ఉచిత విద్యుత్‌ మొదలుపెట్టిందే మేం! | Congress Leader Manikrao Thakre Comments On CM KCR | Sakshi
Sakshi News home page

ఉచిత విద్యుత్‌ మొదలుపెట్టిందే మేం!

Published Thu, Jul 13 2023 4:46 AM | Last Updated on Thu, Jul 13 2023 4:46 AM

Congress Leader Manikrao Thakre Comments On CM KCR - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ క్రమంగా బలపడుతుండటం, రైతు డిక్లరేషన్‌కు మంచి స్పందన వస్తుండటంతో.. కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్‌ కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. ఉచిత విద్యు త్‌ అంశంలో కాంగ్రెస్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు రైతులకు ఉచిత విద్యుత్‌ను ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని గుర్తుంచుకోవాలన్నారు.

బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డితో కలసి మాణిక్‌రావ్‌ ఠాక్రే మీడియాతో మాట్లాడారు. వరంగల్‌ రైతు డిక్లరేషన్‌లోనే రైతులకు అందించే ప్రయోజనాలను కాంగ్రెస్‌ ప్రకటించిందని.. మున్ముందు ప్రకటించే డిక్లరేషన్‌లో 24గంటల ఉచిత విద్యుత్‌ అంశం ఉంటుందని వివరించారు. కేసీఆర్‌ పాలన అంతా అవినీతి, అక్రమాల్లో మునిగిపోయిందని మాణిక్‌ రావ్‌ ఠాక్రే ఆరోపించారు. పదేళ్ల పాలనలో కేసీఆర్‌ కుటుంబానికే ప్రయోజనాలు చేకూరాయని, ప్రజలకు చేసిందేమీలేకున్నా అయినా పబ్లిసిటీ మాత్రం బాగా చేసుకుంటున్నారని విమర్శించారు.

బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారాల ముసుగు త్వరలోనే తొలగిపోతుందన్నారు. రైతులకు ప్రతి సందర్భంలో కాంగ్రెస్‌ మేలు చేసిందని, మద్దతుగా నిలిచిందని చెప్పారు. అమెరికాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలను వక్రీకరించి, తప్పుడు అర్థం వచ్చేలా దు్రష్పచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ పేరే ఎత్తని కేసీఆర్‌.. ఇప్పుడు పదే పదే కాంగ్రెస్‌ను ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో పంటల బీమా పథకం ఎందుకు అమలు చేయడం లేదని, రుణమాఫీ హామీ ఎటు పోయిందని నిలదీశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని, అందుకే కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 

ఎకరానికి రూ.15వేలు పెట్టుబడి సాయం: వంశీచంద్‌రెడ్డి 
బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ ఏకమైనా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయమని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి చెప్పారు. వైఎస్‌ హయాంలోనే రైతులకు ఉచిత విద్యుత్‌ను కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభించిందని వివరించారు. రైతులకు ఎకరానికి 15 వేల పెట్టుబడి సాయం ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని, కౌలు రైతులకూ ఎకరానికి 12 వేలు సాయం చేస్తామని పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులకు కొదవలేదు: ఠాక్రే 
తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులకు కొదవలేదని.. తమది కేసీఆర్‌ మాదిరిగా కుటుంబ పార్టీ కాదని మాణిక్‌రావ్‌ ఠాక్రే వ్యాఖ్యానించారు. రేవంత్, ఉత్తమ్, భట్టి, మధుయాష్కీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్కలాంటి ఎంతో మంది సీఎం అభ్యర్థులు ఉన్నారన్నారు. అయితే ఎమ్మెల్యేల అభిప్రాయాల ఆధారంగానే సీఎం ఎంపిక ఉంటుందని, ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థి ప్రకటన ఉండబోదని చెప్పారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement