నాగా వెంకటరెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘చెప్పేటందుకే నీతులు’ అన్న మాట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి అతికినట్లు సరిపోతుంది. మైకు పట్టుకుంటే దళితులు, వారి అభ్యున్నతి అంటూ మాట్లాడే చంద్రబాబు.. పార్టీలో వారికి ఇస్తున్న ప్రాధాన్యత మాత్రం సున్నా. కొన్నిమార్లు దళితుల పట్ల చిన్న చూపును కూడా ఆయన వ్యక్తపరుస్తూ ఉంటారు. పార్టీ వ్యవహారాల్లోకొచ్చేసరికి అదే చిన్నచూపు చేతల్లోనూ కనిపిస్తూ ఉంటుంది.
రాష్ట్రంలోని ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌చార్జిల నియామకం, వారిపై ఆధిపత్యం చెలాయించే బాబు బృందాలే ఇందుకు నిదర్శనం. పేరుకే ఎస్సీలను ఇన్‌చార్జిలుగా నియమించినప్పటికీ, ఆ నియోజకవర్గంలో పార్టీ నిర్మాణం, నిర్వహణ, కార్యక్రమాల అమలులో వారి పాత్ర శూన్యం. ఈ నియోజకవర్గాల్లో బాబు తన వర్గీయులతో వేసిన కమిటీలదే ఆధిపత్యం. వారేమి చెబితే ఇన్‌చార్జిలు, పార్టీ ఇతర నేతలు అది చేయాల్సిందే.
దళితుల పట్ల వ్యతిరేకత, ఆ వర్గాలను చులకన చేసి మాట్లాడటం, పదవుల పంపిణీలో మోసగించడం, రాజకీయంగా ఎదగనీయకపోవడం, ఆ ప్రాంత ముఖ్య నేతల ద్వారా విభేదాలను రాజేయిస్తూ వర్గాలను ప్రోత్సహించడం, ఎన్నికలప్పుడు తమ వర్గీయుల సిఫార్సుల మేరకే అభ్యర్థిత్వాలను ఖరారు చేయడం తొలి నుంచి చంద్రబాబు సాగిస్తున్న తంతే. సీనియర్ దళిత నేతలకూ చుక్కలు చూపించడం బాబు బృందానికి రివాజే.
దళితులపై చిన్న చూపులో తండ్రిని మించిన లోకేశ్
దళితులను చిన్న చూపు చూడటంలో చంద్రబాబు కుమారుడు లోకేశ్ తండ్రిని మించిపోయాడన్న వ్యాఖ్యలు పార్టీలో వినిపిస్తున్నాయి. పాదయాత్రలో కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల పేర్లను ప్రస్తావిస్తూ ఎన్నికల్లో గెలిపించండని లోకేశ్ చెబుతున్నారు. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాల్లో మాత్రం ఆయన ఎవరి పేరూ చెప్పకపోవడం గమనార్హం. రానున్న ఎన్నికల్లో నగరిలో గాలి భానుప్రకాశ్, చంద్రగిరిలో పులివర్తి నానిలను గెలిపించాలని ఆయన చెప్పారు. వాటి పొరుగునే ఉన్న పూతలపట్టు, గంగాధర నెల్లూరు ఇన్‌ఛార్జిల ప్రస్తావనే లోకేశ్ నోటి వెంట రాలేదు.
♦ కొవ్వూరు స్థానాన్ని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఆశిస్తున్నారు. గత ఎన్నికలప్పుడు ఆయన్ని కొవ్వూరు నుంచి తప్పించి తిరువూరుకు పంపగా అక్కడ ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం కంఠమని రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరితో కూడిన ద్విసభ్య కమిటీ అక్కడ ఆధిపత్యం చెలాయిస్తోంది. వీరివురూ బాబు సామాజికవర్గానికి చెందిన వారే. ఇక్కడ వీరిదే హవా. దళితుడైన మాజీ మంత్రి పార్టీ కార్యాలయానికి కూడా వచ్చే అవకాశం లేదు. సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన కార్యక్రమాలేవో ఆయన చేసుకుంటున్నారు.
♦ చింతలపూడి నుంచి మాజీ మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహించగా ప్రస్తుతం అక్కడ ఆమెకు ఇన్‌చార్జి బాధ్యతలు కూడా లేవు. నియోజకవర్గానికి చెందిన గంటా మురళీరామకృష్ణ, గంటా సుధీర్, పరిమి సత్తిపండు, గరిమెళ్ల చలపతి తదితరులదే పెత్తనం.
♦ చంద్రబాబు సొంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరు పరిధిలోని గంగాధర నెల్లూరులో చిట్టిబాబు నాయుడుదే ఆధిపత్యం. పూతలపట్టులో యువరాజు నాయుడు, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో కె.విశ్వనాథ నాయుడు, గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో మాకినేని పెద్దరత్తయ్యలే పార్టీ పెద్దలు. అనంతపురం జిల్లా సింగనమలలో బండారు శ్రావణితో పాటు పలుకుబడి కలిగిన వేర్వేరు సామాజికవర్గాల నేతలు అజమాయిషీ చలాయిస్తున్నారు. కోడుమూరు, నందికొట్కూరు, బద్వేలు స్థానాల్లోనూ ఇదే తంతు.
♦ డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఇన్‌ఛార్జిగా లోక్‌సభ మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్ మాధుర్‌ను నియమించారు. హరీష్ అమలాపురం లోక్‌సభ నియోజకవర్గానికి కూడా ఇన్‌చార్జి. కానీ, ఆయన మాటకు ఇక్కడ విలువ లేదు. నామని రాంబాబు, డొక్కా నాథ్‌బాబు ఎలా చెబితే అలా ఆడాలి.
♦ విజయనగరం జిల్లా రాజాంలో మాజీ మంత్రి కొండ్రు మురళిమోహన్ ఇన్‌చార్జిగా ఉన్నప్పటికీ, అక్కడ రాష్ట్ర పార్టీ మాజీ అ«ధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావుదే ఆధిపత్యం. మాజీ సభాపతి కావలి ప్రతిభా భారతి, ఆమె కుమార్తె కావలి గ్రీష్మకూ పార్టీలో ఎటువంటి విలువా లేదు.
♦ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఇన్‌ఛార్జిగా చావల దేవదత్తుని నియమించినప్పటికీ, ఆయనకు ఏ అధికారమూ లేదు. పార్టీలో హవా అంతా బాబు వర్గానికి చెందిన చెరుకూరి రాజేశ్వరరావు, సుంకర కృష్ణమోహన్‌రావు, నెక్కలపు వెంకట్రావులదే.
ఆర్థికంగా బలవంతులైతే చాలు...
ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ సీనియర్లు ఇటీవల చంద్రబాబుకు, లోకేశ్‌కు ఝలక్ ఇచ్చారు. గుడివాడ పార్టీ బాధ్యతలను నిర్వర్తిస్తున్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు ప్రత్యామ్నాయంగా తండ్రీకొడుకులిద్దరూ కలిసి ఎన్నారై వెనిగండ్ల రామును ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు జిల్లా పర్యటన ఏర్పాట్లపై పలుసార్లు సమావేశమైన సీనియర్లు రాముకు ఆహ్వానం కాదు కదా కనీసం సమాచారాన్ని కూడా ఇవ్వలేదు. దీనిపై రాము అలకబూనారన్న సంగతి తెలియగానే బాబు సీరియస్ అయ్యారు.
నియోజకవర్గాలలో ఎవరైనా పార్టీ కోసం పనిచేయవచ్చని, ఇందుకు ఎవరి అనుమతీ అవసరంలేదని ఫత్వా జారీ చేశారు. దీంతో బాధ్యతలు అప్పగించిన వారు మినహా మరెవరూ నియోజకవర్గ పార్టీ వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదని రాష్ట్ర అధ్యక్షుని హోదాలో అచ్చెన్నాయుడు గతంలో ఇచ్చిన సర్క్యులర్‌కు విలువలేకుండా పోయింది. స్థితిమంతులు, తన వర్గానికి చెందిన నేతల విషయంలో ఒకలా, ఇతర వర్గాల విషయంలో మరోలా బాబు వ్యవహారం ఉంటుందనే పార్టీ నేతల అభిప్రాయానికి గుడివాడ వ్యవహారం ఒక నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment