సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఏ పార్టీతో పొత్తు ఉండదని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ఎన్నికల సన్నద్ధత మొదలైందని, త్వరలోనే ఎన్నికల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అభ్యర్థులను నిర్ణయిస్తామన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.
బీజేపీ కేడర్ బేస్ పార్టీ అని చెప్పు కొచ్చిన ఆయన.. కేడర్‌తో మాట్లాడిన తర్వాతే అభ్యర్థులపై నిర్ణయం ఉంటుందని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీలో మాదిరి డైనింగ్ టేబుల్‌పై అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించలేమని ఎద్దేవాచేశా రు. సెపె్టంబర్ 17న రాష్ట్ర విమోచన దినం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేపడతామని, ఈ యాత్రలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రజలను కలుస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేతపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, నిర్ణయం సానుకూలంగానే ఉంటుందన్నారు. ప్రధాని పిలుపు మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌పై పన్నులను తగ్గిస్తే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రజలపై ఎనలేని భారం మోపిందని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజులు
సాక్షి, హైదరాబాద్: టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన డీఎడ్, బీఎడ్ అభ్యర్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు ఉన్నాయనడానికి, కేసీఆర్‌ది నియంత పాలన అనడానికి జరుగుతున్న ఘటనలే సాక్ష్యాలన్నారు.
ఇటీవల గ్రూప్–2 పరీక్షల నిర్వహణ వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగులు ధర్నా చేస్తే మహిళలని కూడా చూడకుండా పోలీసులు లాఠీచార్జ్ చేయడం కేసీఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో 13,500 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే.. తూతూమంత్రంగా కేవలం 5వేల పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం దురదృష్టకరమన్నారు.
ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రధాని మోదీ గ్యాస్‌ధరలను తగ్గించి సోదరీమణులకు పండుగ కానుకను అందించారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
పెట్రో ఉత్పత్తులపై అత్యధిక పన్ను ఇక్కడే..
గ్యాస్ సిలిండర్‌పై కేంద్రం రూ.200 తగ్గించడాన్ని కూడా ఎగతాళి చేస్తున్న కల్వకుంట్ల కుటుంబ సభ్యులు.. పెట్రో ఉత్పత్తులకు దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో పన్ను వసూలు చేస్తున్న విషయాన్ని మరిచిపోయారా? అని జి.కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. అత్యధిక పెట్రోల్, డీజిల్ ధరలున్న రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిన విషయాన్ని ఓ సారి గుర్తుచేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment