
సాక్షి, మెదక్: దుబ్బాక ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చావోరేవో లాంటిదని, ఆరునూరైనా గెలిచి తీరాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్ అన్నారు. మెదక్ జిల్లాలోని చేగుంట మండలం శివనూర్‌లో మంగళవారం దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని చేగుంట, నార్సింగి మండలాల బూత్ ఇన్‌చార్జీల సమావేశంలో ఠాగూర్ మాట్లాడారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీ గతానికి భిన్నంగా ప్రచార వ్యూహాలను అమలు చేస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులను బూత్ కమిటీ ఇన్‌చార్జీలుగా నియమించినట్లు వెల్లడించారు.
ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. ఈ ఎన్నిక తెలంగాణ కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకమని, ఇక్కడ ఫలితాన్ని అనుకూలంగా రాబట్టి కొత్త ఉత్సాహంతో భవిష్యత్ ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. ఇన్‌చార్జీలు ఎవరూ వారికి అప్పగించిన గ్రామాలు, మండలాల నుంచి బయటకు రావొద్దని ఆదేశించారు. దుబ్బాక ఉపఎన్నికలో విజయం సాధిస్తామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకలో ఈసారి పాత సంప్రదాయానికి భిన్నంగా కాంగ్రెస్ ప్లాన్ చేసిందన్నారు. నియోజకవర్గంలోని 146 గ్రామాలకు పీసీసీలోని 146 మంది ముఖ్యనాయకులను ఇన్‌చార్జీలుగా నియమించామన్నారు. ఇక ఏడు మండలాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కీలక నేతలకు ఇన్‌చార్జీలుగా బాధ్యతలు అప్పగించినట్లు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment