పటమట (విజయవాడ తూర్పు)/మచిలీపట్నం టౌన్: కేసులకు భయపడితే సీఎం వైఎస్ జగన్‌పై పోరాడలేమని, కేసులతో ఏం పీకుతారని టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నూరిపోశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఆయన వివిధ ప్రాంతాల్లో మాట్లాడారు. అన్నిచోట్లా వైఎస్సార్ సీపీని దుర్భాషలాడటం, సీఎం వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శించటం పరుష పదజాలంతోనే సాగింది. 10 రూపాయలు ఇస్తూ.. 100 రూపాయలు లాక్కుంటున్న జగన్, వైసీపీ నేతల దుర్మార్గాలు, దోపిడీ, కబ్జాలు చూశాక కూడా వైఎస్సార్‌సీపీ జెండా పట్టుకుంటారా అంటూ దూషించారు.
బిడ్డల భవిష్యత్ బాగుండాలంటే, జీవితాలు సంతోషంగా ఉండాలంటే తక్షణమే వైఎస్సార్‌సీపీ జెండాను కృష్ణా నదిలో పడేసి, టీడీపీ జెండా పట్టుకోండన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడిచేసి.. విజయవాడలో గూండాయిజం, రౌడీయిజం చేస్తున్న వారి తోకలు కత్తిరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్య ఇంటింటికీ జగన్ స్టిక్కర్లు అతికిస్తున్నారని, ఇళ్ల గోడలపై రాయాలన్నా, ఎలాంటి కరపత్రాలు, బొమ్మలు అతికించాలన్నా ఇంటి యజమానుల అనుమతి తప్పనిసరి అన్నారు. ఎలాంటి అనుమతి తీసుకుని వలంటీర్లు జగన్ స్టిక్కర్లు ప్రజల ఇళ్ల గోడలపై అతికిస్తున్నారని ప్రశ్నించారు.
పీక్కుంటూనే ఉండండి
‘ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఏం పీక్కుంటారు. నాపైన కూడా చాలా కేసులు పెట్టారు. ఇంకా పెడుతున్నారు. ఎన్ని కేసులు పెడితే పెట్టుకోమంటున్నా.. పీక్కుంటూనే ఉండమంటున్నా. నాకు సభ్యత ఉంది కాబట్టే హద్దులు మీరి వ్యక్తిగతంగా పోవడం లేదు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
విజయవాడలో ఫ్యాక్షన్ రాజకీయాలు సాగనివ్వమని, రమేశ్ యాదవ్ టీడీపీలో చేరడం ద్వారా ఒక స్ఫూర్తి ఇచ్చాడని అన్నారు. వైఎస్సార్‌సీపీ వల్ల రాష్ట్రానికి నష్టమని, సమాజానికి చేటని ముందే పసిగట్టి తెలుగుదేశం జెండా కప్పుకున్నాడన్నారు. ఎమ్యెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే, వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టామని నోటి కొచ్చినట్టు మాట్లాడారని చంద్రబాబు విమర్శించారు.
జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలొద్దు
మచిలీపట్నంలో రోడ్ షోకు వస్తున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలతో నగరంలోని పలు ప్రాంతాలకు నుంచి అభిమానులు తరలివచ్చారు. రాత్రి 7.30 గంటల సమయంలో మూడు స్తంబాల సెంటర్ వద్ద డీజే పాటలకు జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలతో అభిమానులు రాగా, అక్కడే ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర జూనియర్ ఎన్టీఆర్ చిత్రపటాలను ప్రదర్శించవద్దని అడ్డుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ చిత్రపటాలను ప్రదర్శిస్తే తప్పేంటని యువకులు ప్రశ్నించినా.. లెక్క చేయకుండా లాక్కుని పక్కన పడేశారు. కొల్లు రవీంద్ర ఆదేశాలతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరినీ పార్టీ కార్యకర్తలు పక్కకు తోసుకువెళ్లారు. తమ అభిమాన నటుడు చిత్రపటాన్ని లాక్కోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment