AP: ముగ్గురు ఎమ్మెల్సీల ఖరారు | CM YS Jagan finalized candidates for three MLC positions | Sakshi
Sakshi News home page

AP: ముగ్గురు ఎమ్మెల్సీల ఖరారు

Published Thu, Nov 11 2021 2:23 AM | Last Updated on Thu, Nov 11 2021 8:21 AM

CM YS Jagan finalized candidates for three MLC positions - Sakshi

సాక్షి, అమరావతి: మూడు ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఖరారు చేశారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఖాళీ అయిన మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలలో మిగిలిన 11 ఎమ్మెల్సీ స్థానాలకు రెండు, మూడు రోజుల్లోనే అభ్యర్థులను సీఎం ఖరారు చేస్తారని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో బుధవారం ఆయన మాట్లాడుతూ..  ఎమ్మెల్యేల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు శ్రీకాకుళం డీసీసీబీ మాజీ చైర్మన్‌ పాలవలస విక్రాంత్, కర్నూలు జిల్లా నంద్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఇసాక్‌ బాషా, వైఎస్సార్‌ జిల్లా బద్వేలు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిలను సీఎం జగన్‌ ఎంపిక చేశారన్నారు.

మిగిలిన అభ్యర్థుల పేర్లను రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. సామాజిక న్యాయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నారని స్పష్టం చేశారు. ప్రసుత్తం శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ తరఫున ఉన్న 18 మంది ఎమ్మెల్సీల్లో  11 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారేనని తెలిపారు. ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికలు జరగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక సీటును బీసీ (తూర్పు కాపు)కి, మరో సీటు మైనార్టీకి కేటాయించారని వివరించారు.

మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి   

పాలవలస కుటుంబంలో మూడో తరం నేత
ఎమ్మెల్యే కోటాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన పాలవసల విక్రాంత్‌.. పాలవలస కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మూడో తరం నాయకుడు. ఈయన తాత పాలవలస సంఘం నాయుడు, నాయనమ్మ రుక్ముణమ్మ ఉణుకూరు ఎమ్మెల్యేలుగా సేవలందించారు. తండ్రి రాజశేఖరం ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, జెడ్పీ చైర్మన్‌గా సేవలందించారు. విక్రాంత్‌ డీసీసీబీ చైర్మన్‌గా పనిచేశారు.
పేరు: పాలవలస విక్రాంత్‌
పుట్టిన తేదీ: 23–12–1971
చదువు: బీఈ
తండ్రి: పాలవలస రాజశేఖరం, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ జెడ్పీ చైర్మన్‌ 
తల్లి: ఇందుమతి, రేగిడి జెడ్పీటీసీ
భార్య: గౌరీ పార్వతి, పాలకొండ జెడ్పీటీసీ
పిల్లలు: సాయి గణేష్, మణికంఠ కార్తికేయ
పదవులు: వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్‌

రవాణా శాఖ అధికారిగా సేవలందించి..
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎంపికైన దేవసాని చిన్న గోవిందరెడ్డి 1988లో గ్రూపు–1లో ఎంపికై రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా పనిచేశారు. డిప్యూటీ కమిషనర్‌ ట్రాన్స్‌పోర్ట్‌గా పదోన్నతి పొంది 2001లో రాజీనామా చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2004లో బద్వేలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్సార్‌ మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెలకొల్పిన వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2014లో జయరాములు, 2019లో డాక్టర్‌ వెంకట సుబ్బయ్యలను ఎమ్మెల్యేలుగా గెలిపించారు. వెంకటసుబ్బయ్య హఠాన్మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య డాక్టర్‌ సుధను 90వేలకు పైగా మెజారిటీతో గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2015లో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఆ పదవీ కాలం 2021 మే నెలలో ముగిసింది. 
పేరు: దేవసాని చిన్న గోవిందరెడ్డి
పుట్టినతేదీ: 23.02.1956
విద్యార్హత: ఎంటెక్, ఐఐటీ మద్రాస్‌
భార్య పేరు: తులసమ్మ
కుమారులు: గోపీనాథ్‌రెడ్డి, ఆదిత్యానాథ్‌రెడ్డి
కుమార్తె: డాక్టర్‌ సుష్మ, అల్లుడు రమేష్‌రెడ్డి, ఐపీఎస్‌ అధికారి

మైనార్టీ నేతగా.. 
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇసాక్‌బాషా మైనార్టీ వర్గ నేతగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 2018లో వైఎస్సార్‌సీపీ నంద్యాల పట్టణ శాఖ అధ్యక్షుడిగా పని చేసిన ఆయన ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, నంద్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
పేరు: ఇసాక్‌బాషా 
పుట్టిన తేదీ: 4–6–1962 
చదువు: బీకాం 
తల్లిదండ్రులు: జాఫర్‌ హుస్సేన్, జహ్నాబీ 
భార్య: రహ్మద్‌ బీ (గృహిణి) 
పిల్లలు: ఫిరోజ్‌ బాషా, హర్షద్‌ 
పదవులు: గతంలో వైఎస్సార్‌సీపీ నంద్యాల పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే నంద్యాల మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌గా పనిచేస్తున్నారు.      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement