ఏడుసార్లు అందలం ఎక్కించిన కుప్పం ప్రజలు ఈసారి ఓడించి హైదరాబాద్‌కే పరిమితం చేస్తారని చంద్రబాబు భయపడుతున్నారా? ఓటమి భయంతోనే కుప్పంతో పాటు మరో నియోజకవర్గం కూడా చంద్రబాబు వెతుక్కుంటున్నారా? 35 ఏళ్ళపాటు ఏకధాటిగా ఎన్నుకున్నా పట్టించుకోనందుకు కుప్పం ప్రజలు చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెప్పబోతున్నారా? కుప్పంలో వైఎస్‌ఆర్‌సీపీ జెండా ఎగురుతుందన్న భయంతోనే బలమైన సీటు కోసం వేట ప్రారంభించారా? అసలు కుప్పంలో ఏం జరుగుతోంది?
1983 ఎన్నికల్లో తన సొంత నియోజక వర్గం చంద్రగిరిలో ఘోర పరాజయం పొందిన చంద్రబాబు నాయుడు.. 1989 ఎన్నికల నాటికి కుప్పం ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఇపుడు ఎమ్మెల్యేలను కూడా బదిలీ చేస్తారా అంటూ కామెడీ చేస్తోన్న చంద్రబాబు మూడున్నర దశాబ్ధాల క్రితమే చంద్రగిరి నుంచి కుప్పం నియోజక వర్గానికి బదలీ అయిన నాయకుడిగా చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలోనే అత్యంత వెనకబడిన నియోజక వర్గంగా కుప్పాన్ని మూడున్నర దశాబ్ధాల పాటు చంద్రబాబు తన స్వప్రయోజనాలకే వాడుకున్నారు. 35ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చంద్రబాబు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అయినా కుప్పం నియోజక వర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. అందుకే కుప్పం ప్రజలు ఉపాధిలేక ఉస్సూరు మంటూ ఉండేవారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం లో సంక్షేమ పథకాల అమలుతో దాని ముఖచిత్రం మారింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేతుల్లోనే అధికారం ఉన్నప్పుడు ఆయన కుప్పానికి ఏమీ చేయలేదు. కుప్పాన్ని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయలేదు. రెవిన్యూ డివిజన్‌గా చేసుకోలేకపోయారు. హంద్రీ నీవా నీళ్లు కుప్పం వరకు తేలేకపోయారు.
2019లో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కుప్పం నియోజక వర్గం తలరాత మారిందని చెప్పాలి. ముందుగా మున్సిపాలిటీని చేశారు. ఆ వెంటనే రెవిన్యూ డివిజన్ గా ప్రకటించారు. కుప్పం కాలువలకు హంద్రీ నీవా ద్వారా నీటిని అందించే బృహత్ పథకం కూడా సాకారం చేశారు జగన్‌మోహన్‌రెడ్డి. ఫలితంగా నియోజక వర్గంలోని 44 కాలువలు జలకళతో మెరవనున్నాయి. ఇక నవరత్న పథకాలతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ అందిస్తున్నారు జగన్‌మోహన్‌రెడ్డి. ఈ మార్పు కారణంగానే కుప్పం ప్రజలు వైఎస్సార్‌సీపీవైపు మొగ్గు చూపారు. పంచాయతీ, మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీని పక్కన పెట్టి వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులను గెలిపించారు కుప్పం ప్రజలు.
ఈ వరుస ఓటముల కారణంగానే చంద్రబాబు వెన్నులో చలి మొదలైంది. అంత వరకు కుప్పానికి చుట్టపు చూపుగా కూడా రాని చంద్రబాబు ఏడాదిలో మూడు సార్లు కుప్పం వచ్చి రెండు మూడు రోజులు గడిపి వెళ్తున్నారు. ఇంత వరకు కుప్పంలో ఇల్లుకూడా కట్టుకోని చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో పరాజయాల తర్వాతనే నియోజక వర్గంలో ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. కేవలం ఎన్నికల్లో ఓట్లకోసమే చంద్రబాబు ఇలా డ్రామాలు చేస్తున్నారని నియోజక వర్గ ప్రజలు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ నియోజక వర్గంలోనూ వైఎస్సార్‌సీపీజెండా ఎగరేస్తామని పాలక పక్షం ధీమా వ్యక్తం చేస్తోంది. కుప్పాన్ని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వై నాట్ 175 అన్ని నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులు కుప్పం నియోజక వర్గంలో ఎన్ని అక్రమాలు జరిగినా దొంగ ఓట్ల వ్యవహారాలు ఉన్నా పట్టించుకోలేదు. కానీ జగన్‌మోహన్‌రెడ్డి అన్నీ పకడ్బందీగా చూస్తూ ఉండడంతో చంద్రబాబుకు కస్టాలు తప్పేలా లేవంటున్నారు మేథావులు.
కుప్పం ప్రజలపై కానీ.. కుప్పంలోని టిడిపి నాయకులపై కానీ చంద్రబాబుకు నమ్మకం లేనట్లుంది. అందుకే నియోజక వర్గ ఇన్ ఛార్జ్ గా ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తిని నియమించుకున్నారు. దీనిపైనా టిడిపి శ్రేణుల్లోనూ ప్రజల్లోనూ వ్యతిరేకత పెల్లుబుకుతోంది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఓడినా ఓడిపోవచ్చని గ్రహించిన చంద్రబాబు ఎన్టీయార్ కృష్ణా జిల్లాలో ఏదైనా బలమైన నియోజక వర్గం నుంచి కూడా పోటీచేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి చంద్రబాబులో భయం అయితే తీవ్ర స్థాయిలో ఉందన్నది భయంకర వాస్తవం.
Comments
Please login to add a commentAdd a comment