సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. పవన్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ – జనసేన ఉమ్మడిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రెండు రోజుల క్రితం ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏపీలో టీడీపీ, జనసేన పొత్తుకు బీజేపీ కూడా కలిసి వస్తుందని పవన్ గతంలో పలుమార్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు కిషన్‌రెడ్డి ప్రకటనతో గందరగోళం ఏర్పడింది. దీనిపైనా పవన్, చంద్రబాబు మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. బీజేపీ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాకే కిషన్‌రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారా అన్న దానిపై ఇరువురు నేతలు చర్చించుకొని ఉండొచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోపక్క.. ఈ నెల 20న విజయనగరం జిల్లాలో లోకేశ్ యువగళం యాత్ర ముగింపు కార్యక్రమం జరగనుంది. దీనికి పవన్ రావడంలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శనివారం ప్రకటన చేశారు.
చదవండి : టీడీపీ-జనసేన మధ్య తేడా కొడుతున్న సంబంధాలు!
ఆ కార్యక్రమానికి పవన్ కూడా హాజరైతే టీడీపీకి మేలు జరుగుతుందని లోకేశ్ భావిస్తున్నారు. లోకేశ్ ఒత్తిడితో ముగింపు కార్యక్రమానికి పవన్‌ను ఆహ్వానించేందుకే చంద్రబాబు స్వయంగా పవన్ ఇంటికి వెళ్లినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ వర్గాల కథనం మరోలా ఉంది. ఇరు పార్టీల సీట్ల సర్దుబాటు, రాష్ట్రమంతటా చంద్రబాబు– పవన్ ఉమ్మడిగా సభల ఏర్పాటుకు సంబంధించి ఇరువురు నేతలు చర్చించుకున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికల్లో వ్యూహాలపై చర్చించారు: నాదెండ్ల మనోహర్
చంద్రబాబు, పవన్ భేటీలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అనేక ఇతర అంశాలపై చర్చించినట్లు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. చంద్రబాబు, పవన్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ముందుకెళ్లడానికి సమష్టి కార్యాచరణ తీసుకున్నామన్నారు. వైసీపీని దీటుగా ఎదుర్కోవడానికి, వైసీపీ విముక్త రాష్ట్రాన్ని సాధించేందుకు అవసరమైన అన్ని విషయాల పట్ల పూర్తిస్థాయి చర్చ జరిగిందని తెలిపారు. ఈ భేటీలో చర్చకు వచ్చిన ఇతర కీలకమైన అంశాలపై తర్వాత ప్రత్యేకంగా వెల్లడిస్తామని మనోహర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment