సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నిందితులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేయమని తెలంగాణ ప్రజలు కవిత ను కోరారా అని ఆయన ఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. కవిత తెలంగాణ ప్రజలు సిగ్గుపడే పని చేశారని, దేశంలో తెలంగాణ పరువు తీశారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఇప్పటికే బెల్ట్ షాప్‌లు పెట్టిన ఘనత కేసీఆర్‌ది అని, మద్యంపై వచ్చే ఆదాయాన్ని ప్రధాన వనరుగా మార్చుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ఆ హక్కు కల్వకుంట్ల కుటుంబానికి లేదు
‘మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు కల్వకుంట్ల కుటుంబానికి లేదు. క్యాబినెట్ లో ఒక్క మహిళా లేకుండా మొదటి ప్రభుత్వం నడిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ను అడ్డుకున్నది ఎస్పీ, ఆర్జేడీ పార్టీలే. వారితో అంటకాగుతున్న కేసీఆర్ ఈ విషయాన్ని ఎందుకు అడగడం లేదు. మద్యం కేసులో ఇరుక్కున్న కవిత సానుభూతి కోసం డ్రామా ఆడుతున్నారు.
ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు యాదికి వచ్చింది. రాజ్యసభకు ఒక్క మహిళను కూడా పంపని చరిత్ర కేసీఆర్‌ది. మహిళా రాష్ట్రపతి, కేంద్రంలో అనేక మంది మహిళా మంత్రులు ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా తెలుగు మహిళ ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏకాభిప్రాయం వస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మహిళల హక్కులను కాపాడతాం. కల్వకుంట్ల కవిత కోరిక మేరకు సీబీఐ ఆమె ఇంటికి వచ్చి దర్యాప్తు చేసింది. ఇప్పుడు కూడా వారికి కావాల్సిన సమయం ఇచ్చాం. దర్యాప్తు సంస్థలను రోజూవారి మానిటర్ చేసే తీరికమాకు లేదు. తెలంగాణ లో దోచుకున్నది సరిపోక ఢిల్లీలో మద్యం దందా చేశారు.
మీ అక్రమ మద్యం వ్యాపారానికి , తెలంగాణకు, మహిళలకు ఎందుకు లింక్ పెడుతున్నారు. ఈ వ్యాపారం మహిళల కోసం చేశారా? మీరు అక్రమ వ్యాపారం చేయకపోతే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు. మీకు సంబంధం లేకపోతే లక్షల రూపాయలు సెల్ ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు. ప్రధాని మోదీని టార్గెట్ చేసేంత గొప్పోళ్లు కారు. మీ అంతట మీరు వచ్చి అక్రమ వ్యాపారం చేశారు. మద్యం దందా చేసి, డబ్బులు సంపాదించారు. ఎవరినీ మేము టార్గెట్ చేయడం లేదు. తెలంగాణ ప్రజలు మీ ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నారు’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment