పోలవరానికి ‘చంద్ర’శాపం | Chandrababu Naidu is Releasing lies White Paper on Polavaram Project | Sakshi
Sakshi News home page

పోలవరానికి ‘చంద్ర’శాపం

Published Sun, Jun 30 2024 5:37 AM | Last Updated on Sun, Jun 30 2024 12:01 PM

Chandrababu Naidu is Releasing lies White Paper on Polavaram Project

తన తప్పిదాలను జగన్‌పై నెట్టేందుకు శ్వేతపత్రంలో చంద్రబాబు అబద్ధాలు

వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ప్రణాళికాబద్ధంగా పనులు

కరోనా కాలంలోనూ 48 గేట్లతో సహా రికార్డు సమయంలో స్పిల్‌ వే పూర్తి

అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ ఛానల్, పైలట్‌ ఛానల్‌ను పూర్తి చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

2021 జూన్‌ 11న 6.1 కి.మీ.ల పొడవున నదీ ప్రవాహం మళ్లింపు

బాబు తప్పిదం వల్ల కోతకు గురైన దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు పూర్తి 

ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలు పూడ్చివేత

డయాఫ్రమ్‌ వాల్‌ భవితవ్యాన్ని తేల్చి డిజైన్లను ఖరారు చేస్తే 18 నెలల్లో డ్యామ్‌ పూర్తి చేస్తామని స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2014–19 మధ్య టీడీపీ సర్కార్‌ అధికారంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాల వల్లే పోలవరంలో పెను విధ్వంసం చోటు చేసుకుంది. ఆ తప్పిదాలే పోలవరానికి శాపంగా మారాయి. ప్రాజెక్టు పనుల్లో తీవ్ర జాప్యానికి.. రూ.వేల కోట్ల నష్టానికి దారి­తీశాయి. కమీషన్లకు ఆశ పడి తాను చేసిన తప్పి­దాల వల్ల ప్రాజెక్టులో జరిగిన విధ్వంసం.. ఫలితంగా పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై నెడుతూ నిస్సిగ్గుగా సీఎం చంద్ర­బాబు పదే పదే అబద్ధాలు వల్లిస్తున్నారు.

ఈనెల 17న పోలవరం పర్యటనలోనూ.. శుక్రవారం శ్వేత­పత్రం విడుదల చేస్తున్నప్పుడూ వైఎస్‌ జగన్‌పై వ్యక్తి­గత దూషణలు చేస్తూ.. నిరాధారమైన అసత్య ఆరోప­ణ­లు చేస్తూ.. పచ్చి అబద్ధాలతో కట్టుకథలు అల్లుతూ చంద్రబాబు చిందులు తొక్కారు. రాజకీ­యాల్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తులకు అధికా­రం ఇస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆక్రోశం వెళ్ల­గక్కారు. చివరకు పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తామనేది చెప్పలేక చేతులెత్తేశారు. సీఎం చంద్రబాబు చెప్పినట్టుగా రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వారు ఎవరు.. అర్హత ఉన్న వారు ఎవరో చూద్దాం..

నిర్మాణ బాధ్యతల కోసం 30 నెలలు వృథా 
రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును వంద శాతం వ్యయంతో తామే పూర్తి చేస్తామని ఏపీ పునర్విభజన చట్టం–2014 ద్వారా కేంద్రం హామీ ఇచ్చింది. కమీషన్లకు ఆశపడిన నాటి సీఎం చంద్రబాబు.. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకుని చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారు. ద్రవ్యో­ల్బణం వల్ల ధరలు పెరిగి అంచనా వ్యయం పెరుగుతుందని తెలిసినా, 2013–14 ధరలతోనే పోలవరాన్ని పూర్తి చేస్తానని 2016 సెప్టెంబరు 7న కేంద్రంతో ఒప్పందం చేసు­కు­న్నారు. ఇది పోలవ­రానికి నిధుల సమస్యకు ప్రధాన కారణమై­ంది. ఆ మరుసటి రోజే.. జలా­శయం పనుల అంచనా వ్యయాన్ని 2015–16 ధరల ప్రకారం పెంచి రూ.1,481.41 కోట్ల మేర కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చారు. 2014 జూన్‌ 8 నుంచి 2016 డిసెంబర్‌ 30 వరకు ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టకుండా 30 నెలలు వృథా చేశారు.

ప్రణాళికాయుతంగా వడివడిగా పనులు 
ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌–3లో 162 మీటర్ల పొడవున కాంక్రీట్‌ డ్యామ్‌ నిర్మాణాన్ని వైఎస్‌ జగన్‌ పూర్తి చేశారు. గ్యాప్‌–1లో 543 మీటర్ల పొడవున పునాది డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించారు. కుడి కాలువతోపాటు ఎడమ కాలువలో అత్యంత సంక్లిష్టమైన వరహ నదిపై అతి పొడవైన అక్విడెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి దాదా­పుగా కొలిక్కి తెచ్చారు. జలాశయంతో కుడి, ఎడమ కాలువలను అనుసంధానం చేసే కనెక్టివిటీస్‌(హెడ్‌ రెగ్యులేటర్, సొరంగాలు)ను పూర్తి చేశారు.

చంద్ర­బాబు చారిత్రక తప్పిదం వల్ల ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన భారీ అగాధాలను సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఇసుకతో నింపి, వైబ్రో కాంపాక్షన్‌ చేస్తూ యథా­స్థితికి తెచ్చారు. గ్యాప్‌–2లో దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌కు సమాంతరంగా కొత్తది నిర్మించాలా? లేదంటే దెబ్బతిన్న చోట్ల ‘యూ’ ఆకారంలో డయా­ఫ్రమ్‌ వాల్‌ నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేయాలా? అన్నది తేల్చి.. డిజైన్లను ఖరారు చేస్తే 18 నెలల్లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ 2022 డిసెంబర్‌ నుంచి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కేంద్ర జల్‌ శక్తి శాఖ, సీడబ్ల్యూసీ, పీపీఏ­లను కోరుతూ వచ్చింది.

అంతర్జాతీయ నిపుణుల సహకారం తీసుకుని డిజైన్లను ఖరారు చేద్దామని సీడబ్ల్యూసీ ఛైర్మన్‌ కుశ్వీందర్‌సింగ్‌ వోరా ప్రతిపాదించారు. ఆ మేరకు కాంట్రాక్టు సంస్థ స్వీడన్‌కు చెందిన యాఫ్రిని అంత­ర్జాతీయ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. ఫిబ్రవరిలో యూఎస్‌ఏకు చెందిన ఇద్దరు, కెనడాకు చెందిన మరో ఇద్దరు నిపుణు­లను పీపీఏ ఎంపిక చేసింది. యాఫ్రి, అంతర్జాతీయ నిపు­ణులు ఏకాభిప్రా­యం వ్యక్తం చేసిన డిజైన్లతో సవాళ్లను అధిగమిస్తూ.. పనులు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడక­పోయి ఉంటే.. 2022 నాటికే వైఎస్‌ జగన్‌ పోలవరాన్ని పూర్తి చేసి ఉండేవారని సాగు నీటి రంగ నిపుణులు చెబుతున్నారు.

కరోనా వేళ రికార్డు సమయంలో స్పిల్‌ వే పూర్తి 
వైఎస్‌ జగన్‌ సీఎంగా 2019 మే 30న బాధ్యతలు స్వీకరించారు. 2019 జూన్‌ రెండో వారంలోనే గోదావరి వరద ప్రారంభమైంది. నవంబర్‌కు తగ్గుముఖం పట్టింది. ఆ వెంటనే ప్రోటోకాల్‌ ప్రకారం.. నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌ వే నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2020 మార్చిలో కరోనా మహమ్మారి విజృంభించి.. 2021 ఆఖరు వరకు అతలాకుతలం చేసింది. అయినప్పటికీ స్పిల్‌ వే నిర్మాణాన్ని పరుగులెత్తించారు.

స్పిల్‌ వే ఫియర్స్‌ను 53.32 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసి.. వాటికి 25.72 మీటర్ల నుంచి 45.72 మీటర్ల మధ్య 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో ప్రపంచంలోనే అతి పెద్ద గేట్లను బిగించారు. వరద వచ్చినప్పుడు దిగువకు విడుదల చేయడానికి వీలుగా గేట్లను ఎత్తడానికి, దించడానికి జర్మనీ, జపాన్‌ల నుంచి హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ సిలిండర్లను దిగుమతి చేసుకుని వాటికి అమర్చారు. స్పిల్‌ వేపై రాకపోకలకు వీలుగా 1,118 మీటర్ల పొడవున స్పిల్‌ వే బ్రిడ్జిని పూర్తి చేశారు.

నదీ ప్రవాహాన్ని స్పిల్‌ వే వైపునకు మళ్లించేందుకు వెయ్యి మీటర్ల వెడల్పు.. 2,100 మీటర్ల పొడవుతో అప్రోచ్‌ ఛానల్‌ తవ్వారు. స్పిల్‌ వే నుంచి దిగువకు వదలిన వరద ప్రవాహాన్ని తిరిగి నదిలోకి కలపడం కోసం 2,920 మీటర్ల పొడవున స్పిల్‌ ఛానల్, వెయ్యి మీటర్ల పొడవున పైలట్‌ ఛానల్‌లను పూర్తి చేశారు. ఆలోగా ఎగువ కాఫర్‌ డ్యామ్, దిగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేశారు. దాంతో 2021 జూన్‌ 11న గోదావరి వరద ప్రవాహాన్ని అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, పైలట్‌ ఛానల్‌ మీదుగా 6.1 కి.మీల పొడవున గోదావరి ప్రవాహాన్ని మళ్లించి రికార్డు సృష్టించారు.

కాఫర్‌ డ్యామ్‌ల లీకేజీల పాపం బాబు సర్కార్‌దే 
ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల పనులను చేపట్టడానికి వీలుగా లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి జెట్‌ గ్రౌటింగ్‌ చేయాలి. అయితే నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం గోదావరి నదిలో ఇసుక ఫర్మియబులిటీ విలువను 2018లో అప్పటి కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ తప్పుగా మదింపు చేసింది. దాన్నే పరిగణనలోకి తీసుకుని 30 నుంచి 35 మీటర్ల లోతు వరకూ స్టోన్‌ కాలమ్స్‌ వేసి జెట్‌ గ్రౌటింగ్‌ చేయకుండా కేవలం 20 మీటర్ల లోతు వరకూ జెట్‌ గ్రౌటింగ్‌ చేసేలా డిజైన్‌లు రూపొందించింది.

నవయుగ సంస్థ ఆ మేరకే జెట్‌ గ్రౌటింగ్‌ చేసి కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టింది. జెట్‌ గ్రౌటింగ్‌ నిబంధనల మేరకు చేసి ఉంటే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లలో లీకేజీ సమస్య ఉత్పన్నమయ్యేది కాదని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తన హయాంలో జరిగిన ఈ తప్పిదాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై నెట్టేందుకు సీఎం చంద్రబాబు యత్నించడం గమనార్హం.

చారిత్రక తప్పిదంతో విధ్వంసం
ఏదైనా నదిపై ఒక ప్రాజెక్టును కట్టాలంటే.. తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌ వేను పూర్తి చేయాలి. ఆ తర్వాత ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతానికి ఎగువన, దిగువన నదికి అడ్డంగా కాఫర్‌ డ్యామ్‌లు నిర్మించాలి. దీని వల్ల నదీ ప్రవాహం స్పిల్‌ వే మీదుగా మళ్లుతుంది. అప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రధాన డ్యామ్‌ పనులు చేపట్టి, పూర్తి చేయవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనైనా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇదే ప్రోటోకాల్‌ పాటిస్తారు. 

 కానీ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మాత్రం నాటి సీఎం చంద్రబాబు ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కారు. నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌ వేను పూర్తి చేయకుండా పునాది స్థాయిలోనే వదిలేశారు. ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ గ్యాప్‌–2లో నది గర్భంలో 1,396 మీటర్ల పొడవున పునాది డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణాన్ని 2018 జూన్‌ 11 నాటికే పూర్తి చేశారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణానికి ప్రాంతానికి ఎగువన, దిగువన నదికి అడ్డంగా కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణాన్ని 2018 నవంబర్‌లో ప్రారంభించి పూర్తి చేయలేక 2019 ఫిబ్రవరిలో చేతులెత్తేశారు. 

 స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పూర్తి చేయకపోవడం వల్ల నదీ ప్రవాహాన్ని మళ్లించడం సాధ్యం కాదు. అప్పుడు కాఫర్‌ డ్యామ్‌ల మీదుగా వరద ప్రవాహిస్తే కొట్టుకుపోతాయనే నెపంతో.. కాఫర్‌ డ్యామ్‌లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద గోదావరి నది వెడల్పు 2,400 మీటర్లు. 2019, 2020లలో గోదావరికి వచ్చిన భారీ వరద 2,400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిందిపోయి..

ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఖాళీగా వదిలిన 800 మీటర్లకు కుంచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో వరద ఉద్ధృతి మరింత అధికమవడం వల్ల ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటుచేసుకుంది. గరిష్టంగా 36.5 మీటర్లు.. కనిష్టంగా 26 మీటర్ల లోతుతో నాలుగు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి. గ్యాప్‌–2లో 1396 మీటర్ల పొడవుతో నిర్మించిన డయాఫ్రమ్‌ వాల్‌ నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. ఇదే పనుల్లో జాప్యానికి, రూ.వేల కోట్ల నష్టానికి కారణమైంది. ఐఐటీ (హైదరాబాద్‌), ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌) నిపుణులు ఇదే విషయాన్ని తేల్చి చెబుతూ నివేదిక ఇచ్చాయి.

రూ.12,157.53 కోట్లకు మోకాలడ్డు
పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేస్తానని 2016 సెప్టెంబరు 7న చంద్రబాబు కేంద్రానికి హామీ ఇచ్చారు. ఆ మేరకు ఒప్పందం చేసుకున్నారు. 2013–14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లే. ఇందులో 2014 ఏప్రిల్‌ 1 వరకూ చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లుపోనూ మిగతా రూ.15,667.9 కోట్లే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

అయితే  2017–18 ధరల ప్రకారం పునరావాసం, భూసేకరణ వ్యయమే రూ.33,168.23 కోట్లు. అందువల్ల రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని, తాజా ధరల మేరకు నిధులిచ్చి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని 2019 మే 30 నుంచి పలుదఫాలు ప్రధాని మోదీని అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ కోరుతూ వచ్చారు. దానికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రధాని ఆదేశాల మేరకు తొలి దశ పూర్తికి రూ.12,157.53 కోట్లు అవసరమని కేంద్ర జల్‌ శక్తి శాఖ తేల్చింది. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన పంపింది.

అప్పటికే బీజేపీతో పొత్తు కుదరడంతో పోలవరానికి నిధుల విడుదల ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌ ముందు పెట్టవద్దని, తమకు రాజకీయంగా ఇబ్బందులు వస్తాయంటూ చంద్రబాబు అడ్డుపుల్ల వేశారు. ప్రస్తుతం ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్నందున, ఆ ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్‌తో ఆమోద ముద్ర వేయిస్తే నిధుల సమస్య తీరుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సాంకేతిక సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం సీడబ్ల్యూసీ ద్వారా ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఆ ప్రణాళికను అమలు చేయడం ద్వారా ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని సాగు నీటి రంగ నిపుణులు సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement