Pawan - Babu : బద్రీ.. దాన్నే వెన్నుపోటు అంటారు..! | Chandrababu Naidu Backstabbing Politics | Sakshi
Sakshi News home page

Pawan - Babu : బద్రీ.. దాన్నే వెన్నుపోటు అంటారు..!

Published Sat, Mar 9 2024 2:34 PM | Last Updated on Sat, Mar 9 2024 3:51 PM

Chandrababu Naidu Backstabbing Politics - Sakshi

పొత్తు కుదిరిందట.. అసలు దాన్ని పొత్తు అంటారా.?  ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం కానీ.. ఇంతకీ ఢిల్లీలో ఏం జరిగిందంటే.. కలిసి పోటీచేయాలని మూడు పార్టీలు.. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నిర్ణయించుకున్నాయని కనకమేడల రవీంద్ర కుమార్ ప్రకటించారు. పార్టీల బలబలాలను బట్టి స్థానాల నిర్ణయం ఉంటుందని, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే పొత్తు పెట్టుకున్నామని, అధికారం కోసం కాదని ప్రకటించారు. మూడు పార్టీల పొత్తులో రాష్ట్ర భవిష్యత్తు ప్రస్తావన ఏంటో .. ఆయనే చెప్పాలి కానీ చెప్పలేదు. ఈ పొత్తును జాగ్రత్తగా పరిశీలిస్తే.. పాపం పవన్‌ కళ్యాణ్‌ అని చిన్నపిల్లలైనా అంటారు. ఈ ఫోటో స్టోరీని కాస్తా సమయం పెట్టి చదవండి. మీరు కూడా అంటారా లేదా అప్పుడు చూద్దాం.

వెనకాటికి ఒకడు.. నాది, మా రాజు గారిది కలిపి వంద ఎకరాలు అన్నాట్ట. అలా కాదురా అబ్బి.. నీ కెంత భూమి ఉందని అడిగితే.. మళ్లీ అదే సమాధానం చెప్పాడట. అలా కాదని నీ భూమి ఏది చూపించమంటే.. గట్టు చూపించాడట. అలా ఉంది చంద్రబాబు స్కెచ్‌.

అధికారంలో వాటా ఇస్తాం.. సీట్లలో వాటా ఇస్తాం.. బాబ్బాబు.. కాస్తా రాగలరు అంటూ జైలుకు రప్పించుకుని మరీ పొత్తు ప్రకటన చేయించాడు. నీకు కావాల్సినవన్నీ ఇస్తాం.. కాపులంతా మనకే ఓటేసేలా చూడాలంటూ అదరగొట్టాడు. అప్పటికీ చంద్రబాబు గురించి తెలిసిన కొందరు "అబ్బీ.. ఈ వ్యవహారం షానా డేంజర్‌" అని పవన్‌ను హెచ్చరించారు. 

"గెలిస్తే.. నీకు ముఖ్యమంత్రి పదవి వస్తుందా? కనీసం ఓ నెల పాటయినా నిన్ను కుర్చీలో కూర్చోబెడతారా? అసలు నీకు "అత్తారింటికి దారేది" టైపులో అసెంబ్లీకి దారుందా? " అంటూ జాగ్రత్తగా అడిగితే .. "గుడుంబా శంకర్‌" గయ్యిమన్నాడు.

ఇప్పుడు ఎల్లో మీడియాకు చంద్రబాబు ఇచ్చిన లీకులేంటంటే.. "బీజేపీ, జనసేనకు కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలు అలాగే టిడిపికి 145 అసెంబ్లీ స్థానాలు, జనసేన, బీజేపీకి 30 స్థానాలు". ఒకప్పుడు ముఖ్యమంత్రి అవుతా.. ముఖ్యమంత్రి అవుతా.. అని ప్రకటించుకున్న నోటితోనే.. నేను రాజీ పడతా, రాజీ పడతా అని చెప్పుకోవాల్సిన దుస్థితిని చాలా అందంగా క్రియేట్‌ చేశాడు చంద్రాలు. ఎంతయినా బాబు గారి స్క్రీన్‌ ప్లే.. అబ్బో.. అదో అంతు లేని కథ. 50,60 సీట్లన్న పవన్‌ కళ్యాణ్‌ను 2 డజన్లకు తెచ్చాడు. అప్పటికీ పవన్‌ ఏమన్నాడు.. 24 అంటే 24 మాత్రమే కాదు, వాటి పక్కన మూడు పార్లమెంటు సీట్లున్నాయి.. అంటే ఓ 40 చోట్ల పోటీ చేస్తున్నట్టు లెక్క.. అని పాతకాలం మార్వాడీ కథ ఒకటి వినిపించాడు. ఇప్పుడు ఆ సీట్లలోనూ కోత.. కాదు కాదు ఊచకోత.

అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కలుపుకోవాలన్న ఐడియా చంద్రబాబుది. ఆ ఐడియాను అమలు చేయాల్సిన బాధ్యత "అజ్ఞాతవాసి"ది. అందుకే నన్ను నానా మాటలు అంటున్నా.. చీవాట్లు పెడుతున్నా.. కాళ్లు పట్టుకుని పొత్తుకు ఒప్పిస్తున్నానంటూ "గబ్బర్‌ సింగ్‌" పలుకులు పలికాడు. 

ఇక్కడ బాబు మంత్రాంగం ఇప్పుడిప్పుడే సంపూర్ణంగా తెలిసివస్తోంది. గంజి వంచే సమయంలో అన్నం గిన్నెను దించినట్టు.. బీజేపీ అడిగిన సీట్ల మేరకు జనసేన సీట్లలో కత్తెర పడుతుందట. పైగా దీనికి త్యాగం అని పేరు పెడుతున్నారు. 

సింగిల్‌గా పోటీ చేయు నాయనా అంటూ "కాటమరాయుడికి" అప్పుడు అర్థం కాలేదు, బాబు వెంట తిరిగితే.. "తీన్‌మార్‌" అన్న విషయం కాస్తా ఆలస్యంగా "పంజా" పడిన తర్వాత గానీ అర్థం కావడం లేదు. ఇప్పటిదాకా ఉన్న "ఖుషి" కాస్తా.. ఇప్పుడిప్పుడే ఆవిరవుతోంది. 

"జల్సా" చేద్దామనుకుని జనం ముందుకు రావాలనుకుంటే.. నిజాయతీగా రావాలి గానీ.. వెన్నుపోటులో పీహెచ్‌డీ చేసిన వాడెనక వస్తే.. కొట్టాల్సింది "శంకర్‌ దాదా జిందాబాదే". అన్నట్టు లక్ష పుస్తకాలు చదివిన పవన్‌ కళ్యాణ్‌ లిస్టులో "చివరికి మిగిలేది" పుస్తకం ఉందా? లేదా? జన సైనిక్స్‌.. కాస్తా చెప్పండి ప్లీజ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement