Bhupalpally: Conflict between groups in Congress - Sakshi
Sakshi News home page

ఎన్నికలకు రెండేళ్లు.. అప్పుడే కాంగ్రెస్‌లో సీటు పంచాయితీ

Published Fri, Aug 6 2021 10:56 AM | Last Updated on Fri, Aug 6 2021 1:26 PM

Conflict Between Groups In Bhupalpally Congress - Sakshi

భూపాలపల్లి: కాంగ్రెస్‌ పార్టీలో కుర్చీలాట సాగుతోంది. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీ నాయకులు అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందే భూపాలపల్లి స్థానం తమదంటే తమదంటూ పోటీ పడుతున్నారు. త్వరలోనే పార్టీలో చేరుతానంటూ ఏఐఎఫ్‌బీ నాయకుడు గండ్ర సత్యనారాయణరావు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు భూపాలపల్లిలో పోటీ చేసేది కొండా దంపతులేనంటూ వారి అనుచరులు చెప్పుకుంటుండగా, ఇక్కడ పాగా కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోదరుడు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కుర్చీలాటతో  నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.

రేవంత్‌రెడ్డి రాకతో మారిన సమీకరణాలు..
2009 సంవత్సరంలో భూపాలపల్లి నియోజకవర్గంగా ఏర్పడింది. ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపొందారు. 2014లో టీఆర్‌ఎస్‌ నుంచి సిరికొండ మధుసూదనాచారి గెలుపొందగా 2018లో తిరిగి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపొందారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి మంచి పట్టు ఉండేది. తెలంగాణ ఉద్యమ సమయంలో, రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా మరోమారు కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఆదరించారు. 2018లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడంతో కాంగ్రెస్‌కు ఇక్కడ ఎమ్మెల్యే స్థాయి నాయకుడు లేకుండాపోయాడు. ఈ క్రమంలోనే ఇటీవల టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో కాంగ్రెస్‌లో మళ్లీ జోష్‌ నెలకొంది.

టీడీపీలో ఉన్నప్పటి నుంచే ఏఐఎఫ్‌బీ నాయకుడు గండ్ర సత్యనారాయణరావుకు రేవంత్‌రెడ్డి మధ్య మంచి సాన్ని హిత్యం ఉంది. దీంతో రేవంత్‌ టీపీసీసీ చీఫ్‌ బాధ్యతలు చేపట్టాక సత్యనారాయణరావు కూడా అదే పార్టీలో చేరుతాడని ప్రచారం జరిగింది. ఈ ప్రచారా నికి సత్యనారాయణరావు ఇటీవల తెరదింపారు. కొ ద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డిని కలిసి తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు ప్రకటించారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు అయిత ప్రకాశ్‌రెడ్డితో కలిసి మండలాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్‌ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగుతానని సహకరించాలని సత్యనారాయణరావు కోరుతున్నారు.

కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం..
గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమాలను మంథని ఎ మ్మెల్యే శ్రీధర్‌బాబు ముందుండి నడిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సోదరుడు శ్రీనుబాబు రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. భూపాలపల్లి బరిలో ఉండటం శ్రీనుబాబుకు కూడా ఇష్టమే అని తెలు స్తోంది.  అన్నదమ్ములు రెండు స్థానాల్లో పోటీ చేయ డం సబబు కాదని, శ్రీధర్‌బాబు వద్దని చెప్పినట్లు సమాచారం. మంథని చాలని, భూపాలపల్లిలో పోటీచేసే ఆలోచన లేదని చెపుతున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికీ శ్రీనుబాబు కొంత స్థబ్ధుగా ఉండగా, సత్యనారాయణరావు, కొండా వర్గీయులు మాత్రం ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ సమయంలో ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాసమస్యల పరి ష్కారం కోసం పోరాటాలు చేస్తూ పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకులు కుర్చీల కోసం కుమ్ములాడుతుండటంతో భూపాలపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. 

ఆది నుంచి మేమున్నాం అంటూ..
భూపాలపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలకు ఆది నుంచి కొండా సురేఖ, మురళి దంపతులు అండగా నిలిచారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొండా దంపతుల్లో ఒకరు భూపాలపల్లి నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారని కొండా వర్గీయులు ఇటీవల వెల్లడించారు. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కొండా దంపతులు పార్టీ బాధ్యతలు మోశారని పేర్కొన్నారు. పార్టీలో చేరకముందే ఏఐఎఫ్‌బీ నాయకుడు గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్‌ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి అయోమయానికి గురి చేస్తున్నారని కొండా వర్గీయులు ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement