కాంగ్రెస్ ఎన్నికల నిర్వహణ కమిటీ నివేదిక
13 చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ పోల్ మేనేజ్‌మెంట్‌లో విఫలం
4 నియోజకవర్గాల్లో ఇంకొంత కష్టపడితే బాగుండేది..
బీఆర్‌ఎస్ ఓట్లు బదిలీ కావడం బీజేపీకి అనుకూలంగా మారింది
సాక్షి , హైదరాబాద్ : ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ నియమించిన ఎన్నికల నిర్వహణ కమిటీ తేల్చి చెప్పింది. మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను 13 చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ, పోల్ మేనేజ్‌మెంట్‌లో విఫలమైనట్లు పేర్కొంది. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ కన్వినర్‌గా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, పీసీసీ ఉపాధ్యక్షుడు ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి, పుష్పలీల, రాములు నాయక్ తదితరులు సభ్యులుగా ఏర్పాటైన కమిటీ.. ఈ మేరకు ఒక మధ్యంతర నివేదికను ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీకి సమర్పించింది.
తాము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా గుర్తించిన అంశాలను గురువారం గాం«దీభవన్లో మున్షీకి వివరించింది. బీఆర్‌ఎస్‌ను నిలువరించ గలిగినప్పటికీ, ఆపార్టీ ఓటర్లను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడంలో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని తెలిపింది. బీఆర్‌ఎస్ ఓట్లు బీజేపీకి మళ్లి, కొన్నిచోట్ల కాంగ్రెస్ గెలుపు అవకాశాలను దెబ్బకొట్టినట్లు పేర్కొంది.
13 నుంచి 14 సీట్లు లక్ష్యంగా పనిచేసినా..
లోక్‌సభ ఎన్నికల్లో 13 నుంచి 14 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పార్టీ పనిచేసినప్పటికీ, ఎన్నికల నిర్వహణలో సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లక పోవడం వల్ల నాలుగైదు సీట్లలో వెనుకబడినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది. పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వరంగల్, భువనగిరి, జహీరాబాద్‌లలో ప్రత్యర్థి పారీ్టల కన్నా బలంగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.
కొన్ని నియోజకవర్గాల్లో పోల్ మేనేజ్‌మెంట్‌లో 2 శాతం నుంచి 8 శాతం వరకు మెరుగ్గా ఉంటే, నాలుగైదు నియోజకవర్గాల్లో 25 శాతం వరకు మెరుగైన స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, చేవెళ్ల, నిజామాబాద్, మెదక్ స్థానాల్లో ఇంకొంత కష్టపడి ఉంటే బాగుండేదని, అయినా ఈ నియోజకవర్గాల్లో కూడా గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా పేర్కొన్నట్లు సమాచారం.
మూడుచోట్ల బీజేపీకే అవకాశాలు: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మల్కాజిగిరి, కరీంనగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కాంగ్రెస్ ఎన్నికల నిర్వహణ కమిటీ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించలేదని, అప్పటికి ఇప్పటికీ పార్టీ పురోగతి ఆశించినంత లేదని పేర్కొంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సరైన ప్రణాళికతో ముందుకు వెళితే బాగుండేదని కమిటీ సూచించినట్లు తెలిసింది. బీఆర్‌ఎస్ ఓట్లు బదిలీ కావడం, ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లడం బీజేపీకి అనుకూలంగా మారినట్లు విశ్లేíÙంచింది. టీజేఎస్, సీపీఐ, సీపీఎం పార్టీలతో సమన్వయం లేకపోవడం కూడా కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలను దెబ్బకొట్టినట్లు అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment