్రం సోషల్‌ మీడియాలో సెటైర్ల సునామీగా మారిపోయింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement