పాట్నా: జాబ్ ఫర్ ల్యాండ్ స్కాంకు సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబసభ్యుల ఇళ్లపై ఈడీ దాడులు చేసిన ముడు రోజలు తర్వాత తేజస్వీ యాదవ్ స్పందించారు. ఈ సోదాల్లో రూ.కోట్ల నగదు, బంగారు ఆభరణాలు సీజ్ చేసినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఈ స్కాం ద్వారా పొందిన రూ.600 కోట్లు విలువ చేసే ఆస్తులను గుర్తించినట్లు ఈడీ చేసిన ప్రకటన పచ్చి అబద్దమన్నారు.
ఈడీ అధికారులు తన ఢిల్లీ నివాసంలో అరగంటలోనే సోదాలు పూర్తి చేశారని తేజస్వీ చెప్పారు. ఈ సమయంలో తన సోదరీమణులు ధరించి ఉన్న నగలను తీసి పక్కకు పెట్టమని చెప్పారని, వాటినే ఫోటోలు తీసి సీజ్ చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
2017లో కూడా తమ పార్టీ రూ.8,000కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడిందని చెప్పి దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయని, వాటి సంగతేంటని ప్రశ్నించారు. ముందు వాటికి సంబంధించిన వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీలా తమది ఫేక్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ కాదని తేజస్వీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమిత్ షా క్రోనాలజీ వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇచ్చారు. తమది నిజమైన సోషలిస్టు కుటుంబం అని పేర్కొన్నారు.
బిహార్‌లో బీజేపీని అధికారానికి దూరం చేసినందుకే తమపై దాడులు జరుగుతున్నాయని ప్రజలందరికీ తెలుసునని తేజస్వీ అన్నారు. కమలం పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈడీ సోదాల్లో ఏం సీజ్ చేశారో అధికారికంగా ప్రకటన విడదల చేయాలని, లేదంటే తానే నిజాన్ని వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు.
ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలు దాడులు చేయాలని బహుశా అమిత్‌షానే డైరెక్షన్ ఇచ్చి ఉంటారని తేజస్వీ ఆరోపించారు. ప్రతిసారి ఇలానే చేస్తే వర్కవుట్ కాదని.. వాళ్లు స్క్రిప్ట్ రైటర్లు, డైలాగ్ రైటర్లను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఎద్దేవా చేశారు.
చదవండి: ప్రియాంక గాంధీ పెయింటింగ్‌కు రూ.2 కోట్లా?
Comments
Please login to add a commentAdd a comment