అక్బరుద్దీన్ ఆరోపణలపై సీఎం రేవంత్ స్పందన
ఆ కేసు ఎత్తివేతను కోర్టులో కాంగ్రెస్ పార్టీ సవాల్ చేసినట్లు వెల్లడి
రాష్ట్రానికి నిధుల కోసమే మోదీని అన్నయ్యగా సంబోధించినట్లు వివరణ
సాక్షి, హైదరాబాద్: ప్రధాని రాష్ట్రానికి పెద్దన్న లాంటి వారని, రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు, అనుమతుల విషయంలో సహకరించాలని కోరుతూ తాను మోదీని అన్నయ్య (బడే భాయ్)గా సంబోధించానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూపాయి పోతే 47 పైసలే తిరిగి వస్తున్నాయన్నారు. గుజరాత్, యూపీకి నిధులు ఇచి్చనట్లే తెలంగాణకు సైతం ఇవ్వాలని కోరానని గుర్తుచేశారు.
ప్రధాని, ముఖ్యమంత్రి మధ్య సఖ్యత ఉండాలనే అలా చెప్పినట్టు స్పష్టం చేశారు. బడ్జెట్ పద్దుపై శనివారం చర్చలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ అమిత్ షాపై కేసు ఎత్తివేత గురించి చేసిన ఆరోపణల్లో నిజం లేదని తోసిపుచ్చుతూ ఆయన వివరణ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో చిన్నారులను వినియోగించిన కేసులో కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్‌రెడ్డి పాత్ర లేదని, నిర్వాహకులే దానికి బాధ్యులని తేలడంతో హైదరాబాద్ పోలీసులు వారిపై కేసు ఉపసంహరించుకున్నారని రేవంత్ పేర్కొన్నారు.
టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఫిర్యాదుతోనే వారిపై అప్పట్లో ఎఫ్‌ఐఆర్ నమోదైందన్నారు. కానీ ఆ కేసును ఎత్తేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించిందని చెప్పారు. మోదీని ఎంత పొగిడినా తనకు బీజేపీ వార్డు సభ్యుడి టికెట్ కూడా ఇవ్వదని.. కాంగ్రెస్ పారీ్టయే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అక్బరుద్దీన్‌పై ఉన్న కేసు వివరాలను తెలుసుకుంటానని చెప్పారు.
ఏ జైలో తేల్చుకోవాలని ఎల్‌అండ్‌టీకి స్పష్టం చేశా
ఎంఐఎం గత పదేళ్లు బీఆర్‌ఎస్‌తో చేసిన తప్పుడు దోస్తీతో పాతబస్తీకి చాలా నష్టం జరిగిందని, ఇప్పు డు సరైన దోస్తును గుర్తించారని సీఎం రేవంత్ ఛలోక్తి విసిరారు. రేవంత్ తన బాల్య స్నేహితుడని, సీఎం కుర్చీలో ఆయన్ను చూడటం సంతోషకరమ ని అక్బరుద్దీన్ అనడంతో ఈ మేరకు సీఎం స్పందించారు. పాతబస్తీలో మెట్రో ప్రాజెక్టు నిర్మించలేమని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ చేతులెత్తేసిందని.. ప్రాజెక్టును నిర్మించకపోతే చంచల్‌గూడ జైలుకెళ్తారో లేక చర్లపల్లి జైలుకెళ్తారో తేల్చుకోవాలని ఆ కంపెనీకి తాను స్పష్టం చేసినట్లు సీఎం వెల్లడించారు.
తమకు కావాల్సిన వారి భూము ల ధరలను పెంచుకోవడానికి గత ప్రభుత్వం అవసరం లేకున్నా హైటెక్ సిటీ నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రోలైన్ నిర్మాణానికి టెండర్లు సైతం పిలిచిందని, తాము అధికారంలోకి రాగానే రద్దు చేశామన్నారు. నాటి సీఎం వైఎస్సార్‌తోపాటు నాటి కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి సమ ష్టి కృషితో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు సాకారమైందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా మెట్రో రెండో దశ ప్రాజెక్టు చేపట్టనున్నామని, కేంద్రం 15%, రాష్ట్రం 35%,45% రుణం,5% పీపీపీ విధానంలో నిధులను సమకూరుస్తామని చెప్పారు. కేంద్రం వాటా నిధులు ఇవ్వకున్నా రుణా లు తెచ్చి పూర్తిచేస్తామని అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్న కు బదులిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో మోదీ సవతి సోదరుడి ప్రేమ చూపారంటూ రేవంత్‌ను ఉద్దేశించి అక్బరుద్దీన్ అనడంతో సీఎం స్పందించారు.
అక్బరుద్దీన్ కొడంగల్‌లో పోటీ చేస్తే గెలిపిస్తా
తెలంగాణ వచ్చాక గౌలిగూడ బస్టాప్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో కారిడార్‌ను నిర్మించకుండా గత ప్రభుత్వం పాతబస్తీకి దగా చేసింద ని సీఎం రేవంత్ ఆరోపించారు. గౌలిగూడ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో లైన్ పూర్తిచేస్తామ న్నారు. రెండో విడత ప్రాజెక్టులో భాగంగా ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్‌పోర్టు వరకు కారిడార్ నిర్మిస్తామని ప్రకటించారు.
వచ్చే ఎన్నికలకు ముందే పనులు పూర్తి చేసి చాంద్రాయణగుట్ట (అక్బరుద్దీన్ సొంత నియోజకవర్గం)కు మెట్రోలోనే వచ్చి అక్కడి కాంగ్రెస్ అభ్యరి్థకి ఓటేయాలని కోరతానన్నారు. ఆయన గెలుపునకు సహకరించాలని అక్బరుద్దీన్‌ను కోరారు. తనను సైతం సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి గెలిపించాలని అక్బరుద్దీన్ బదులివ్వగా సభలో కొద్దిసేపు ఆసక్తికర చర్చ జరిగింది. కాంగ్రెస్ బీ–ఫారంపై కొడంగల్ నుంచి అక్బరుద్దీన్ పోటీ చేస్తే తాను దగ్గరుండి గెలిపిస్తానని రేవంత్ ఆఫర్ ఇచ్చారు. చాంద్రాయణగుట్ట నుంచి ఎంఐఎం టికెట్‌పై పోటీ చేస్తామంటే తాము సైతం గెలిపించడానికి సిద్ధమేనని అక్బరుద్దీన్ బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment