
నరసన్నపేట: మెడికల్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం వంద శాతం సముచితమని శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. ఆయన శనివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం దూకులపాడులో విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ను క్షోభపెట్టింది చంద్రబాబేనని చెప్పారు.
ఎన్టీఆర్‌ను మానసికంగా హింసించిన చంద్రబాబు చివరకు ఆయన చావుకు కారణమయ్యారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ అంటే తమకు కూడా గౌరవం ఉందని, అందుకే ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టామని అన్నారు. టీడీపీ 14 ఏళ్ల పాలనలో ఎందుకు ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టలేకపోయారని ప్రశ్నించారు.
వైఎస్సార్ హయాంలో పలు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారని, వైద్యానికి రాష్ట్రాన్ని హబ్‌గా తీర్చిదిద్దారని, 108, 104, ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని, యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం అభినందనీయమని చెప్పారు. కుప్పంలో శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ సభకు అధికంగా ప్రజలు తరలివచ్చారని, అక్కడ 40 ఇయర్స్ ఇండస్ట్రీ నాయకుడికి పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. అక్కడి ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.