
సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ జె. శాంత మంగళవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఆమె వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారు. ఆమె 2009లో లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. పార్టీలో చేరిన అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద జె.శాంత మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలకు ఆయనపై అపారమైన నమ్మకం ఏర్పడిందని, అందుకే వైఎస్సార్‌సీపీలో చేరానని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పార్టీలో చేరానని, పార్టీలో సామాన్య కార్యకర్తలా పనిచేస్తానని తెలిపారు.
పార్టీ కార్యకర్తలు, ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరుతున్నానని చెప్పారు. వాల్మికి సామాజికవర్గం నుంచి వచ్చిన తనకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తారని భావిస్తున్నానని, ఆయన నిర్ణయమే శిరోధార్యమని అన్నారు. అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, హిందూపురం ఎంపీగా పోటీ చేసే విషయంపై పార్టీ అధిష్టానం ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని చెప్పారు. సీఎం జగన్ రాష్ట్రంలో పేదల సంక్షేమం, అభివృద్ధి రెండుకళ్లుగా డీబీటీ ద్వారా నేరుగా పేదల ఖాతాల్లో జమ చేసిన రూ.2.42 లక్షల కోట్లలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందించారన్నారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పారదర్శకంగా జరుగుతుండటం తాను గమనించానని చెప్పారు.
17 వేలకు పైగా జగనన్న కాలనీలు ప్రత్యేక ఊళ్లుగా శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. దేశంలో మరెక్కడా ఈ విధంగా జరగటంలేదన్నారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా సీఎం జగన్ మార్క్ కనిపిస్తోందని, గాం«దీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం రాష్ట్రంలో సాకారమవుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లి ప్రజలను కదిలించినా జయహో జగనన్న అంటున్నారని చెప్పారు. మీడియా సమావేశంలో నియోజకవర్గ నేతలు గుంతకల్లు రమేష్ రెడ్డి, పవన్‌కుమార్ పాల్గొన్నారు.