న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఢిల్లీ(Delhi)లో నేతల విమర్శలు హద్దు మీరుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ సీఎం అతిషి(Atishi)పై బీజేపీ సీనియర్ నేత రమేష్‌బిదూరి (Ramesh Bidhuri) తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నాలుగేళ్లుగా ఢిల్లీ సమస్యలను పట్టించుకోని అతిషి ఎన్నికలు సమీపించిన వేళ ఓట్ల కోసం ఢిల్లీ వీధుల్లో జింకలా పరుగెడుతున్నారని బిదూరి అన్నారు.
ఢిల్లీ ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. నగరంలో వీధుల పరిస్థితి చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. గడిచిన నాలుగేళ్లలో అతిషి ఎప్పుడూ ఈ సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అడవిలో జింకలా ఢిల్లీ వీధుల్లో ఆమె తిరుగుతున్నారని బిదూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతిషి మర్లెనా తన తండ్రిని మార్చి అతిషి సింగ్‌గా మారిందని గత వారం కూడా బిదూరి అతిషిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాగా, రాజకీయ ప్రత్యర్థులపై వివాదాస్పద కామెంట్లు చేయడం బిదూరికి సర్వసాధారణమైపోయింది. బీఎస్పీ నేత డానిష్ అలీని దూషించడం మొదలు.. ఎంపీ ప్రియాంకా గాంధీపైనా వ్యాఖ్యలు చేసి వివాదానికి కారణమయ్యారు. దీనిపై బీజేపీ అధిష్టానం ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. ఢిల్లీ ఎన్నికల్లో కల్కాజి నియోజకవర్గంలో సీఎం అతిషిపై బీజేపీ తరపున బిదూరి పోటీ చేస్తుండడం గమనార్హం.
ఇదీ చదవండి: అతిషి, అల్కాలాంబా ఎవరు ధనవంతులు
Comments
Please login to add a commentAdd a comment