
సాక్షి, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్‌రావు తనకు చేతనయ్యే వాగ్దానాలే చేస్తారని, వాటిని తప్పకుండా ఆచరించి చూపుతారని రాష్ట్ర పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు లేనిపోని రాద్ధాంతం చేయడం కంటే తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. తమ ప్రభుత్వం 24గంటల కరెంటు ఇస్తోందని... చేతనైతే 25గంటలు ఇవ్వొచ్చని ప్రతిపక్ష పార్టీలపై వ్యంగ్యా్రస్తాలు సంధించారు.
అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఆదివారం శాసనమండలిలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ అద్భుత విజయాలు సాధించిందని, అందుకే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డుల్లో 30శాతం గెలుచుకోగలిగిందన్నారు.
అనంతరం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకునే బిల్లును రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, పురపాలక చట్టంలో సవరణ బిల్లును మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ సవరణ బిల్లును వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. అనంతరం సభ నిరవధికంగా వాయిదాపడింది.
నాలుగు రోజులు... 12 బిల్లులు
శాసనమండలి వానాకాలం సమావేశాలు నాలుగు రోజులపాటు జరిగాయి. మొత్తం 23గంటల 10 నిమిషాల పాటు సభ కొనసాగింది. 20 ప్రశ్నలు లేవనెత్తగా, 4 షార్ట్ డిస్కర్షన్స్ జరిగాయి. వివిధ అంశాలపై 55 ప్రసంగాలు కొనసాగాయి. ఇప్పటికే ఉన్న బిల్లుల్లో 4 సవరణలు, కొత్తగా 8 బిల్లులను... మొత్తంగా 12 బిల్లులను సభ ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment