ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల గురించి మేకపోతు గాంభీర్యంగా మాట్లాడుతున్నట్లుగా ఉంది. వంద శాతం విజయం సాధిస్తామని ఆయన నమ్మబలుకుతున్నారు. ఇదంతా ఆయన తన క్యాడర్‌ను రక్షించుకోవడానికే అన్న విషయం బహిరంగ రహస్యం. తాము గెలుస్తామని ఏ పార్టీ అయినా చెబుతుంది. చంద్రబాబు కూడా అలాగే అంటున్నారు. కాని ఆయన మాటల్లో ఆ విశ్వాసం కొరవడింది.
ఢిల్లీలో మీడియా వారితో మాట్లాడినప్పుడు ఏపీ ప్రభుత్వంపై రోజూ వారి విమర్శల మాదిరే అనేక ఆరోపణలు సంధించారు. హైదరాబాద్ తానే నిర్మించానంతంగా బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. తాను ప్లైఓవర్లు నిర్మించిన చందంగానే ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్లై ఓవర్లను నిర్మిస్తోందని ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్‌లో పలు బ్రిడ్జిలను నియమించిన సంగతి నిజమే. చంద్రబాబు టైమ్‌లో చాలీచాలని వంతెనలు నాలుగు నిర్మించి అదే పెద్ద ఘనతగా ఆయన చెప్పుకుంటున్నారు.
అంతకు ముందు రోజుల్లో చెన్నారెడ్డి ప్రభుత్వం కూడా ఖైరతాబాద్, సనత్ నగర్ వంటి చోట్ల పెద్ద వంతెనలు నిర్మించింది. చంద్రబాబు తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరెడ్డి ప్రభుత్వం పలు ప్లై ఓవర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. అందులో కీలకమైన పంజాగుట్ట ప్లై ఓవర్ ఒకటి అని చెప్పాలి. చంద్రబాబు టైమ్‌లో ఈ వంతెన విషయంలో ముందడుగే పడలేదు. ఏ ప్రభుత్వం ఉన్నా అక్కడ ప్రజలకు సదుపాయాలు మెరుగుపర్చాల్సిందే. అలాగే చేస్తారు కూడా.
కాని చంద్రబాబు గొప్పతనం ఏమిటంటే ఎవరూ ఏమీ చేయలేదని, తాను మాత్రమే అన్నీ చేశానని ప్రచారం చేసుకుంటారు. దానికి ఈనాడు, మరికొన్ని టీడీపీ పత్రికలు వంత పాడుతుంటాయి. ఇప్పుడు టీఆర్ఎస్‌కు కాస్త క్రెడిట్ ఇవ్వడంలోని ఆంతర్యం తెలియనిది కాదు. టీఆర్ఎస్‌తో ఏదో రకంగా మంచిగా లేకపోతే ఏమి ఇబ్బంది వస్తుందోనన్న భయం తప్ప మరొకటి కాదు.
ఎందుకంటే 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పలు విధాలుగా చంద్రబాబు ఎద్దేవా చేసేవారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయేవరకు అలాగే సాగింది. ఆ తర్వాత విజయవాడకు రాత్రికి రాత్రే పెట్టాబేడ సర్దుకుని వెళ్లిపోయారు. ఏపీ ప్రజల కోసమే తాను హైదరాబాద్ వదలివచ్చానని బిల్డప్ ఇచ్చుకునేవారు. అంతగా హైదరాబాద్‌లో అన్ని నిర్మాణాలు చేస్తే మరి ఏపీలో ముఖ్యంగా విజయవాడలో ఎందుకు చేయలేకపోయారో ఆయన తెలపాలి. అమరావతి పేరుతో ఉన్న గ్రామాలలో ఆయన నిర్మించిన వంతెనలు ఏవి? కృష్ణా నది పై ఐకాన్ వంతెనలు, భారీ భవంతులు అంటూ గ్రాఫిక్స్ చూపించారే తప్ప, ఒక్కటి కూడా ముందడుగు పడలేదే?
అంతదాకా ఎందుకు కనకదుర్గ గుడి వద్ద వంతెన నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేకపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక, ఆ వంతెనను పూర్తి చేసిన సంగతి తెలియదా! కేంద్ర మంత్రి గడ్కరితో కలిసి ఆయన ప్రారంభోత్సవం చేశారు. అంతేకాదు. బెంజ్ సర్కిల్ వద్ద రెండో వంతెనను జగన్ టైమ్‌లోనే చేపట్టి పూర్తికావించారు. మరో వైపు అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు బైపాస్ రోడ్‌ను వేగంగా నిర్మిస్తున్నారు. కృష్ణలంక వాసుల బాధలు తీర్చే విధంగా నదిలో పెద్ద ఎత్తున వాల్ నిర్మించిన ఘనత జగన్‌దే కదా? ఇవేవీ ఎలాగూ చంద్రబాబు చెప్పలేరు. కాని దారుణమైన వ్యాఖ్యలు మాత్రం చేస్తుంటారు.
జగన్ ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడుతోందని ఆయన ఆరోపిస్తుంటారు. అదేమిటో చెప్పరు. జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందట. వంద శాతం టీడీపీనే గెలుస్తుందని ఆయన చెబుతున్నారు. అంత నమ్మకం ఉంటే ఆత్మకూరు ఉప ఎన్నికలో ఎందుకు పోటీ చేయలేక పోయారు?. స్థానిక ఎన్నికలలో ఘోరంగా ఎందుకు ఓటమి పాలయ్యారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉంటే ఎన్నికలలో డబ్బు ఖర్చు చేసినా ప్రయోజనం ఉండదని అన్నారు. తద్వారా ఆయన ఒక విషయాన్ని అంగీకరించినట్లయింది.
2014 నుంచి 2019 వరకు తన పాలనపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, దాని ఫలితంగానే కేవలం 23 సీట్లకే టీడీపీని పరిమితం చేశారని ఆయన ఒప్పుకున్నట్లయింది. కాకపోతే ఆ మాట చెప్పకుండా, అదేదో ఇప్పటి ప్రభుత్వంపైనే వ్యతిరేకత ఉందని వ్యాఖ్యానిస్తుంటారు. గతంలో ఓటమి తర్వాత తాను చేసిన తప్పేమిటి అని అనేవారు. ప్రజలే తప్పు చేశారని కూడా అన్నారన్న సంగతి గుర్తుకు చేసుకోవాలి.
చంద్రబాబుకు తన పార్టీ విజయం మీద అంత విశ్వాసం ఉంటే, ఎందుకు జనసేన వైపు దీనంగా చూస్తూ, తనకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తన దత్తపుత్రుడి మాదిరిగా చూసుకుంటున్నారన్న విమర్శను ఎందుకు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. టీడీపీని ఛీ కొడుతున్న బీజేపీ వెంట ఎందుకు పడుతున్నారు?.
మోదీ పలకరింపే మహా గొప్పగా ఎందుకు ఫీల్ అవుతున్నారు. అందుకే చంద్రబాబుదంతా మేకపోతు గాంభీర్యం అని చెప్పవలసి వస్తున్నది. అసలు ఈసారి కుప్పంలో ఆయన పరిస్థితి ఏమిటో అర్థం కాక సతమతమవుతున్నారు. పైకి మాత్రం ఇలా మాట్లాడుతున్నారు. ఆయన ఎక్కడకు వెళ్ళినా జీవితంలో చూడనంత స్పందన చూస్తున్నారట. ఇదే మాట గత పాతికేళ్లుగా ఆయన చెబుతూనే ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రజలను మభ్యపెట్టడానికి చేసే ప్రయత్నం.
చదవండి: టీడీపీలో కొత్త టెన్షన్ మొదలైందా?.. బాబూ నెక్ట్స్ఏంటి?
ఇక ఆయనను పైకి లేపడానికి జాకీలు వాడుతున్న ఒక పత్రిక అయితే ప్రధాని మోదీ జీ-20 గ్రూపునకు అధ్యక్షత వహిస్తున్న సందర్భంగా నిర్వహించిన అఖిలపక్షంలో అందరిని పలకరించినట్లే ఈయనను కూడా పలకరిస్తే, అసలు మొత్తం సమావేశానికంతటికి చంద్రబాబే సలహాలు ఇచ్చారేమో అన్న భ్రమ కలిగేలా వార్తలు రాసింది. ఇలాంటి వారిని నమ్ముకుంటే లాభం కలిగే రోజులు కావివి అని తెలిసినా చంద్రబాబు వారిని కాదనలేకపోతున్నారు.
ఈనాడు, జ్యోతి వంటి మీడియాల ట్రాప్‌లో పడి ఆయన ఒక రకంగా చెప్పాలంటే గిలగిలలాడుతున్నారు. ఆ పత్రికలు జగన్ ప్రభుత్వంపై ఉన్నవి, లేనివి రాస్తున్నాయి. అవన్ని నమ్మితే తన కొంప మునుగుతుందేమోనన్న భయం ఒక వైపు, వారిని కాదంటే మరింత ఇబ్బంది వస్తుందేమోనన్న ఆందోళనతో చంద్రబాబు కిందామీద పడుతున్నారు. ఏది ఏమైనా మీడియాను అడ్డుపెట్టుకునే ఆయన తన రాజకీయం కొనసాగిస్తున్నారు. అదే చంద్రబాబు బలం. . అదే చంద్రబాబు బలహీనత అని చెప్పాలి.
-హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment