సచ్చిన పామును మళ్లీ చంపుతారా? | CM Revanth Reddy comments in the Assembly | Sakshi
Sakshi News home page

సచ్చిన పామును మళ్లీ చంపుతారా?

Published Thu, Feb 15 2024 4:09 AM | Last Updated on Thu, Feb 15 2024 4:09 AM

CM Revanth Reddy comments in the Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  కాళేశ్వరం దోపిడీ బయటపడు తుందని, జైలుకు వెళ్లాల్సి వస్తుందనే కేసీఆర్‌ను చంపుతారా అంటూ మాట్లాడుతున్నారని, ఆయనను చంపాల్సిన అవసరం ఎవరికి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘ఇప్పటికే సచ్చిన పామును మళ్లీ ఎవరైనా చంపుతారా? మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఆ పామును చేతితో కాదు కట్టెతో కొట్టారు. ఆల్రెడీ చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం మాకేం ఉంది?’ అని వ్యాఖ్యానించారు.

సానుభూతి కోసం కేసీఆర్‌ వీల్‌చైర్, వీధినాటకాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంపై సభలో చ ర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్‌ సభకు వచ్చేలా ఆ పార్టీ ఎమ్మెల్యేలు చూడాలన్నారు. బుధవారం అసెంబ్లీలో మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు..బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల మధ్య బడ్జెట్‌పై వాదోపవాదాలు జరుగుతుండగా సీఎం జోక్యం చేసుకుని మాట్లాడారు. 

కేసీఆర్‌ను సభకు రమ్మనండి
‘సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో శ్వేతపత్రం ప్ర వేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్‌ పారిపోయి ఫామ్‌హౌస్‌లో పడుకుని, అక్కడెక్కడి కో పోయి ప్రగల్భాలు ఎందుకు? సభకు రమ్మనండి..వాస్తవాలపై చర్చిద్దాం..అన్ని అంశాలపై మాట్లా డదాం. అలా కాదు కాళేశ్వరంపైనే చర్చిద్దామంటే అందుకు కూడా స్పీకర్‌ విడిగా సమయం కేటాయి స్తే చర్చకు సిద్ధం.

మేడిగడ్డ మేడిపండు మాదిరిగా కుంగిపోతే, అక్కడ నీళ్లు నింపే అవకాశముందా? కేసీఆర్, హరీశ్‌రావు సాగునీటి శాఖ మంత్రులుగా పనిచేశారు కదా.. వారికే బాధ్యతలు అప్పగిస్తాం..వారే ఎలా మేడిగడ్డలో నీళ్లు నింపి అక్కడి నుంచి అన్నారం, సుందిళ్లలో పోస్తారో బాధ్యత తీసుకోవాలి..’ అని రేవంత్‌ అన్నారు. 

నేటి సాయంత్రం దాకా చర్చకు సిద్ధం
‘బీఆర్‌ఎస్‌ఎల్‌పీ నేత అసెంబ్లీకి వస్తే..గురువారం సాయంత్రం దాకా కాళేశ్వరం ప్రాజెక్టుపై, గోదావరి నదీజలాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులపై, తెలంగాణ ప్రజలపై గౌరవంతో ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నిస్తే.. అందరం కలిసి వెళ్లి  ప్రాజెక్టులను పరిశీలించి వద్దామని అనుకున్నాం. అలా వెళితే అక్కడ జరిగిన నష్టాన్ని, రైతులకు వచ్చిన కష్టాన్ని అర్థం చేసుకుని ఆ సమస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉంది.

కానీ ఈ పర్యటనకు బీఆర్‌ఎస్‌ రాకపోగా, మేడిగడ్డ విషయంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వమే ఏదో తప్పు చేసినట్టు, వైఫల్యాలకు తామే బాధ్యత వహించాలి అన్నట్టుగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతు న్నారు. పదే పదే భాష గురించి మాట్లాడుతున్నారు. మంగళవారం నల్లగొండలో కేసీఆర్‌ మాట్లాడిన భాషపై సభలో చర్చిద్దామా? సీఎం పదవిలో ఉన్న వ్యక్తిని పట్టుకుని ఏమి పీకడానికి మేడిగడ్డ వెళ్లారంటూ మాట్లాడతారా?

కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన, ఎమ్మె ల్యేగా, ఎంపీగా, పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి నాలు గు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ఓ సీఎంపై అలాంటి భాషను ఉపయోగిస్తారా? ఉద్యమకారు డిని అని గొప్పలు చెప్పుకునే వ్యక్తి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఏమి పీకడానికి వెళ్లారని నిలదీస్తారా? ఇదేనా తెలంగాణ సంప్రదాయం? గౌరవం? అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే కేసీఆర్‌ ప్యాంట్‌ను తెలంగాణ ప్రజలు ఊడ బెరికారు.

మళ్లీ వస్తానంటే ఉన్న అంగీ కూడా ఊడబెరుకుతారు. బొక్క బోర్లాపడి బొక్కలు విరిగినా ఇంకా బుద్ధి మారలేదు..’ అంటూ సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అందరినీ ఒకేవిధంగా చూడండి: కేటీఆర్‌
రెండురోజుల క్రితం రాజ్‌గోపాల్‌రెడ్డి మాట్లాడుతు న్నపుడు కడియం శ్రీహరి ఏవో వ్యాఖ్యలు చేశారని, వాటిపై రాజ్‌గోపాల్‌రెడ్డి బుధవారం స్పందించి ఉంటారని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు చెప్పారు. దీంతో కడియం శ్రీహరిపై రాజ్‌గోపాల్‌రెడ్డి ఏదైనా అన్‌పార్లమెంటరీ భాష ఉపయోగించి ఉంటే వాటిని పరిశీలించి రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్‌ తెలిపారు. అయితే తనపైనే కడియం అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజ్‌గోపాల్‌రెడ్డి అన్నారు.

స్పీకర్‌పై తమకు అపార గౌరముందని, తాము ఏదైనా తప్పు మాట్లాడితే దానిని సవరించే అధికారం వారికుందని కేటీఆర్‌ చెప్పారు. అయితే అధికారపక్ష సభ్యులు తమను వ్యక్తిగతంగా దూషించినా, నోటికొచ్చినట్టు మాట్లాడినా సభాపతి ఏమీ అనడం లేదని అన్నారు. సభ్యులందర్నీ ఒకేవిధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం సత్యదూరమైన మాటలు చెబుతుంటే బాధతో ‘కూర్చో’ అన్నామే తప్ప ఆయన్ను అవమానించాలని కాదన్నారు.

‘కాళేశ్వరంలోని మూడు బ్యారేజీలకు గాను ఒక్క బ్యారేజీలో ఇబ్బంది జరిగితే దాన్ని రిపేర్‌ చేయండి. రైతులపై మాత్రం కోపం పెంచుకోకండి. కేసీఆర్‌పై కోపం ఉంటే ఆ ప్రాంత రైతాంగంపై కక్ష కట్టొద్దు. మేడిగడ్డ నింపండి. కాళేశ్వరంలో పంపింగ్‌ మొదలుపెట్టండి..’ అని కేటీఆర్‌ సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement