ఐదుగురితో కాంగ్రెస్ రెండో జాబితా
మల్లు రవి మినహా నలుగురు కొత్తగా పార్టీలో చేరిన నేతలే
దానం, గడ్డం వంశీకృష్ణ, మల్లు రవి, సునీతా మహేందర్‌రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్
ఇద్దరు రెడ్డి, ఇద్దరు ఎస్సీ, ఒక బీసీ..
మొత్తం 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీ చేసే మరో ఐదుగురు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్‌రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి గడ్డం రంజిత్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి బరిలో ఉంటారని తెలిపింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీలో ఆమోదించిన జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం రాత్రి విడుదల చేశారు. తాజాగా ప్రకటించిన ఐదుగురిలో మల్లు రవి మినహా మిగతా నలుగురు కొత్తగా కాంగ్రెస్‌లో చేరినవారే కావడం గమనార్హం.
బీఆర్‌ఎస్ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఇంకా ఆ పార్టీకి రాజీనామా కూడా చేయలేదు. గడ్డం వంశీకృష్ణ తండ్రి గడ్డం వివేకానంద బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి కూడా ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. రెండో జాబితాలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నేతలకు, ఒక బీసీకి, ఇద్దరు ఎస్సీలకు అవకాశం కల్పించింది. తొలి జాబితాతో కలిపి మొత్తం నలుగురు రెడ్డి, ఇద్దరు బీసీ, ఒక ఎస్టీ, ఇద్దరు ఎస్సీ నేతలకు కాంగ్రెస్ చాన్స్ ఇచ్చినట్టయింది.
తొలి జాబితాలో నలుగురి ప్రకటన
కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ స్థానాలపై ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)లో చర్చ జరగలేదు. ఇక భువనగిరి, ఖమ్మం, మెదక్ స్థానాల విషయంలో ఇంకా ఏకాభిప్రాయం రాలేదు. మరోవైపు ఆదిలాబాద్ ఖరారైందనుకున్నా, చివరకు అక్కడ అభ్యర్థిని మార్చాలని భావించారు. దీంతో ఆయా స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన మరో సీఈసీ భేటీకి వాయిదా పడింది. దీంతో ఈ నెల 25 (హోలీ) తర్వాతే వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఇప్పటివరకు 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, మరో 8 సీట్లు పెండింగ్‌లో ఉన్నాయి. తొలి జాబితాలో నలుగురు అభ్యర్థులు.. వంశీచంద్ రెడ్డి (మహబూబ్‌నగర్), బలరాం నాయక్ (మహబూబాబాద్), రఘువీర్ రెడ్డి (నల్లగొండ), సురేష్ షెట్కార్ (జహీరాబాద్) పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఖమ్మంపై మున్షీ భేటీ
గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న ఖమ్మం టికెట్‌కు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు ఈ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ గురువారం ఆ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (మధిర), మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (పాలేరు), తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం), మట్టా రాగమయి (సత్తుపల్లి), రాందాస్‌నాయక్ (వైరా), జారె ఆదినారాయణ (అశ్వారావుపేట) భేటీలో పాల్గొన్నారు. వీరితో ఉమ్మడిగా, విడివిడిగా సమావేశమైన మున్షీ ఖమ్మం నుంచి ఎవరు పోటీ చేస్తే బాగుంటుందన్న దానిపై అభిప్రాయాలు తీసుకున్నారు.
కాంగ్రెస్‌లో చేరిన టీచర్ ఆత్రం సుగుణ
ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉంటారని భావిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ గురువారం కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్కల సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. సుగుణ బుధవారమే తన ఉద్యోగానికి సుగుణ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆమె అభ్యర్థిత్వం ఖరారైనట్టేనని అంటున్నారు. అయితే రిమ్స్‌లో వైద్యురాలిగా ఉన్న సుమలత కూడా ఇటీవల సీఎంను కలిశారు. ఆమె కూడా ఉద్యోగానికి రాజీనామా చేయాలని భావించారు. ఆమె పేరు ఖరారైందనే వార్తలు వెలువడ్డాయి. కానీ తాజాగా ఆత్రం సుగుణ పేరు తెరపైకి వచ్చింది.
రెండు మాలలకా?
మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో రెండు మాలలకు ఇవ్వడంపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాగర్‌కర్నూల్ (మల్లు రవి), పెద్దపల్లి (గడ్డం వంశీ) రెండు స్థానాలను మాలలకే ఎలా ఇస్తారని మాదిగ సామాజిక వర్గం నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే మెదక్ స్థానానికి మంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తె త్రిష పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ నీలం మధు ముదిరాజ్‌కు ఖరారు కాని పక్షంలో త్రిష పేరు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నిజామాబాద్‌లో జీవన్‌రెడ్డి, కరీంనగర్‌లో ప్రవీణ్‌రెడ్డి, హైదరాబాద్‌లో షెహనాజ్ తబుస్సమ్, ఖమ్మంలో పొంగులేటి ప్రసాదరెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. భువనగిరికి చామల కిరణ్ లేదా కోమటిరెడ్డి లక్ష్మిలలో ఒకరు ఖరారయ్యే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment