క్లీన్‌స్వీపే లక్ష్యం  | CM Jagan steps towards achieving clean sweep | Sakshi
Sakshi News home page

క్లీన్‌స్వీపే లక్ష్యం 

Published Sun, Jan 14 2024 4:12 AM | Last Updated on Sun, Feb 4 2024 3:05 PM

CM Jagan steps towards achieving clean sweep - Sakshi

సాక్షి, అమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 175కు 175 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్‌ర్సీపీ విజయమే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారు. జనబలమే గీటురాయిగా.. సామాజిక న్యాయం చేకూర్చడంలో మరో అడుగు ముందుకేస్తూ అవసరమైన అసెంబ్లీ,  లోక్‌సభ స్థానాల్లో సమ­న్వయకర్తలను మారుస్తున్నారు.

ఇప్పటికే 50 శాసనసభ, 9 లోక్‌సభ స్థానాలకు కొత్తగా సమన్వయకర్తలను నియమించారు. మెరుగైన ఫలితాలు సాధించడానికి అవసరమైన చోట్ల సమన్వయకర్తలను మార్చడంపై కసరత్తు కొనసాగిస్తూనే.. క్లీన్‌స్వీపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు సమాయత్తమయ్యారు. ఇందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో కార్యకర్తలతో సమా­వేశమై.. 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడానికి చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ క్రమంలో తొలుత ఉత్తరాంధ్ర ప్రాంత కార్యకర్తలతో విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఈనెల 25న సమావేశం నిర్వహించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఇలా ఐదుచోట్ల కార్యకర్తల సమావేశాలు పూర్తయిన వెంటనే ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు.  
సంక్షేమాభివృద్ధి, సంస్కరణలతో విప్లవాత్మక మార్పు.. 

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం సీఎం జగన్‌ అమలుచేశారు. ఇప్పటికి 99.5% హామీలు అమలుచేశారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక.. ఇలా అన్ని రంగాల్లో సంస్కరణలతో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాలు.. పునర్విభజన ద్వారా కొత్త జిల్లాల ఏర్పాటుతో సహా వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలన అందిస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలో ఇప్పటికే రూ.2.46 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమచేశారు. నాన్‌ డీబీటీ రూపంలో రూ.1.67 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు.

డీబీటీ, నాన్‌ డీబీటీ వెరసి రూ.4.13 లక్షల కోట్ల లబ్ది చేకూర్చారు. ఇందులో 75% నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే చేరాయి. సంక్షేమాభివృద్ధి, సుపరిపాలనతో వచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి నియోజకవర్గంలో కళ్లకు కట్టి­నట్లు కన్పిస్తున్నాయి. ఆ మార్పును గుర్తుచేసి.. మరింత మేలుచేయడానికి ఆశీర్వదించాలని కోరు­తూ 2022, మే 11న గడప గడపకూ మన ప్రభు­త్వం కార్యక్రమానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. ఇంటింటా ఈ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 

వైఎస్సార్‌సీపీకి ప్రజాదరణ పైపైకి.. 
ఇక ప్రతి ఇంట్లో.. ప్రతి గ్రామంలో.. ప్రతి నియోజకవర్గంలో మార్పు కళ్లెదుటే కన్పిస్తున్నప్పుడు 175కు 175 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం సుసాధ్యమేనని గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్‌షాప్‌లలో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ప్రతి ఇంటికీ చేసిన మంచిని వివరించడానికి చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో 80% ప్రజలు ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అంటూ నినదించి, ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఇది జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ప్రస్ఫుటితమైంది.

ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 25కు 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం తథ్యమని టైమ్స్‌ నౌ వంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే గడాది అక్టోబరు 10న విజయవాడలో పార్టీ ప్రతినిధుల సదస్సు నిర్వహించి 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎం జగన్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement