సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల అనంతరం సీఎం కేసీఆర్.. బీజేపీపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశంలో బీజేపీ ఎనిమిది ప్రభుత్వాలను కూలదోసింది. ఇంకా నాలుగు ప్రభుత్వాలను కూలిదోసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రలోభాలను పెట్టినవారు దేశంలో అత్యున్నత స్థాయి వ్యక్తులు. మా ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టింది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలిసి ప్రలోభపెట్టారు. ఎమ్మెల్యే మా దృష్టికి తెచ్చి, హోంమంత్రికి ఫిర్యాదు చేశారు.
నేను చూపించే వీడియోలు చూస్తే జనం నివ్వెరపోతారు. ప్రలోభపెట్టిన ముఠాను మా ఎమ్మెల్యేలు పట్టించారు. ఒకే వ్యక్తికి రెండు, మూడు ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్‌లు ఉంటాయి. తుషార్ అనే వ్యక్తి బీజేపీ టిక్కెట్ మీద పోటీ చేశారు. ఫేక్ ఐడీ కార్డులు ఎలా వచ్చాయి?.మేము ఏమైనా చేస్తాం.. మమ్మల్ని ఎవరేం చేస్తారని చెబుతున్నారు. నా దగ్గర ఉన్నవి ఆషామాషీ ఆధారాలు కావు. ఈవీఎంలు ఉన్నంత కాలం బీజేపీకి ఢోకా లేదని చెబుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ కుట్రలు పన్నుతున్నారు. ప్రజాస్వామాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ.
ప్రభుత్వాలను ఎలా కూలగొట్టామని వారి మాటల్లోనే చెప్పారు. మాకు దేశంలో ఎదురేలేదన్న ధీమా వారిది. ఇలాంటి అప్రజాస్వామిక పనులను అడ్డుకోవాలి. రూ. 100 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంనగా ఉన్నామని చెప్పారు. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామన్నారు. మీకు వై కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తామని చెబుతున్నారు. కొనుగోలు కోసం 24 మంది ఉన్నామని వాళ్లే చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉంటే దేశంలో ఎన్నికలు ఎందుకు?. ఈ డబ్బులన్నీ వీరికి ఎవరు సమకూరుస్తున్నారు అని ప్రశ్నించారు.
ఈ ముఠాను ఆపరేట్ చేసేది బీఎల్ సంతోష్, జేపీ నడ్డా, అమిత్ షా అని చెప్పారు. తెలంగాణ హైకోర్టుకు ఫాంహౌస్ ఫైల్స్ పంపించాము. ఈ ఎపిసోడ్‌లో అమిత్ షా పేరు చాలా సార్లు చెప్పారు. 2015 నుంచి వారి కాల్ డేటా మా చేతికొచ్చింది. వారి అరాచకాలన్నీ పబ్లిక్ డొమైన్‌లోకి చేరినట్టే. మాకు దొరికిన ప్రతీ ఆధారాన్ని కోర్టుకు సమర్పించాము. హైదరాబాద్ వచ్చి నా ప్రభుత్వాన్ని కూలుస్తామంటే ఊరుకోవాలా?. దీనికి బాధ్యులైన ప్రతీ ఒక్కరినీ అరెస్ట్ చేయాలి. న్యాయవ్యవస్థ దీనిని సింగిల్ కేసులా చూడొద్దు. ఈ పాలిటిక్స్ ఆపాలని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాను. మోదీజీ మీరు.. మీ పార్టీ చేస్తున్నది తప్పు. ప్రభుత్వాలను కూల్చి ఏం సాధించాలనుకుంటున్నారు. మోదీతో సఖ్యత లేకపోతే ఈడీ మీ దగ్గరకు వస్తుందని చెబుతున్నారు. మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి.
దేశం ఎప్పుడు ప్రమాదంలో పడ్డా న్యాయవ్యవస్థే ఆదుకుంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నాను. సుప్రీంకోర్టు సహా దేశంలోని న్యాయమూర్తుల్ని చేతులు జోడించి కోరుతున్నాను. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment