సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు ఉండదని, బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల నుంచి బీజేపీ సమాన దూరం పాటిస్తుందని తేల్చి చెప్పారు. ఈ రెండు పార్టీలను గట్టిగా ఎదుర్కొని, రాష్ట్రంలో అత్యధిక సీట్లలో విజయమే లక్ష్యంగా పార్టీ కేడర్ ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.
శుక్రవారం పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జ్‌లు, లోక్‌సభ ప్రభారీల సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్‌చుగ్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, పి.మురళీధర్‌రావు, బంగారు శృతి, డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్, ఇతరనేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ, మద్దతు లభిస్తుందని, సర్వే సంస్థల అంచనాలకు కూడా అందని పద్ధతుల్లో అనూహ్య ఫలితాలు వస్తాయని చెప్పారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఇప్పటినుంచే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీనాయకులు, కార్యకర్తలను కిషన్‌రెడ్డి కోరారు.
ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పార్టీ, పార్టీనేతలను లక్ష్యంగా చేసుకొని వివిధ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులపై కిషన్‌రెడ్డి సీరియస్ అయ్యారు. జిల్లా అధ్యక్షులు, పార్టీ ఇన్‌చార్జ్‌లతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయిన సందర్భంగా అభ్యంతరకర లేదా కించపరిచే పోస్టులు పెడితే వేటు తప్పదని హెచ్చరించారు.
విశ్వకర్మ కింద.. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు వెయ్యి మంది..
పీఎం విశ్వకర్మయోజన కింద రాష్ట్రంలో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వెయ్యిమంది లబ్దిదారులను నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సూచించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విశ్వకర్మయోజనపై జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పదిలక్షల కుటుంబాలు చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరి నైపుణ్యాభివృద్ధి, గుర్తింపు, ఆర్థిక ప్రగతి కోసం ఈ యోజనను ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment