నిజాంపేట్ (హైదరాబాద్): తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. కాంగ్రెస్ దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిందని, రాజ్యాంగాన్ని రూపొందించి బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసిందని ఖర్గే చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు ఓటేస్తే గులాంగిరి చేయాల్సి వస్తుందని.. అదే కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రజల జీవితాలు మారుతాయని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ శివార్లలోని బాచుపల్లిలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఖర్గే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఇతర నేతలు ప్రసంగించారు.
కాంగ్రెస్‌ను ఎవరూ అడ్డుకోలేరు
బీఆర్‌ఎస్ సర్కార్‌కు బీజేపీ మద్దతు తెలుపుతోందని, ఇరు పారీ్టలు కలసి కాంగ్రెస్‌ను ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఖర్గే ఆరోపించారు. ఇలాంటి వాటికి కాంగ్రెస్ భయపడేదేలేదని, ఏ శక్తీ తమను అడ్డుకోలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారాన్ని అనుభవిస్తున్న వారు తామే రాష్ట్రాన్ని సాధించామని చెప్పుకొంటున్నారని, ఏ ఒక్క కుటుంబంతో రాష్ట్ర సాధన సాధ్యపడలేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ కాంగ్రెస్ నాయకుల ను బెదిరించేందుకు ఈడీ, ఐటీ దాడులను చేయిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతి మోదీ కి కనిపించదని, కాంగ్రెస్ నేతలే కనిపిస్తారని విమర్శించారు.
కాంగ్రెస్‌తోనే రాష్ట్రంలో వెలుగులు: రేవంత్
రాష్ట్రానికి కాంగ్రెస్ ఏం చేసిందని కొందరు సన్నాసులు ప్రశ్నిస్తున్నారని, కాంగ్రెస్ చేసినవన్నీ కళ్లముందే ఉన్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలోని శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ డ్యామ్‌లు, దేవాదుల పథకాన్ని కాంగ్రెస్ పారీ్టయే కట్టింది. 75 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచి్చంది. హెచ్‌ఎంటీ, ఐడీఎల్, బీడీఎల్ వంటి ఫ్యాక్టరీలు, జీడిమెట్ల పారిశ్రామికవాడ వంటివి స్థాపించింది.
రాష్ట్రంలో వెలుగులు జిలుగులు ఉన్నాయంటే కాంగ్రెస్ చేసిన పనులే కారణం. సీఎం కేసీఆర్ చింతమడకలో చదువుకున్న బడిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిందే..’’అని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనపై పెద్ద కుట్ర చేసి కొడంగల్‌లో ఓడించారని, కానీ కొన్నిరోజుల్లోనే దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్‌గిరిలో ప్రజలు తనను గెలిపించారని రేవంత్ చెప్పారు. కుత్బుల్లాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కొలన్ హన్మంతరెడ్డిని గెలిపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment